బ్లూచిప్స్ ఫలితాలపై దృష్టి..
న్యూఢిల్లీ: పలు బ్లూచిప్ కంపెనీలు ప్రకటించే రెండో త్రైమాసికం(క్యూ2) ఆర్థిక పలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క, దసరా పండుగ నేపథ్యంలో గురువారం మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. గత వారం వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు కూడా సోమవారం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంచనాలను మించి రిలయన్స్ క్యూ2లో రికార్డు లాభాన్ని(రూ.6,720 కోట్లు) ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ప్రధాన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడియా సెల్యులార్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, హీరోమోటో కార్ప్, బజాజ్ ఆటో, విప్రో, కెయిర్న్ ఇండియా వంటివి ఉన్నాయి. మరోపక్క, బిహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ సరళిని కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని, దీంతో పాటు గ్లోబల్ మార్కెట్ల కదలికలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నట్లు ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర హెచ్చుతగ్గులు, కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు సమీప కాలంలో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఇక విదేశీ పరిణామాల విషయానికొస్తే.. నేడు(సోమవారం) చైనా ఈ ఏడాది మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలను వెల్లడించనుంది.
గత వారం మార్కెట్...
ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా వేయొచ్చనే అంచనాలు బలపడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారంలోనూ లాభాలను కొనసాగించింది. గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 27,214 వద్ద స్థిరపడింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 48 పాయింట్ల లాభంతో 8,238 వద్ద ముగిసింది.
మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల జోరు...
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మళ్లీ దేశీ మార్కెట్లో పెట్టుబడుల జోరును పెంచుతున్నారు. గత రెండు నెలల్లో భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో దాదాపు రూ.17,000 కోట్ల నిధులను నికరంగా వెచ్చించారు. ఈ నెల ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.3,295 కోట్లు, డెట్(బాండ్స్) మార్కెట్లో రూ.13,695 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు.
ముఖ్యంగా ఆర్‌బీఐ రేట్ల కోత, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా అంచనాలు దీనికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. విదేశీ మార్కెట్ల భారీ పతనం కారణంగా ఆగస్ట్‌లో రూ.17,524 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.5,784 కోట్లను దేశీ మార్టెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.