టీసీఎస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్.. ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్(2015-16, క్యూ2)లో కంపెనీ రూ.6,085 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో నమోదైన రూ.5,244 కోట్లతో పోలిస్తే లాభం 16 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.23,816 కోట్ల నుంచి రూ.27,165 కోట్లకు పెరిగింది. ఇక డాలరు రూపంలో చూస్తే... ఆదాయం 3 శాతం పెరిగి 4.156 బిలియన్లుగా నమోదైంది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 3.9 శాతం వృద్ధి చెందింది.
కాగా, పోటీ కంపెనీ ఇన్ఫోసిస్ డాలరు ఆదాయాల వృద్ధి(6 శాతం, స్థిర కరెన్సీ లెక్కన 6.9 శాతం)తో పోల్చుకుంటే టీసీఎస్ వెనుకబడటం గమనార్హం. ఇక మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ2లో టీసీఎస్ రూ.6,052 కోట్ల నికర లాభాన్ని, రూ.27,230 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు.
సీక్వెన్షియల్‌గా...
ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1)లో కంపెనీ నికర లాభం రూ.5,710 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 6.5 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆదాయం కూడా క్రితం త్రైమాసికంతో(రూ.25,668 కోట్లు) పోలిస్తే 5.8 శాతం పెరిగింది.
ఇతర ముఖ్యాంశాలు...
* రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ.5.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
* క్యూ2లో టీసీఎస్ నిర్వహణ మార్జిన్లు 27.1 శాతంగా నమోదయ్యాయి.
* జూలై-సెప్టెంబర్ కాలంలో స్థూలంగా 25,186 మంది సిబ్బందిని కంపెనీ నియమించుకుంది. అయితే, 14,501 మంది వలసపోవడంతో నికర నియామకాలు 10,685కే పరిమితమయ్యాయి. దీంతో సెప్టెంబర్ చివరినాటికి టీసీఎస్, దాని అనుబంధ సంస్థల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,35,620కి చేరింది.
* కంపెనీలో ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) సెప్టెంబర్ త్రైమాసికంలో 16.2 శాతంగా నమోదైంది.
* సెప్టెంబర్ క్వార్టర్‌లో 25 వేల మందిని కొత్తగా నియమించుకోవడం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా నిలిచిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్, హెచ్‌ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ చెప్పారు.
* {పస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ లక్ష్యాన్ని కూడా టీసీఎస్ పెంచింది. 60 వేల మందిని కొత్తగా నియమించుకోవాలని గతంలో నిర్ణయించగా.. దీన్ని తాజాగా 75 వేలకు పెంచింది. గడిచిన కొద్ది క్వార్టర్లలో వ్యాపారం పుంజుకోవడంతో పాటు వలసలను తగ్గించడంలో భాగంగా కంపెనీ ఈ చర్యలు చేపడుతోంది.
* క్యూ2లో 100 మిలియన్ డాలర్లకు మించిన కాంట్రాక్టులు మూడు, 10 మిలియన్ డాలర్లకు పైబడిన ఆరు డీల్స్‌ను కంపెనీ దక్కించుకుంది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో స్వల్పంగా 0.19 శాతం లాభపడి రూ.2,597 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
స్థిర కరెన్సీ ప్రాతిపదికన క్యూ2లో పటిష్టమైన వృద్ధిని నమోదుచేశాం. ముఖ్యంగా కాంట్రాక్టుల అమల్లో వేగం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, రిటైల్, లైఫ్‌సెన్సైస్ రంగాలకు చెందిన వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా మెరుగైన పనితీరు దీనికి దోహదం చేసింది. కీలకమైన ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి ఆదాయాలు పుంజుకోవడం కూడా తాజా ఫలితాల్లో ప్రతిబింబించింది. భారత్‌తో పాటు లాటిన్ అమెరికా ఇతరత్రా వర్ధమాన మార్కెట్ల వ్యాపారాల్లోనూ మంచి పురోగతి నమోదైంది. ఆదాయాల్లో డిజిటల్ విభాగం నుంచి 13 శాతం వృద్ధిని సాధించాం.
- ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ ఎండీ, సీఈఓ