టీసీఎస్ బోణీ బాగుంది..! | Inline June 2016 growth but trend in volume growth looks depressed | Sakshi
Sakshi News home page

టీసీఎస్ బోణీ బాగుంది..!

Published Fri, Jul 15 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

టీసీఎస్ బోణీ బాగుంది..!

టీసీఎస్ బోణీ బాగుంది..!

క్యూ1లో నికర లాభం రూ.6,317 కోట్లు;10 శాతం వృద్ధి
సీక్వెన్షియల్‌గా 0.4 శాతం స్వల్ప తగ్గుదల...
ఆదాయం 14 శాతం అప్; రూ. 29,305 కోట్లు
ఉత్తర అమెరికా, యూరప్‌లో భారీ కాంట్రాక్టుల తోడ్పాటు
షేరుకి రూ. 6.50 మధ్యంతర డివిడెండ్

ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలతో బోణీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో రూ.6,317 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,747 కోట్లతో పోలిస్తే 9.9 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా 14.2 శాతం వృద్ధితో రూ. 29.305 కోట్లకు దూసుకెళ్లింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 25,668 కోట్లుగా ఉంది. ప్రధానంగా డిజిటల్ టెక్నాలజీ సేవల ఆదాయాలు పుంజుకోవడం, కీలకమైన అమెరికా, యూరప్ తదితర మార్కెట్లలో భారీస్థాయి డీల్స్ తోడ్పడ్డాయి. గడిచిన ఆరు త్రైమాసికాల్లో కంపెనీకి ఇదే అత్యుత్తమ ఫలితాలు కావడం గమనార్హం. మార్కెట్ విశ్లేషకులు క్యూ1లో కంపెనీ రూ. 6,038 కోట్ల నికర లాభాన్ని, రూ.29,300 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.

 సీక్వెన్షియల్‌గా చూస్తే...
గతేడాది నాలుగో త్రైమాసికం(క్యూ4)లో నికర లాభం(రూ.6,347 కోట్లు)తో పోల్చిచూస్తే.. సీక్వెన్షియల్‌గా టీసీఎస్ క్యూ1 లాభం స్వల్పంగా 0.4 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం రూ. 28.449 కోట్లతో పోలిస్తే 3 శాతం వృద్ధి చెందింది. ఇక డాలర్ల రూపంలో ఆదాయం సీక్వెన్షియల్‌గా 3.7 శాతం పెరుగుదలతో 4.362 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్యూ1లో కరెన్సీ విలువల పరంగా తీవ్ర హెచ్చుతగ్గులు, ఉద్యోగులకు వార్షిక వేతనాల పెంపు(8-12% మేర), ప్రమోషన్లు వంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ... ప్రాజెక్టుల మెరుగైన నిర్వహణ, ఆర్థికపరమైన క్రమశిక్షణ కారణంగా వాటన్నింటినీ అధిగమించగలిగామని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) రాజేశ్ గోపీనాథన్ పేర్కొన్నారు.

 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
క్యూ1లో టీసీఎస్ నిర్వహణ మార్జిన్ 25.1 శాతంగా నమోదైంది. ఇక నిర్వహణ లాభం 8.9 శాతం వృద్ధితో రూ. 7,347 కోట్లకు చేరింది.

ఇతర ఆదాయం గతేడాది క్యూ1లో రూ.779 కోట్లు కాగా, ఈ క్యూ1లో రూ.975 కోట్లకు ఎగసింది.

5 కోట్ల డాలర్ల విభాగంలో టీసీఎస్ కొత్తగా క్యూ1లో నాలుగు కాంట్రాక్టులను దక్కించుకుంది.  2 కోట్ల డాలర్ల విభాగంలో ఆరు కాంట్రాక్టులు లభించాయి.

రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 6.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ డెరైక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది.

క్యూ1లో ముఖ్యంగా యూరప్(బ్రిటన్ మినహా) వ్యాపారంలో 2.8 శాతం వృద్ధి నమోదైంది. ఒక్క బ్రిటన్ వ్యాపారాన్ని చూస్తే ఇంకా మెరుగ్గా 3.8 శాతం(65 కోట్ల డాలర్లు) పెరిగింది.

ఉత్తర అమెరికా వ్యాపార వృద్ధి 2.5 శాతం(2.33 బిలియన్ డాలర్లు)గా ఉంది.

భారత్ వ్యాపారం కూడా భారీ స్థాయిలో 8.5 శాతం వృద్ధి(27 కోట్ల డాలర్లు) చెందింది. ప్రధానంగా దేశీ కార్పొరేట్ కంపెనీలు టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవడం దీనికి కారణం.

ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ స్థూలంగా 17,792 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 9,552 మంది ఉద్యోగులు వలసపోవడంతో(అట్రిషన్) నికర నియామకాలు క్యూ1లో 8,236గా నమోదయ్యాయి. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. 13.6 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో ఇది 15.5 శాతంగా ఉంది.

జూన్ చివరి నాటికి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 3.62 లక్షలకు చేరింది.

టీసీఎస్ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 1.16% పెరిగి రూ.2,520కు చేరింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

ప్రాజెక్టుల పటిష్ట నిర్వహణతో పాటు క్లయింట్లు క్లౌడ్, బిగ్ డేటా ఎనలిటిక్స్ వంటి డిజిటల్ టెక్నాలజీలవైపు ఎక్కువగా దృష్టిసారిస్తుండటం మాకు కలిసొస్తోంది. అన్నివిభాగాల పరిశ్రమలు, మార్కెట్ల వ్యాప్తంగా వ్యాపార వృద్ధిని సాధిం చేందుకు ఇది దోహదం చేసింది. సీక్వెన్షియల్‌గా లాభం కాస్త తగ్గినప్పటికీ... గడిచిన ఆరు త్రైమాసికాల్లో ఈ క్వార్టర్‌లోనే అత్యుత్తమ పనితీరును సాధించగలిగాం. ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికాతో పాటు దేశీ వ్యాపారంలోనూ వృద్ధి జోరందుకోవడం దీనికి కారణం. కొత్త తరం డిజిటల్ టెక్నాలజీల్లో ఇప్పటివరకూ 1.65 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చాం. క్యూ1లో మా ఆదాయంలో డిజిటల్ సేవల విభాగం నుంచి 15.9 శాతం నమోదైంది. సుశిక్షితులైన డిజిటల్ నిపుణులను తయారుచేయడానికి మేం చేస్తున్న పెట్టుబడులు, శిక్షణ కార్యక్రమాల కారణంగా కంపెనీలో అట్రిషన్ రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది.  - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ ఎండీ, సీఈఓ

బ్రెగ్జిట్ ప్రభావం లేనట్టే...
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) కారణంగా టీసీఎస్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావమేదీ ఇప్పటివరకూ కన్పించలేదని కంపెనీ చీఫ్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. బ్రెగ్జిట్ తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ‘బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత ఫైనాన్షియల్ ఇతరత్రా రంగాలకు చెందిన కీలకమైన క్లయింట్లతో మా సంప్రదింపులను పరిశీలిస్తే.. వ్యాపారానికి సంబంధించి ప్రతికూలంగా(ఐటీ వ్యయాల్లో కోత, ప్రైసింగ్ తగ్గింపు) ఎలాంటి సంకేతాలూ రాలేదు. రానున్న రోజుల్లో బ్రెగ్జిట్ కారణంగా తలెత్తే మార్పులకు అనుగుణంగా మా వ్యూహాలను అమలు చేస్తాం. తగిన చర్యలు చేపడతాం. మా బ్రిటన్ అనుబంధ సంస్థ డిలి జెంటా కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదు’ అని చంద్రశేఖరన్ వివరిం చారు. టీసీఎస్ మొత్తం వ్యాపారంలో యూరప్ వాటా ప్రస్తుతం 26 శాతంగా ఉంది. ఇక క్యూ1 ఆదాయంలో బ్రిటన్ నుంచి 14.8 శాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement