ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు
న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్–ఇరాన్‌ల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరులో భారతీయులు చిక్కుకున్నారు. తమ చమురునౌకను బ్రిటన్ స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిగుండా వెళుతున్న బ్రిటిష్ చమురు నౌక ‘స్టెనా ఇంపెరో’ను ఇరాన్ శుక్రవారం స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా, వీరిలో కెప్టెన్ సహా 18 మంది భారతీయులే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత విదేశాంగ శాఖ ఈ 18 మందిని విడిపించేందుకు ఇరాన్‌తో చర్చిస్తోంది.
చెరలోని భారతీయ సిబ్బందిని త్వరలో స్వదేశానికి తీసుకొస్తామని విదేశాంగ కార్యదర్శి రవీశ్ తెలిపారు. ఈ విషయమై హోర్ముజ్‌గన్ ప్రావిన్సు నౌకాశ్రయాలు, మారిటైమ్ డైరెక్టర్ జనరల్ అల్హమొరాద్ మాట్లాడుతూ..‘బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టెనా ఇంపెరో’ నౌక ఇరాన్‌కు చెందిన చేపల బోటును ఢీకొట్టింది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించింది. ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కెప్టెన్ సహా 18 మంది భారతీయులు కాగా, రష్యా, ఫిలిప్పీన్స్, లాత్వియా, ఇతర దేశాలకు చెందిన ఐదుగురు ఉన్నారు’ అని తెలిపారు.
స్వీడన్‌కు చెందిన స్టెనా బల్క్ అనే కంపెనీ ఈ నౌకను బ్రిటన్ కేంద్రంగా నిర్వహిస్తోంది. ఈ విషయమై స్టెనా బల్క్ ప్రెసిడెంట్ ఎరిక్ హనెల్ మాట్లాడుతూ..‘మా నౌక హోర్ముజ్ జలసంధిలో ఉండగానే మరో చిన్నపాటి నౌక, హెలికాప్టర్ దాన్ని సమీపించాయి. అంతర్జాతీయ జలాల్లోకి ‘స్టెనా ఇంపెరో’ ప్రవేశించిన కొద్దిసేపటికే సౌదీఅరేబియాలోని జుబైల్ నగరంవైపు కాకుండా దిశను మార్చుకుని ఇరాన్‌వైపు వెళ్లింది’ అని చెప్పారు. ఈయూ ఆంక్షలను ఉల్లంఘించి సిరియాకు ముడిచమురు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో ఇరాన్‌కు చెందిన చమురు నౌకను బ్రిటిష్ మెరైన్లు జీబ్రాల్టర్ జలసంధి వద్ద ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.