ఎండ తీవ్రతకు ఇద్దరు కూలీలు మృతి
కృష్ణా జిల్లా : ఎండ తీవ్రతకు మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మిర్చి కోతకు వెళ్లిన ఓ మహిళ ఎండ తీవ్రతకు తాళలేక చనిపోయింది. గ్రామానికి చెందిన మరియమ్మ(35) శనివారం స్థానిక రైతు చేనులో మిర్చి కోతకు వెళ్లింది. ఎండ తీవ్రతకు తాళలేక ఆమె మధ్యాహ్నంకల్లా నీరసించి అక్కడికక్కడే పడిపోయింది. ప్రథమ చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు విడిచింది.
అలాగే శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం దూగనపుటుగ గ్రామానికి చెందిన రాజులమ్మ(60) శనివారం జీడి పిక్కలు తీసే పనికి వెళ్లింది. ఎండలో మధ్యాహ్నం వరకు పనిచేసిన ఆమె తీవ్ర నీరసం కారణంగా ఇంటికి చేరుకుంది. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ప్రాథమిక చికిత్సకు తరలించారు. వైద్యం చేస్తుండగానే పరిస్థితి విషమించి రాజులమ్మ చనిపోయింది.