పోటాపోటీగా రాతిదూలం పోటీలు
గార్లదిన్నె (శింగనమల) : గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం మండల కేంద్రం గార్లదిన్నెలోని ఇందిరమ్మ కాలనీ షిర్డిసాయిబాబా దేవాలయం వద్ద ముంటిమడుగు యల్లారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. పోటీల్లో 20 జతల వృషభాలు పాల్గొన్నాయి. అనంతపురానికి చెందిన ఓబుళపతి ఆచారి వృషభాలు 5,500 అడుగులు రాతిదూలం లాగి విజేతగా నిలిచాయి. కర్నూలు జిల్లా సంకలాపురం గంగుల బ్రహ్మయ్య వృషభాలు ద్వితీయ, వైఎస్సార్ జిల్లా తంపెట్ల రవీంద్రారెడ్డి వృషభాలు తృతీయ, గుత్తి మండలం నేమతాబాద్ సూర్యనారాయణరెడ్డి వృషభాలు నాలుగో స్థానం, పెద్దవడగూరు మండలం చాగల్లు ఆదినారాయణ వృషభాలు ఐదో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులకు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.2500 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు విశాలాక్షి, ముంటిమడుగు కేశవరెడ్డి, గేట్ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ రామక్రిష్ణ, మహేంద్రనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.