‘పేరు మార్చుకున్న చంద్రబాబు’
అమరావతి: ‘టీడీపీ, బీజేపీ మూడేళ్ళ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరును అబద్ధాల నాయుడుగా మార్చుకున్నారు. టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. అవినీతి, దోపిడి, అరాచకాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారింద’ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ మూడేళ్ల పాలనపై ఈ రోజు ఆయన ‘దోపిడి బాబు’ పేరుతో ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదబాబు, చినబాబు, టీడీపీ నేతలు కలిసి ఇసుకలో రూ. 29 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. చంద్రబాబు మూడేళ్ళుగా అన్నం తినడం లేదు ఇసుక తింటున్నారని ఎద్దేవా చేశారు.
‘సాగు నీటి ప్రాజెక్టు అంచనాలను 34 వేల కోట్ల నుంచి 74 వేల కోట్లకు పెంచేశారు. భూములు కోసం టీడీపీ మంత్రులు వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఎమ్మెల్సీలు జైలుకు పోతున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య రాజీ కోసమే చంద్రబాబు త్రిసభ్య కమిటీ వేశారు. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగితే దానిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. తన అవినీతి వల్లే ప్రత్యేక హోదాపై రాజీపడ్డారు.
ఏపీలో చినబాబుకు ఒక్కడికే జాబ్ వచ్చింది. బ్యాంకులకు టీడీపీ నాయకులు వేల కోట్లు ఎగ్గొట్టారు. టీడీపీ ఆర్థిక నేరస్థులను పెంచిపోషిస్తోంది. టీడీపీ నేతలు అధికారలోకి వచ్చిన తరువాత రూ. 3 లక్షల కోట్లు దోచుకున్నారు. బాబు మీడియా గొంతు నొక్కుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాను అనేక ఇబ్బందులు పెడుతున్నార’ని రఘువీరా మండిపడ్డారు.