డోరెమాన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ వాయిస్ మూగబోయింది
ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్స్‌లో డోరెమాన్ ఒకటి. చిన్నారులు ఎంతో ఇష్టపడే డోరెమాన్‌కు చాలా క్రేజ్ ఉంది. డోరెమాన్ కార్టూన్ సిరీస్ చిన్న పిల్లలకు చాలా ఇష్టం. ఈ సిరీస్‌లో డోరెమాన్, షుజుకా, నోబితా, జియాన్, సునియో క్యారెక్టర్స్‌ను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఈ డోరెమాన్ క్యారెక్టర్‌కు వాయిస్ ఇచ్చిన జపనీస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా మృతి చెందారు. ఈ కార్టూన్ సిరీస్‌లో 1979-2005 వరకు డోరెమాన్‌కు వాయిస్ ఇచ్చారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది.అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం జపనీస్ వాయిస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా (90) వయోభారంతో సెప్టెంబర్ 29న మరణించారు. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించకపోవడంతో బయటికి రాలేదు. తాజాగా శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు మరణం పట్ల ప్రకటన విడుదల చేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ వార్తను ఆలస్యం చేసినందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపారు. నోబుయోపై చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. 1933లో టోక్యోలో జన్మించిన నోబుయో ఒయామా వాయిస్ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. సినిమాలు, షోలు, సిరీస్‌లలో వివిధ పాత్రలకు ఆమె డబ్బింగ్ చెప్పేవారు. సూపర్ మ్యాన్ జాంబోట్- 3లో కప్పే జిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. 1964లో సహ నటుడైన కీసుకే సగావాను వివాహం చేసుకున్నారు. 1979లో డోరెమాన్ ప్రారంభమైనప్పటి నుంచి 2005 వరకు నిరంతరాయంగా తన వాయిస్ అందించారు.