double compensation
-
రెట్టింపు ఇస్తామని 100 కోట్ల మోసం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ జనానికి గాలం వేసి రూ.100 కోట్లకు పైగా బురిడీ కొట్టిన దంపతులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. సేలం రెడ్డిపట్టి అంబేద్కర్‌నగర్‌కు చెందిన మణివణ్ణన్ (38), ఇందుమతి (33) దంపతులు తమ బంధువులతో కలిసి సేలం–ఓమలూరు రోడ్డులో ఆర్‌ఎంవీ గ్రూప్ సంస్థ ప్రారంభించారు. తమ సంస్థలో డబ్బు డిపాజిట్ చేస్తే వంద రోజుల్లో రెట్టింపు, మరింత కాలం డిపాజిట్‌గా ఉంచితే 25 శాతం వడ్డీ చెల్లిస్తామని ఆశచూపారు. పోగైన భారీ సొమ్ముతో మణివణ్ణన్ ఫొటోలు దిగి డిపాజిట్‌దారులకు పంపేవాడు. భారీగా సమకూరిన కోట్లాది రూపాయలతో మణివణ్ణన్ దంపతులు గత ఏడాది ప్రారంభంలో దుబాయ్‌కు పారిపోయారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన దంపతులు రెండు రోజుల క్రితం సేలంకు రాగా పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. దంపతుల నుంచి రెండు లగ్జరీ కార్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 13 సెల్ఫోన్లు, రెండు బంగారు గాజులు, పది సవర్ల బంగారు చైను, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాల వివరాలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సేకరిస్తున్నారు. -
భవన కార్మికులకు భరోసా
పరిహారాలు రెట్టింపు చేసిన ప్రభుత్వం ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు శాశ్వత అంగవైకల్యానికి రూ.3 లక్షలు హైదరాబాద్: గుర్తింపు పొందిన భవన, పరిశ్రమల కార్మికులపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వర్తించే పథకాలకు పరిహారాన్ని దాదాపు రెట్టింపు చేసింది. పెళ్లి నుంచి అంత్యక్రియల వరకు అన్ని అవసరాల్లోనూ ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్ సోమవారం ఈ మేరకు పలు ఉత్తర్వులు జారీ చేశారు. అవి 2015 మే 1వ తేదీ నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. వివరాలివీ... ప్రమాదంలో చనిపోతే: కార్మికుని కుటుంబీకులకు ఉమ్మడి రాష్ట్రంలో రూ.2 లక్షలిచ్చేవారు. దాన్నిప్పుడు రూ.5 లక్షలకు పెంచారు. దహన సంస్కారానికి రూ.20 వేలిస్తారు. పెళ్లికానుక: 18 ఏళ్లు నిండిన అవివాహితలకు పెళ్లి కానుకగా రూ.10 వేలు. కార్మికురాలి కూతుళ్ల పెళ్లిళ్లకు కూడా (ఇద్దరికి) పదేసి వేలిస్తారు. ప్రసవానికి: రూ.20 వేలు (రెండు ప్రసవాల వరకు) ఇస్తారు. ఇది కార్మికుడి భార్యకూ వర్తిస్తుంది. సహజ మరణానికి: కుటుంబ సభ్యులకు రూ.60 వేలు ఇస్తారు. దహన సంస్కారానికి మరో రూ.20 వేలిస్తారు. శాశ్వత అంగవైకల్యానికి: జీవనోపాధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో రూ.2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.3 లక్షలకు పెంచారు. పాక్షిక వైకల్యానికి: జీవనోపాధికి నెలకు రూ.3 వేలు ఇస్తారు. గుండెపోటు, మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్ బాధితులకూ ఇది వర్తిస్తుంది.