ఆస్పత్రిలో సిద్ధూ
న్యూఢిల్లీ: నవ్జోత్ సింగ్ సిద్ధూ అంటే క్రికెటర్ మాత్రమే కాదు... మాటల మాంత్రికుడు. అతనిలో ఉరిమే ఉత్సాహం, హాస్యం కలగలిసి సెలయేరులా పదాల ప్రవాహం సాగిపోతుంది. మ్యాచ్ ఏదైనా కామెంటరీతో ఆనందాన్ని రెట్టింపు చేసే సిద్ధూ ఇప్పుడు దానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. అతను ప్రమాదకరమైన ‘డీప్ వీన్ త్రోంబోసిస్’ వ్యాధి బారినపడటం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది.
నరాల్లో రక్తం గడ్డకట్టే ఈ వ్యాధితో అతను మంచాన పడ్డాడు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. ఇలాంటి స్థితిలోనూ సిద్ధూ సై్థర్యం కోల్పోలేదు. ‘కొంచెం కుంగిపోయాను కానీ పూర్తిగా కుప్పకూలిపోలేదు (డౌన్ బట్ నాటౌట్), ప్రాణాంతకమైన వ్యాధి డీవీటీ వచ్చింది. దేవుని దయ వల్ల కోలుకుంటా. జీవితం చాలా సున్నితమైంది. ప్రార్థనలతో కాపాడుకోవాలి’ అని దేవునిపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు.