‘పునర్జన్మ’ ప్రాప్తిరస్తు
మూడేళ్లలో 139 మంది అవయవ దానం
636 మందికి పునర్జన్మ
ముందుకు వచ్చిన మరో పది వేల మంది దాతలు
నేడు అవయవదాన దినోత్సవం
మరణం అంటే తిరిగి జన్మించడమే... కాదంటారా... ఇదిగో వందలాది మంది తాము మరణిస్తూ మరోసారి బతికేస్తున్నారు. మరెందరికో బతుకునిస్తున్నారు. మృత్యువుకు చేరువైనవారికి కొత్త ఊపిరిలూదుతున్నారు. వారి హృదయ స్పందనవుతున్నారు. తమ కళ్లతో లోకాన్ని చూపిస్తున్నారు. ‘అవయవ దానం’ మృత్యువును జయిస్తోంది. నేడు అవయవదాన దినోత్సవంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...!
సిటీబ్యూరో: మనం జీవించకపోయిన మన కళ్లు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. మనం శ్వాసించక పోయిన మన గుండె ‘లబ్ డబ్’ మంటూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనం ఏ లోకంలో ఉన్నా మన మూత్ర పిండాలు ఇక్కడ రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మృత్యువును జయించిన వారంతా దేవతలైతే... ఆ జాబితాలో అవయవాలను దానం చేసిన వారు కూడా చేరుతారు. కేవలం బ్రెయిన్‌డెడ్ బాధితుల నుంచే కాదు, లైవ్ డోనర్స్ కూడా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తుండటంతో నగరంలో ఇటీవల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు అరుదైన శస్త్ర చికిత్సలకు, ఫార్మా కంపెనీలకు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రసిద్ధి పొందిన ఆరోగ్య రాజధాని హైదరాబాద్ తాజాగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
ఎంతోమంది ముందుకు వస్తున్నారు
2002-2012 వరకు మోహన్ ఫౌండేషన్ ద్వారా 155 దాతల నుంచి సుమారు వెయ్యి అవయవాలను సేకరించి, 854 మందికి పునర్జన్మను ప్రసాదిస్తే, 2013 నుంచి 2015 ఆగస్టు 10 వరకు నిమ్స్ జీవన్‌ధాన్ ద్వారా 139 దాతల నుంచి వెయ్యికిపైగా అవయవాలను సేకరించి 636 మందికి పునర్జన్మను ప్రసాదించారు. తాము చనిపోయిన తర్వాత తమ శరీరంలోని అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తూ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పదివేల మందికిపైగా దాతలు ముందుకు రావడం విశేషం. వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో కనీసం 20 మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. కాలేయాన్ని 10 నుంచి 12 గంటల లోపు, మూత్రపిండాలను 24 గంటల లోపు, గుండెను 4గంటల్లోపు, కళ్లను ఆరు నుంచి ఎనిమిది గంటల్లోపు అమర్చాల్సి ఉంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు షురూ..
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఒక్కో శస్త్రచికిత్సకు సుమారు రూ.15-25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు కేవలం ధనవంతులు, విదేశీయులు మాత్రమే ఈ తరహా చికిత్సలు పొందేవారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఈ ఖరీదైన శస్త్రచికిత్సలను ఉచితంగా అందించాలని భావించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించింది. ఉస్మానియా, నిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఇటీవల ఇద్దరు నిరుపేద రోగులకు ఉచితంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
ఆపన్నులకు అండగా జీవన్‌దాన్
2012లో ప్రభుత్వం నిమ్స్ కేంద్రంగా జీవన్‌దాన్ నోడల్ కేంద్రాన్ని ప్రారంభించింది. 2013 నుంచి ఆర్గాన్స్ సేకరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 28 ఆస్పత్రులు జీవన్‌దాన్ ఆన్లైన్ నెట్‌వర్క్‌లో పేరు నమోదు చేసుకున్నాయి. దరఖాస్తు చేసుకున్న బాధితులకు వయసు, ఆరోగ్య పరిస్థితి వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని అవయవాలు సమకూరుస్తున్నాం. ఇప్పటి వరకు 139 దాతల నుంచి వెయ్యికిపైగా అవయవాలను సేకరించి 636 మందికి పునర్జన్మను ప్రసాదించగలిగాం. - డాక్టర్ స్వర్ణలత, ఇన్చార్జీ, జీవన్‌దాన్
తొలుత బాధపడ్డా
నా భర్త ఫ్రాన్సిస్ అవయవాలను దానం చేసి తప్పు చేశానేమోనని చాలా రోజులు బాధపడ్డాను. కానీ ఆ తర్వాత అవయవదానం గొప్పతన ం తెలుసుకున్నాను. నా భర్త అవయవాలను ఇతరులకు దానం చేసినందుకు ఎంతో గర్వపడుతున్నా.
- విజయ, దాత ఎస్పీ ఫ్రాన్సిస్ సతీమణి
నలుగురికి పునర్జన్మ
అక్టోబర్ 24న ఇంట్లో ప్రమాదవశాత్తూ రాధాకృష్ణ కిందపడి బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నాడు. అవయవ దానానికి తాను అంగీకరించడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి గుండె, గుండె రక్తనాళాలు, కాలేయం, కిడ్నీలు సేకరించారు. కన్నుమూస్తూ కూడా ఆయన మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించారు. - శిరీష, దాత రాధాకృష్ణ సతీమణి