అక్కరకు రాని అమ్మ త్యాగం | donated the kidney to fail | Sakshi
Sakshi News home page

అక్కరకు రాని అమ్మ త్యాగం

Published Tue, Mar 7 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

అక్కరకు రాని అమ్మ త్యాగం

అక్కరకు రాని అమ్మ త్యాగం

కుమారుడికి దానం చేసిన కిడ్నీ ఫెయిల్‌
రెండోసారి లైవ్‌డోనర్స్‌ లేక ఆదుకోని ఆరోగ్యశ్రీ
బిడ్డ కోసం శ్రీకాకుళం నుంచి వలస
దిక్కుతోచని స్థితిలో కుటుంబం


చేతికి అందివచ్చిన కుమారుడికి భరించరాని కష్టం వచ్చింది. కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టడంతో తల్లి కడుపు తరుక్కుపోయింది. కొడుకు జీవితమే ముఖ్యమని భావించి ఆమె తన కిడ్నీని అర్పించింది. అయినా కాలం కలిసిరాలేదు. ఆ కిడ్నీ కూడా దెబ్బతింది. ఇప్పుడు బిడ్డను బతికించుకోవడానికి రూ.8లక్షలు అవసరం. చేతిలో చిల్లిగవ్వలేక.. కుటుంబ పోషణ కష్టమై పొట్ట చేత పట్టుకుని ఆ కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుంచి పట్నానికి వలస వచ్చింది. కుమారుడిని బతికించుకోవడం కోసం దాతల సాయాన్ని అర్ధిస్తోంది.

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : శ్రీకాకుళం జిల్లా జి.శిగడం మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన అల్లు లక్ష్మీనారాయణ(25) ఐటీఐ చదివి వెల్డరుగా పనిచేసేవాడు. 2009లో ఉన్నట్టుండి మంచానపడ్డాడు. కిడ్నీలు దెబ్బతిన్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. అప్పట్లో ఇతనికి తల్లి సింహాద్రమ్మ తన కిడ్నీ ఇచ్చి ఆదుకుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందింది. లక్ష్మీనారాయణ కోలుకుని  సాధారణ స్థితికి వచ్చాడనుకుంటే 2016లో తల్లి ఇచ్చిన కిడ్నీ కూడా దెబ్బతింది. దీంతో కొద్ది నెలలుగా డయాలసిస్‌ చేస్తూ కుమారుడిని  బతికించుకుంటున్నారు.

బతికించుకోవడానికి వలస
లక్ష్మీనారాయణ కుటుంబ నేపథ్యం పేదరికం. తల్లిదండ్రులతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు. గతంలో తండ్రి రమణకు ఈయన చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇప్పుడా పరిస్థితి లేదు. భారం అంతా తండ్రిపైనే పడుతోం ది. ఈ రోజు కూలి దొరికితే ఇంకో రోజు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. విశాఖకు వస్తే కూలి చేసి కనీసం దగ్గర్లో ఆస్పత్రికి వెళ్లి కుమారుడికి డయాలసిస్‌ చేయించుకోవచ్చ ని భావించి కుటుంబంతో వలస వచ్చేశారు. ప్రస్తు తం గోపాలపట్నం శివారు కొత్తపాలెంలో నివాసం ఉంటున్నారు. రమణ కూలి చేసి తెస్తున్న సంపాదన తినడానికే సరిపోతోంది. లక్ష్మీనారాయణకు డయాలసిస్‌ చేయించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు అప్పులూ పుట్టక డయాలసిస్‌ చేయించడానికి తండ్రి కొట్టుమిట్టాడుతున్నాడు.

‘జీవన్‌దాన్‌’ పొందడానికి పేదరికం అడ్డు
మరణానంతరం తమ అవయవాలు మరికొందరికి ఉపయోగపడాలని వేల మంది జీవన్‌దాన్‌ పథకానికి అవయవదానాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇక్కడ లక్ష్మీనారాయణకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ఈ పథకం కింద లబ్ధిపొందడానికి లక్ష్మీనారాయణ తన పేరును 2017 జనవరి 31న నమోదు చేసుకున్నాడు. అయితే కేజీహెచ్‌లో ఈ పథకం లేదు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనే ఉంది. మరో వైపు ఆరోగ్యశ్రీ కూడా దీనికి వర్తించదు. ఇంట్లో రక్త సంబంధీకులు నేరుగా అవయదానం చేస్తేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. జీవన్‌దాన్‌ ద్వారా కిడ్నీ పొందాలంటే రూ.8 లక్షల ఖర్చు తప్పదని కేర్‌ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఇంత మొత్తం ఎక్కడ్నుంచి తెచ్చేదని లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కుమారుడి పరిస్థితి చూసి వారు కంటతడి పెడుతున్నారు. దాతల సాయం కోసం అర్ధిస్తున్నారు. అల్లు లక్ష్మీనారాయణ, డోర్‌: 20–192/1, అప్పలనరసింహం కాలనీ, కొత్తపాలెం, గోపాలపట్నం, విశాఖ–27 చిరునామాలో గాని, ఫోన్‌ నంబర్లు 90004 52749/94909 42362లలో సంప్రదించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement