డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ విస్తరణ
2020 నాటికి మరో 140 కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య రంగంలో ఉన్న డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ భారీగా విస్తరిస్తోంది. భారత్‌తోపాటు విదేశాల్లో 2020 నాటికి కొత్తగా 140 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం సంస్థకు భారత్‌లో 47, ఆఫ్రికాలో 12, కంబోడియాలో ఒక ఆసుపత్రి ఉంది. విస్తరణలో భాగంగా తొలి దశలో రూ.200 కోట్లకుపైగా వెచ్చిస్తామని సంస్థ సీఎండీ అమర్ అగర్వాల్ సోమవారం తెలిపారు. ఇక్కడి సంతోష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని సినీ నటుడు దగ్గుబాటి రాణా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మీడియాతో మాట్లాడుతూ ఆఫ్రికాలో 15-20 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వియత్నాం, ఫిలిప్పైన్స్‌లో అడుగు పెడతామని వివరించారు. సంతోష్ నగర్ శాఖతో కలిపి హైదరాబాద్‌లో అయిదు ఆసుపత్రులను సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.30-40 కోట్లతో మూడేళ్లలో 30 కేంద్రాలను నెలకొల్పుతామని వెల్లడించారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నెలకు 7-10 వేల శస్త్ర చికిత్సలను నిర్వహిస్తోంది.