అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందన
- ప్రజలకు మేయర్, కమిషనర్ కృతజ్ఞతలు
సాక్షి, సిటీబ్యూరో
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన టీమ్ జీహెచ్ఎంసీని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావు అభినందించారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందించారు.
పారిశుద్ధ్యం, విద్యుత్, టాయ్లెట్ల ఏర్పాటు తదితరఅంశాల్లో జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. నిమజ్జనం మార్గం పొడవునా ఏర్పాటు చేసిన గణేశ్యాక్షన్ టీమ్స్ రోడ్లపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో ఫలితం కనిపించింది. రహదారుల్లో తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ వర్షం వల్ల కొట్టుకుపోయాయి. పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడమేకాకుండా వాటిని తరలించేందుకు అవసరమైనన్ని వాహనాలను కూడా ఏర్పాటు చేయడం ఉపయోగపడింది. షిప్టుల వారీగా సిబ్బందిని నియమించడంతో పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు కనిపించలేదు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఉదయం నుంచే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు.
బోట్లో పరిశీలన..
అనంతరం మేయర్ ప్రత్యేక బోట్లో హుస్సేన్‌సాగర్‌లో పర్యటిస్తూ నిమజ్జన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా భక్తులకు సూచించారు. అన్ని క్రేన్ల వద్ద కూడా అవసరమైనన్ని బోట్లను అందుబాటులో ఉంచినట్లు పర్యాటకశాఖ అధికారి మనోహర్ మేయర్‌కు వివరించారు. ఎవరైనా ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్‌లో పడితే తక్షణ చర్యలకు వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూమ్ నుంచి కూడా మేయర్, కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్‌ఉప్పల్, అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుధ్యం) రవికిరణ్, డీసీపీ కమలాసన్‌రెడ్డి తదితరులతో చర్చించి నిమజ్జన మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఖైరతాబాద్ వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల ద్వారా నిమజ్జన శోభాయాత్ర మార్గాల్లోని పరిస్థితులను మేయర్, కమిషనర్ వేర్వేరుగా పరిశీలించారు. సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తదితరమైనవి లేకుండా తగు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.
గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా త్వరితంగా నిర్వహించినందుకు మండపాల నిర్వాహకులు, నగర ప్రజలకు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఖైరతాబాద్ వినాయక విగ్రహం మధ్యాహ్నానానికే నిమజ్జనం కావడం చరిత్రాత్మకమంటూ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పగటి పూట నిమజ్జనం చేయడం ద్వారా వేలాదిమంది ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించారని, లక్షలాదిమంది టీవీల ద్వారా లైవ్ చూశారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు ఇతర చెరువుల వద్ద చేపట్టిన నిమజ్జన చర్యలు కూడా మంచి ఫలితమిచ్చాయని పేర్కొన్నారు.