ఆహారం... ఆరోగ్యం...
ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం.
ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే థీమ్...
‘సురక్షితమైన ఆహారం’.
మనం రోజూ ఎన్నో ఆహారాలు తీసుకుంటూ ఉంటాం.
సదరు ఆహారాల పట్ల మరెన్నో నమ్మకాలతో ఉంటాం.
శాస్త్రీయంగా చూసినప్పుడు వాటిలో చాలావరకు అపోహలు...
మూఢనమ్మకాలే. అందుకే ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా
మనం ఆహారంగా స్వీకరించే అనేక అంశాల
గురించి శాస్త్రీయమైన వాస్తవాలేమిటో తెలుసుకుందాం.
అలా వాటి పట్ల నిజమైన అవగాహన కల్పించుకుంటే
మంచి ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది. అపోహలూ,
మన సమాజంలో కొనసాగుతున్న అనేక నమ్మకాల వెనక
ఉన్న శాస్త్రీయ అంశాలను తెలుసుకుందాం.
అలా తెలుసుకోవడం కోసమే
ఈ ప్రత్యేక కథనం.
పచ్చికూరలు ఆరోగ్యానికి మేలేనా?
వాస్తవానికి పచ్చిగానే తినదగ్గ కూరగాయలూ, పచ్చికూరల రసాలు (క్యారట్, బీట్రూట్ వంటివి) ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఇటీవలికాలంలో ప్రతి పంటలోనూ రసాయన ఎరువులూ, పురుగుమందులూ వేయకుండా పండించడం లేదు. దాంతో పచ్చికూరగాయలు తినడం వల్ల లభించే పీచు (డయటరీ ఫైబర్), విటమిన్లు వంటి పోషకాల కంటే... వాటిపై ఉండే క్రిమిసంహారక మందుల వల్ల చేకూరే నష్టాలే ఎక్కువ. అందుకే ఒకవేళ పచ్చిగానే తినదగ్గ కూరగాయలు, వాటి రసాలతో ఆరోగ్య ప్రయోజనం పొందాలనుకునేవారు విధిగా వాటిని కొద్దిపాటి సోడా ఉప్పు (సోడియం బై కార్బొనేట్, మామూలు ఉప్పు (సోడియం క్లోరైడ్)లతో దాదాపు 5 - 10 నిమిషాలు కడగాలి. దాంతో క్రిమిసంహారక మందులు చాలావరకు తొలగిపోతాయి. ఇలా కడిగి తినడం వల్ల పచ్చిగానే తినదగ్గ కూరగాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
వేపాకు డయాబెటిస్‌కు మందు కాదు...
చేదుగా ఉన్న ప్రతి ఒక్కటీ చక్కెర వ్యాధికి మందు అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ అది ఎంతమాత్రమూ వాస్తవం కాదు. నిజానికి వేపలో చాలా ఔషధగుణాలు ఉన్న మాట వాస్తవం. కానీ వైద్యులు, పరిశోధకులు సరిగ్గా ఏ రసాయనం, ఏరకమైన ఔషధగుణాన్ని కలిగి ఉందో గుర్తించి, ఆ మందు కోసమే ఆ రసాయనాన్ని వాడుతుంటారు. అంతేగానీ... మనం ఎలాంటి విచక్షణ లేకుండా వేపాకులు నమలడం, వేప రసం తాగడం వల్ల... అందులోని ఆల్కలాయిడ్స్ అనే రసాయనాలు మనలోని మేలు చేసే బ్యాక్టీరియాను చంపేస్తాయి. అలాగే మనం క్రమం తప్పకుండా వేపాకును నములుతూ ఉంటే కీడు చేసే బ్యాక్టీరియా కూడా వేపలోని ఇన్సెక్టిసైడ్ గుణాలకు అలవాటు పడి, దాని పట్ల నిరోధాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇలా వేపను వాడటం వల్ల రెండురకాలుగా నష్టం చేకూరే ప్రమాదం ఉంది. కాకపోతే వేపను సమర్థంగా ఉపయోగించుకోవాలంటే ఒకపని చేయవచ్చు. కొన్ని చర్మరోగాలకు వేపాకును నూరి లేపనంగా (టాపికల్ మెడిసిన్‌లా) వాడుకోవచ్చు. కొన్నిసార్లు తలనొప్పులు వచ్చినప్పుడు వేపాకును కణతలకు రుద్దుకొని ఉపశమనం పొందడం మన పల్లెల్లో చూస్తూనే ఉంటాం. ఇలా వేపను పైపూతగా వాడుకోవడం ప్రమాదకరం కాదు.
మాంసాహారం మంచిది కాదా?
మతపరమైన, సామాజికపరమైన నమ్మకాల ఆధారంగా కాకుండా కేవలం సశాస్త్రీయంగా చూడాల్సిన అంశమిది. మాంసాహారం మంచిది కాదంటూ, చాలామంది శాకాహారంవైపు మొగ్గుచూపుతున్నారు. కానీ వీరిలో అత్యధికులు విటమిన్-డి, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపాలు ఏర్పడి, అనారోగ్యం పాలవుతున్నారు. ఎందుకంటే పైన పేర్కొన్న పోషకాలు మాంసాహారంలోనే సమృద్ధిగా ఉంటాయి. ఇక విటమిన్ బి12 అయితే చాలావరకు మాంసాహారంతోనూ, కొంతవరకు పాలు, గుడ్లలో లభ్యమవుతుంది. మన మెదడునుంచి నరాల ద్వారా అన్ని అవయవాలకూ అందే ఆదేశాలన్నీ విటమిన్ బి12 ద్వారానే అందుతాయి. అందుకే విటమిన్ బి12 లోపం ఉన్నవారు మెదడునుంచి ఆయా అవయవాలకు ఆదేశాలు అందక ఒక్కోసారి స్పృహతప్పి పడిపోయే అవకాశం ఉంది. వాహనం నడిపే సమయంలోనో, ఈతకొట్టే సమయంలోనో ఈ తరహా ప్రమాదం ఎదురైతే అది ప్రాణాంతకం కావచ్చు. ఒకవేళ ఇతర జీవులకు ప్రాణహాని తలపెడుతున్నామనే భావనతో ఉండేవారు, అన్ని ప్రాణులకూ జీవించే అవకాశం ఉందనీ అందువల్ల ఆహారం కోసం ఇతర ప్రాణులను చంపడం తప్పని భావించి శాకాహారం వైపు మళ్లిన వారు పై పోషకాల లోపాలను భర్తీ చేసుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది అవిశగింజలను ఎక్కువగా వాడటం. వాటిని తప్పనిసరిగా రోజుకు ఒక చెంచాకు తక్కువ కాకుండా తినాలి. ఇవి ‘ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్’ను సమృద్ధిగా సమకూరుస్తాయి. మాంసాహార లోపాన్ని అవిశగింజలు (ఫ్లాక్స్సీడ్స్) చాలావరకు భర్తీ చేస్తాయి.
కాఫీ నిజంగానే ఉత్తేజపరుస్తుందా, బరువు తగ్గిస్తుందా?
మనలో చాలామందికి కాఫీ అలవాటే. కొందరికి అది లేనిదే రోజు గడవదు. కాఫీలోని కెఫిన్ వల్ల కొంత ఉత్తేజం కలిగే మాట వాస్తవమే. కెఫిన్లోని బీటా ఆక్సిడేషన్ క్రియ వల్ల కొంత కొవ్వు కూడా తగ్గే విషయమూ నిజమే. అందుకే పరుగుపందేలలో పాల్గొనాలనుకునేవారు కొవ్వు, బరువు తగ్గించుకోడానికి కాఫీని ఎక్కువగా తాగేస్తుంటారు. అయితే ఇది చాలా అనారోగ్యకరమైన ప్రక్రియ. దీని వల్ల గుండె స్పందనల్లో లయ తప్పే (అరిథ్మియాసిస్ వచ్చే) అవకాశం ఉంది. శరీరం ఎక్కువగా ఉత్తేజం పొందేలా చేయడం వల్ల మెదడు తీవ్రంగా అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. దీర్ఘకాలంలో దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉత్తేజం పొందడానికి, బరువు తగ్గించుకోడానికి కాఫీని ఆశ్రయించడం సరైన పద్ధతి కానే కాదు. కాఫీలోని కెఫిన్ కంటే టీ లోని ఎల్-థయనైన్ కొంతవరకు మంచిది. ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది. అయితే అది కాఫీ అయినా లేదా టీ అయినా రోజుకు రెండు నుంచి మూడు చిన్న కప్పులకు మించి తాగకపోవడమే మంచిది.
తులసి ఆరోగ్యానికి మేలు అయితే...
తులసీదళాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆసిమమ్ సాంక్టమ్ అనే పేరున్న తులసిలోని కొన్ని రసాయనాలు రక్తాన్ని గడ్డకట్టకుండా, ద్రవరూపంలోనే ఉంచేలా చూస్తాయి. తులసిలోని ఈ గుణమే పరిశోధకులను తనవైపు ఆకర్షించేలా చేసింది. తులసిదళాలు వేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో అడ్డంకులు (క్లాట్స్) ఏర్పడవు. ఫలితంగా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూడటం వల్ల గుండెపోటు నివారితమవుతుంది. అలాగే మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లోనూ అడ్డంకులు ఏర్పడకపోవడం వల్ల పక్షవాతం లాంటి జబ్బులనూ నివారించవచ్చు.
పరిమితులివి...
అయితే తులసీదళాలకు ఉన్న రక్తాన్ని పలచబార్చే గుణమే ఒక్కోసారి కొందరిలో ప్రాణాంతకం కావచ్చు. ఉదాహరణకు ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘థ్రాంబోసైటోపీనియా’ అంటారు. ఇలాంటి కండిషన్ ఉన్నవారు తులసిదళాలు తమకు మేలు చేస్తాయనే భావనతోనో, లేదా భక్తి కొద్దో తులసిని మిగతా ఆరోగ్యవంతుల్లాగా వాడటం సరికాదు. ఇక శస్త్రచికిత్స చేయించుకోబోయే వాళ్లు సైతం ఆపరేషన్‌కు ముందు తులసినీళ్లు తాగడం, తులసి ఆకులు తినడం మంచిది కాదు. దీనివల్ల ఆపరేషన్ సమయంలో ఆగకుండా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులు వాడేవారు తులసిని ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ ఔషధాలు రక్తాన్ని పలచబార్చే మందులు. వాటికి తులసి కూడా తోడైతే... ఏదైనా దెబ్బతగిలినప్పుడు రక్తస్రావం ఆగకుండా జరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. అందుకే తులసి ఆకులను ఆరోగ్యం కోసం వాడేవారు జాగ్రత్తగా అప్పుడప్పుడూ ఒకటి, రెండు ఆకులకు మాత్రమే పరిమితం కావడం మేలు.
వరి అన్నంతో డయాబెటిస్ వస్తుందా?
వరి అన్నం తినడం వల్ల అందులోని పిండి పదార్థాల వల్ల డయాబెటిస్ త్వరగా వస్తుందని మన సమాజంలోని చాలా మందికి ఒక నమ్మకం. అందుకే డయాబెటిస్ లేని వాళ్లలో చాలామంది దాన్ని నివారించుకుంటున్నామనే భావనతో రాత్రివేళ గోధుమరొట్టెలు తింటుంటారు. అలా తినమంటూ తోటివారికి హితబోధ కూడా చేస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ. తృణధాన్యాలన్నింటిట్లోనూ తక్షణం ఉపయోగించడానికి వీలైనది కాబట్టి జపాన్, కొరియా, థాయిలాండ్, చైనా, ఇండోనేషియా, కొన్ని ఆఫ్రికా దేశాలు వరినే ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తుంటాయి. ప్రపంచంలో 60 శాతం మంది వరిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు.
నిజానికి వరి అన్నం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉందా అన్న అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలిద్దాం. మనం ఏైవైనా ఆహారపదార్థాలను తిన్న తర్వాత వాటివల్ల రక్తంలో పెరిగే చక్కెర ప్రమాణాలను కొలతను గ్లైసీమిక్స్ ఇండెక్స్ (జీఐ) అంటారు. అంటే... దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర పాళ్లు అంత ఎక్కువన్నమాట. ఇలా కొలిచే సమయంలో జీఐ విలువ 70 కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువనీ, జీఐ విలువ 56 నుంచి 69 మధ్య ఉంటే అది మీడియం అనీ, జీఐ విలువ 55 లేదా అంతకంటే తక్కువ ఉంటే అది తక్కువనీ వర్గీకరిస్తారు. (జీఐ విలువలు ఎక్కువగా ఉండే పదార్థాలు డయాబెటిస్ పేషంట్లకు అంత మంచిది కాదు). అయితే వేర్వేరు రకాల వరి, గోధుమల తాలూకు జీఐ విలువలివి...
బ్రౌన్ రైస్ (ముడి బియ్యం) 55
తెల్ల రైస్ (పొట్టుతీసిన బియ్యం) 64
ముడి గోధుమతో చేసిన రోటీలు 58
తెల్ల గోధుమపిండితో చేసిన బ్రెడ్ 71
దీన్నిబట్టి చూస్తే వరి, గోధుమల గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంచుమించూ సమానమే. ఇక కొన్ని రకాల గోధుమల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా వరి కంటే కూడా కాస్తంత ఎక్కువే. వరితో పోలిస్తే గోధుమలో పీచుపదార్థాలు ఎక్కువ. (అయితే అవి వరి, గోధుమల్లో వేర్వేరు రకాల మీద కూడా ఆధారపడి ఉంటాయి). కాబట్టి గోధుమలే తినాలని, డయాబెటిస్ వంటి రోగులు అవి తింటేనే మంచిదనే అపోహలు అవసరం లేదు. తమకు అలవాటైనదే సౌకర్యంగా తినవచ్చు. కాకపోతే వరి అన్నం తినే సమయంలో దాన్ని కూరలు, పప్పు, పులుసు, పెరుగు వంటి వేర్వేరు వాటితో కలిపి తింటున్నారనుకోండి. ఆ సమయంలో ఆహారం రుచిగా ఉంటే మనం ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామో మనకే తెలియకుండా కాస్త ఎక్కువగానూ తినే అవకాశం ఉంది. కానీ గోధుమతో చేసిన రోటీలు తినేసమయంలో వాటి సంఖ్యను బట్టి మనం ఎక్కువగా తింటున్నామా లేదా అన్న విషయం స్పష్టమవుతుంది. ఒకవేళ పరిమితంగా తీసుకోగల నియంత్రణ శక్తి ఉంటే డయాబెటిస్ రోగులు సైతం తమకు అలవాటైన వరి అన్నాన్నే తినవచ్చు.
ఇక వరి అన్నం దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే అవకాశాలను కలగజేస్తుందన్న మాటలో ఎంత వాస్తవం ఉందో చూద్దాం. జపాన్ దేశస్తులు వరి అన్నంతో పాటు చేపలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఆయుఃప్రమాణం విషయంలో జపాన్ దేశస్తులే ఎక్కువ కాలం బతుకుతారన్న విషయం తెలిసిందే. (జపాన్ దేశస్తుల సగటు ఆయుఃప్రమాణం 87.6 ఏళ్లు). వరి అన్నంతో మనం చెప్పుకుంటున్నంత ప్రమాదమే ఉంటే జపాన్ దేశస్తుల ఆయుఃప్రమాణం అంత ఎక్కువగా ఉండేది కాదు కదా. కాబట్టి డయాబెటిస్‌కూ, వరి అన్నానికీ సంబంధం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో మీరెంత సమర్థంగా డయాబెటిస్‌ను నివారించుకుంటున్నారు అన్న విషయం ప్రధానం. ఒకవేళ డయాబెటిస్ వచ్చి ఉంటే నడక, వ్యాయామం, వేళకు మందులు తీసుకోవడం, సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ చక్కెరను ఎలా నియంత్రణలో ఉంచుకుంటున్నారన్నదే ముఖ్యం.
మద్యం గుండెజబ్బులను రాకుండా ఆపుతుందా?
పరిమితమైన మద్యం లేదా రెడ్‌వైన్ గుండెజబ్బులను నివారిస్తుందని ఇటీవల కొందరు వాదిస్తుండటం మనకు తెలిసిన విషయమే. నిజానికి మద్యంలో ఆ గుణమే ఉంటే డాక్టర్లందరూ దాన్ని సిఫార్సు చేసే వారే కదా. కానీ మద్యంలో అలాంటి గుణమేదీ లేకపోగా... అది మెదడు, నాడీవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలుఇలా ఎన్నో అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో ఆ అవయవాలతో నడిచే వ్యవస్థలను నాశనం చేస్తుంది. శరీరబరువు పెంచుతుంది. పైగా మద్యానికి ఉన్న అలవాటుపడే (అడిక్షన్) గుణం కారణంగా అది అన్ని విధాలా చేటే చేస్తుంది తప్ప... ఏ విధంగానూ ఆరోగ్యానికి దోహదం చేయదు. మద్యం గుండెజబ్బులను ఎంతమాత్రమూ నివారించలేదు సరికదా... ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చేందుకు దోహదం చేస్తుందని శాస్త్రీయంగా రుజువైంది.
కోడిగుడ్డు పచ్చసొన వల్ల హాని తప్పదా?
ఇటీవల చాలామంది కోడిగుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అందుకే అది ఆరోగ్యానికి హానికరం అని నమ్ముతున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ అనేది ఒక రకం కొవ్వు. అందరిలోనూ కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనుకోవడం సరికాదు. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే కోడిగుడ్డు పచ్చసొనను పరిహరించాలి. మిగతావాళ్లు నిరభ్యంతరంగా పచ్చసొనను వాడాలి. ఎందుకంటే ఈ కారణం వల్ల పచ్చసొనను పారవేస్తే... అందులోనే ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. అందుకే రక్తంలో కొలెస్ట్రాల్ ఉన్నవారు మినహాయించి... చిన్నపిల్లలూ, యుక్తవయసులోకి వస్తున్న కౌమార బాలబాలికలు (అడాలసెంట్ యూత్), యువతీయువకులు, వృద్ధులు వారానికి నాలుగైదు గుడ్లు పూర్తిగా (పచ్చసొనతో) తినాలి. నిజానికి పచ్చసొనలో ఉండే ‘కొలైన్’ అనే పోషకం కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. దాంతోపాటు ఐరన్, ఫాస్పరస్, ఐయోడిన్, సెలీనియమ్ వంటి ఖనిజలవణాలు, అన్నిరకాల విటమిన్లు... ఈ పచ్చసొనలోనే ఉంటాయి.
ఎన్ని నీళ్లు తాగితే అంత ఆరోగ్యమా?
నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యమంటూ చాలామంది చెబుతుంటారు. పైగా ఇలా నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు కడుక్కుపోతాయంటూ వివరణ కూడా ఇస్తుంటారు. ఇందులోని వాస్తవాలను శాస్త్రీయంగా పరిశీలిద్దాం.
శరీరం ఒక నియమిత పద్ధతిలో తన అవసరాల కోసం నీటిని వాడుకుంటుంది. ఉదాహరణకు మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేలా చేయడానికి, రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి, మలమూత్రాలతో పాటు, చెమట విసర్జన వంటి అంశాలకు నీరు చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు అది తాను నిర్వహించాల్సిన కార్యకలాపాలను మరచి... మూత్రరూపంలో త్వరగా బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటుంది. (అందుకే ఎక్కువగా నీరు తాగినప్పుడు మూత్రం త్వరగా వచ్చేస్తుంటుంది). ఇలా బయటకు పోతూపోతూ శరీరంలోని సోడియం లవణాలను కూడా బయటకు తీసుకెళ్తుంటుంది. కాబట్టి శరీరంలో సోడియం లవణాలు తగ్గి ‘హైపోనేట్రీమియా’ అనే లవణాలు తగ్గిన కండిషన్ ఏర్పడుతుంది. ఒక్కోసారి ఇది చాలా ప్రమాదకరంగా కూడా పరిణమించి, ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సిన పరిస్థితినీ కల్పించవచ్చు. వయసు పైబడ్డవారిలో తరచూ ఈ ‘హైపోనైట్రీమిక్ కార్డియోమయోపతి’ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుండటం చాలా సాధారణం. ఇక బీపీ మాత్రలూ, ఉప్పు చాలా తక్కువగా వాడేవారు, ఎక్కువగా చెమటపట్టే స్వభావం కలిగినవారు... వీళ్లంతా నీటిని ఎక్కువగా తాగినప్పుడు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ.
వయసుపైబడ్డవాళ్లలోనూ, ఆటగాళ్లలోనూ ఈ పరిణామాలు చోటు చేసుకోడాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (ఏసీఎస్ఎమ్), కెనెడియన్ న్యూట్రిషన్ సొసైటీ వంటి ఎన్నో ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. ఇక ఒక్కోసారి శరీర అవసరాలకంటే ఎక్కువగా నీరు తాగితే అది కణాల్లోకి చొచ్చుకుపోయి కణాలను నాశనం చేయగలదు. దీన్నే ‘వాటర్ ఇంటాక్సికేషన్’ అంటారు. బరువు తక్కువగా ఉండే పిల్లలు, ఎండలో స్పోర్ట్స్ ఆడేవారు, నీళ్లు తాగడం వంటి పోటీలలో పాల్గొనేవారు, సైకోజెనిక్ పాలీడిప్పియా అనే మానసిక వ్యాధితో బాధపడేవారు (ఈ రుగ్మత ఉన్నవారు దాహంవేస్తున్నట్లుగా అనిపించడం వల్ల అదేపనిగా నీళ్లు తాగేస్తూ ఉంటారు)... అధికమొత్తంలో నీరు తాగినప్పుడు శరీరంలోని లవణాలు కడుక్కుపోయి/కొట్టుకుపోయి మెదడు నుంచి లవణాల అయాన్ల ద్వారా కరెంటు రూపంలో అందాల్సిన ఆదేశాలు అందక ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే మన సామెతను గుర్తుపెట్టుకుని అవసరమైనంత మేరకే నీళ్లు తాగాలి.
మరి ఎన్ని నీళ్లు తాగాలి? ఎలా తాగాలి?
కేవలం దాహమైనప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి మూత్రం మరీ తెల్లగా అంటే డిస్టిల్డ్ వాటర్లా వస్తోందంటే శరీరంలో నీరు ఎక్కువైందని అర్థం. మూత్రం మరీ పచ్చగా వస్తోందంటే శరీరంలో నీరు తగ్గిందని అర్థం. కాబట్టి మూత్రం దాని స్వాభావిక రంగులో వచ్చేలాగే నీరే తాగాలి ఒకసారి తాగినప్పుడు 100 ఎం.ఎల్. తాగడమే మంచిది వారి వారి శరీర బరువును బట్టి ప్రతి రోజూ 2 లీటర్ల నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు తాగవచ్చు. అంతకంటే ఎక్కువ నీరు తాగడం అంత మంచిది కాదు మూత్రపిండాల జబ్బులు ఉన్నవారు, నీళ్ల విరేచనాలు అయ్యేవారు డాక్టరు సూచించిన మేరకే నీళ్లు తాగాలి. ఈ జబ్బులున్న వాళ్లు నీళ్లు తాగే విషయంలో డాక్టర్ సలహా తప్పక పాటించాలి.
మీ సేవాభావం... కావాలి ఇతరులక ఆదర్శం!
వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ‘సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు’లు ఇవ్వాలని సంకల్పించింది. వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థాగతంగా గానీ మీరు అందించిన వైద్య సేవలను తెలియజేస్తూ పంపే ఎంట్రీలను సాక్షి ఆహ్వానిస్తోంది. ఇందుకు 2014 సంవత్సరానికి గాను మీరందరించిన సేవలే ప్రాతిపదిక. మీ ఎంట్రీలను పంపండి. మీ సేవా కార్యకలాపాల దృష్టాంతాలకు ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ ఏప్రిల్ 7 లోపు మీ ఎంట్రీలను పంపండి.
చిరునామా:
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్,
సాక్షి టవర్స్,
6-3-249,
రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034.
డాక్టర్ భక్తియార్ చౌదురి,
ఫిట్నెస్ నిపుణులు,
హైదరాబాద్