నాడులను మారిస్తే.. కదలిక వచ్చింది
పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పడిపోతే తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫిజియోథెరపీతో కొందరిలో మార్పు వచ్చే అవకాశమున్నా కాస్త శ్రమ, సమయం తప్పదు. కెనడాలో ఇటీవల జరిగిన ఓ శస్త్రచికిత్స పుణ్యమా అని ఇకపై ఆ పరిస్థితి మారనుంది. ఈ ఆపరేషన్ ద్వారా తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయిన ఓ వ్యక్తి తన చేతులను మళ్లీ కదిలించగలిగాడు. టిమ్ రాగ్లిన్ అనే వ్యక్తి 2007లో ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో టిమ్‌కు ఒట్టావా ఆస్పత్రి డాక్టర్ క్రిస్టీ బాయిడ్ సరికొత్త శస్త్రచికిత్స చేశారు.
టిమ్ శరీరంలో సక్రమంగా పనిచేసే కొన్ని నాడీ కణాలను గుర్తించి వాటిని అతడి చేతుల్లోకి చొప్పించారు. దాదాపు ఏడాది పాటు ఎలాంటి ఫలితం కనిపించకపోయినా ఆ తర్వాత అతడి చేతుల్లో చిన్న కదలికలు మొదలయ్యాయి. కొత్తగా అమర్చిన నాడులు అంతకంతకూ పెరుగుతూ ముడుచుకుపోయిన వేళ్లను విడదీయగలిగే స్థాయికి చేరాయి. అయితే ప్రస్తుతం చిన్నచిన్న పనులకే కండరాలు అలసిపోతున్నాయని టిమ్ పేర్కొంటున్నాడు. నాడులు మరింతగా బలపడితే సాధారణ పనులు చేసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.