ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్
చాలా ఏళ్ల క్రితం క్రికెట్ ఆడుతుంటే నా కుడి కంటి కింద దెబ్బతగిలింది. అప్పట్లో కుట్లు వేశారు. ఆ మచ్చ అలాగే ఉంది. ఇప్పుడు నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చా?
- శ్రీనివాస్, విజయవాడ
స్కార్ రివిజన్ అనే ప్రక్రియ ద్వారా మీ సమస్య చక్కదిద్దుకోవచ్చు. మచ్చ ఉన్న ప్రాంతంలో చుట్టూ ఆరోగ్యకరమైన చర్మం ఉంటే దానితో ఈ స్కార్ రివిజన్ చేయడం సులభం. ఒకవేళ మీకు ఉన్న మచ్చ చుట్టూ ఆరోగ్యకరమైన చర్మం లేకపోతే ఫుల్ థిక్నెస్ గ్రాఫ్టింగ్ చేయాలి. ఇందులో మచ్చ ఉన్న భాగాన్ని తొలగించి ఆ స్థానాన్ని మరో చర్మంతో భర్తీ చేస్తారు.
ఈ ప్రక్రియలో చెవుల వెనక చర్మాన్ని తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు 10-15 రోజులు పడుతుంది. మీ మచ్చ మరీ పెద్దగా ఉంటే అరుదుగా ఫ్లాప్ ప్రొసీజర్ అనే వేరే ప్రక్రియ అవలంబించాల్సి ఉంటుంది. అందుకే మీకు ఉన్న మచ్చ ఎలాంటిది, దానికి ఎలాంటి శస్త్రచికిత్స అవలంబించాల్సి ఉంటుందన్న విషయాలను తెలుసుకునేందుకు మీకు దగ్గర్లో ఉన్న ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించండి.
డాక్టర్ దీపు సీహెచ్
ప్లాస్టిక్ సర్జన్, ఒలివా కాస్మటిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్