కమలంలో కలవరం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలా? లేక ఎన్నికలకు వెళ్లాలా? అన్న విషయంపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న బీజేపీ నేతలు ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలతో మరింత అయోమయంలో పడ్డారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్చుతో ఢిల్లీలో ఎన్నికలు జరిపించాలని కోరుకుంటున్నవారే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని అంటున్నవారు కూడా పునరాలోచనలో పడ్డారు. తమ డిమాండ్ ప్రకారం అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు జరిపించినట్లయితే తాము ఆశిస్తున్నట్లుగా లోక్సభ ఎన్నికలలో సాధించినటువంటి ఘన విజయాన్ని, భారీ మెజారిటీని సాధించగలమా అన్న సంశయం ఎన్నికలను కోరుకుంటున్న బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
మరికొందరైతే మెజార్టీ మాట అటుంచి గెలుస్తామా? లేదా? అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలాగోలా ప్రభుత్వం ఏర్పాటుచేసినా, పార్లమెంటుకు ఎన్నికైన ముగ్గురు బీజేపీ నేతలు ఖాళీ చేసిన శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక జరిపించవలసి వస్తుందని, ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోతే దాని ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుందనే భయం.. సర్కారు ఏర్పాటును కోరుకుంటున్న నేతలలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? లేక ఎన్నికలు జరిపించాలా? అన్నది నిర్ణయించడం అంత సులువైన విషయం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే డాక్టర్ హర్షవర్ధన్, ప్రవేశ్ వర్మ, రమేష్ బిధూరీ ఖాళీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఎదుర్కోవలసివస్తుంది. వీటిలో ఏ ఒక్క సీటు ఓడిపోయినా అసెంబ్లీలో సంఖ్యాబలం తారుమారవుతుంది. అది కాదని ఎన్నికలకే వెళ్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత మెజారీ వస్తుందో? లేదో కచ్చితంగా చెప్పలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.