Dr. Harshvardhan
-
మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో హర్షవర్ధన్!
శాఖ మార్పునకు పొగాకు లాబీయే కారణమా? సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్‌ను విస్తరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చౌందినీచౌక్ ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్‌ను కీలకమైన ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి తొలగించి అంతగా ప్రాముఖ్యత లేని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మంత్రిని చేయడం ఢిల్లీ రాజకీయవర్గాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా నగర రాజకీయాలలో మరింత చురుకైన పాత్ర పోషించడానికి అనువుగా హర్షవర్ధన్‌పై మంత్రిత్వశాఖ భారం తగ్గించారని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. కాగా మరికొందరు ఆరోగ్యమంత్రిగా ఆయన తొలగింపును పొగాకు లాబీతో ముడిపెడ్తున్నారు. పొగాకుకు వ్యతిరేకంగా డా. హర్షవర్ధన్ కఠిన చర్యలు చేపటారని ఆయన ఉద్యమ కార్యకర్త స్థాయిలో చురుకుగా వ్యవహరించడం పొగాకు లాబీకి గిట్టలేదని వారు అంటున్నారు. ఈ లాబీ ఒత్తిడి కారణంగానే హర్షవర్ధన్ ఆరోగ్యమంత్రి పదవి పోయిందని వారు భావిస్తున్నారు. ప్రధానమంత్రి స్వరాష్ట్రమైన గుజరాత్లో ప్రధాన పంటలలో పొగాకు ఒకటన్న విషయాన్ని కూడా వారు నొక్కి చెబుతున్నారు. హర్షవర్ధన్‌ను కేబినెట్ మంత్రిగా చేసిన తరువాత ఢిల్లీ బీజేపీలో నిజాయితీపరుడైన ముద్రతో పార్టీకి నేతృత్వం వహించే నాయకుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని మరింత మెజారిటీతో గెలిపించడం కోసం హర్షవర్ధన్‌కు వెసులుబాటు ఇచ్చేందుకే ఆయనకు అంతగా ప్రాధాన్యం లేని మంత్రిత్వశాఖను కట్టబెట్టారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అయితే హర్షవర్ధన్ విమర్శకులు మాత్రం ఈ రెండు వాదనలతో ఏకీభవించడం లేదు. ఎయిమ్స్ సీవీఓ తొలగింపు వివాదంలో చిక్కుకున్న హర్షవర్ధన్‌ను శిక్షించడం కోసమే ప్రధానమంత్రి ఆయనను ఆరోగ్య మంత్రి పదవి నుంచి తొలగించి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఈ వివాదం నిజాయితీపరునిగా హర్షవర్ధన్కున్న పేరుకు మచ్చతెచ్చిందని వారు అంటున్నారు. అయితే అలాంటప్పుడు ఈ వివాదంలో చిక్కుకున్న జేపీ నడ్డాకు ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఎలా కట్టబెట్టారని డా. హర్షవర్ధన్‌ను సమర్థించేవారు ప్రశ్నిస్తున్నారు. -
త్వరలోనే హర్షవర్దన్ పేరు ప్రకటన
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్‌కు అవకాశం రాకుండా గోయల్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం మాత్రం ఆయనవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపే హర్షవర్ధన్ పేరును లాంఛనంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఆదివారం నాటి పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో అధిష్టానం ఈ మేరకు సంకేతాలు పంపింది. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ విదేశీ పర్యటన కారణంగా ఈ సమావేశానికి రాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 31న నిర్వహించే పార్లమెంటు బోర్డు భేటీలో హర్షవర్ధన్ పేరును అధికారికంగా ప్రకటిస్తారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతోపాటు సీనియర్లు ఎల్కే అద్వానీ, జైట్లీ, ఆర్ఎస్ఎస్ కూడా హర్షవర్ధన్వైపే మొగ్గుచూపడమే ఈ పరిస్థితికి కారణం. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, మరో సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా హర్షవర్ధన్‌కు మద్దతు ప్రకటించడంతో గోయల్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. రాజీనామా చేసినా దానిని ఆమోదిస్తామని అధిష్టానం గోయల్‌ను హెచ్చరించడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.