మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో హర్షవర్ధన్! | Harsh Vardhan shocker: Modi's decision to replace him with Nadda sparks speculation | Sakshi
Sakshi News home page

మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో హర్షవర్ధన్!

Published Mon, Nov 10 2014 11:54 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో హర్షవర్ధన్! - Sakshi

మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో హర్షవర్ధన్!

శాఖ మార్పునకు పొగాకు లాబీయే కారణమా?
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్‌ను విస్తరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చౌందినీచౌక్ ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్‌ను కీలకమైన ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి తొలగించి అంతగా ప్రాముఖ్యత లేని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మంత్రిని చేయడం ఢిల్లీ రాజకీయవర్గాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా నగర రాజకీయాలలో మరింత చురుకైన పాత్ర పోషించడానికి అనువుగా హర్షవర్ధన్‌పై మంత్రిత్వశాఖ భారం తగ్గించారని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు.

కాగా మరికొందరు ఆరోగ్యమంత్రిగా ఆయన తొలగింపును పొగాకు లాబీతో ముడిపెడ్తున్నారు. పొగాకుకు వ్యతిరేకంగా డా. హర్షవర్ధన్ కఠిన చర్యలు చేపటారని ఆయన ఉద్యమ కార్యకర్త స్థాయిలో చురుకుగా వ్యవహరించడం పొగాకు లాబీకి గిట్టలేదని వారు అంటున్నారు. ఈ లాబీ ఒత్తిడి కారణంగానే హర్షవర్ధన్ ఆరోగ్యమంత్రి పదవి పోయిందని వారు భావిస్తున్నారు. ప్రధానమంత్రి స్వరాష్ట్రమైన గుజరాత్‌లో  ప్రధాన పంటలలో పొగాకు ఒకటన్న విషయాన్ని కూడా వారు నొక్కి చెబుతున్నారు.
 
హర్షవర్ధన్‌ను కేబినెట్ మంత్రిగా చేసిన తరువాత ఢిల్లీ బీజేపీలో నిజాయితీపరుడైన ముద్రతో పార్టీకి నేతృత్వం వహించే నాయకుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని మరింత మెజారిటీతో గెలిపించడం కోసం హర్షవర్ధన్‌కు వెసులుబాటు ఇచ్చేందుకే ఆయనకు అంతగా ప్రాధాన్యం లేని మంత్రిత్వశాఖను కట్టబెట్టారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అయితే హర్షవర్ధన్ విమర్శకులు మాత్రం ఈ రెండు వాదనలతో ఏకీభవించడం లేదు.

ఎయిమ్స్ సీవీఓ తొలగింపు వివాదంలో చిక్కుకున్న హర్షవర్ధన్‌ను శిక్షించడం కోసమే ప్రధానమంత్రి ఆయనను ఆరోగ్య మంత్రి పదవి నుంచి తొలగించి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఈ వివాదం నిజాయితీపరునిగా హర్షవర్ధన్‌కున్న పేరుకు మచ్చతెచ్చిందని వారు అంటున్నారు.  అయితే అలాంటప్పుడు ఈ వివాదంలో చిక్కుకున్న జేపీ నడ్డాకు ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఎలా కట్టబెట్టారని డా. హర్షవర్ధన్‌ను సమర్థించేవారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement