Ministry Department
-
పాస్‌పోర్టుకూ ఆధార్ లింకు
- విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టుకు ఆధార్ నంబర్ అనుసంధానం చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 7 పాస్‌పోర్ట్ సేవా కేంద్రా ల్లో తొలుత ఈ ప్రక్రియను చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, రాంచిలతో పాటు విశాఖ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఆధార్ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశంలోని అన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఆధార్ నంబర్‌ను పాస్‌పోర్టుకు అనుసంధానించడమంటే.. రెండింటికీ సంబంధించి వేలిముద్రలు, ఐరిష్ (కనుపాప)లను సరిపోల్చి నిర్ధారిస్తారు. బయోమెట్రిక్ వివరాలను కూడా సరిపోల్చుతారు. దీన్నే ‘డిజిటల్ ఇంటిగ్రేట్ డేటా బేస్’ అని అంటారు. ఇలా పాస్‌పోర్టుకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల నకిలీలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని విదేశీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది. -
ఖాదీ డెనిమ్ డిజైనర్ వేర్స్
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ మంగళవారం ఖాదీ డెనిమ్ డిజైనర్ దుస్తులను ఆవిష్కరించింది. యువజనులను ఆకర్షించేలా డెనిమ్ జీన్స్, జాకెట్లు, స్కర్ట్లు, బ్యాగ్‌లను నిఫ్ట్ విద్యార్ధులు, ఇతర ప్రముఖ డిజైనర్లు రూపొందించారని పేర్కొం ది. ఖాదీ షాప్‌ల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వివరించింది. -
మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో హర్షవర్ధన్!
శాఖ మార్పునకు పొగాకు లాబీయే కారణమా? సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్‌ను విస్తరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చౌందినీచౌక్ ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్‌ను కీలకమైన ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి తొలగించి అంతగా ప్రాముఖ్యత లేని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మంత్రిని చేయడం ఢిల్లీ రాజకీయవర్గాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా నగర రాజకీయాలలో మరింత చురుకైన పాత్ర పోషించడానికి అనువుగా హర్షవర్ధన్‌పై మంత్రిత్వశాఖ భారం తగ్గించారని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. కాగా మరికొందరు ఆరోగ్యమంత్రిగా ఆయన తొలగింపును పొగాకు లాబీతో ముడిపెడ్తున్నారు. పొగాకుకు వ్యతిరేకంగా డా. హర్షవర్ధన్ కఠిన చర్యలు చేపటారని ఆయన ఉద్యమ కార్యకర్త స్థాయిలో చురుకుగా వ్యవహరించడం పొగాకు లాబీకి గిట్టలేదని వారు అంటున్నారు. ఈ లాబీ ఒత్తిడి కారణంగానే హర్షవర్ధన్ ఆరోగ్యమంత్రి పదవి పోయిందని వారు భావిస్తున్నారు. ప్రధానమంత్రి స్వరాష్ట్రమైన గుజరాత్లో ప్రధాన పంటలలో పొగాకు ఒకటన్న విషయాన్ని కూడా వారు నొక్కి చెబుతున్నారు. హర్షవర్ధన్‌ను కేబినెట్ మంత్రిగా చేసిన తరువాత ఢిల్లీ బీజేపీలో నిజాయితీపరుడైన ముద్రతో పార్టీకి నేతృత్వం వహించే నాయకుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని మరింత మెజారిటీతో గెలిపించడం కోసం హర్షవర్ధన్‌కు వెసులుబాటు ఇచ్చేందుకే ఆయనకు అంతగా ప్రాధాన్యం లేని మంత్రిత్వశాఖను కట్టబెట్టారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అయితే హర్షవర్ధన్ విమర్శకులు మాత్రం ఈ రెండు వాదనలతో ఏకీభవించడం లేదు. ఎయిమ్స్ సీవీఓ తొలగింపు వివాదంలో చిక్కుకున్న హర్షవర్ధన్‌ను శిక్షించడం కోసమే ప్రధానమంత్రి ఆయనను ఆరోగ్య మంత్రి పదవి నుంచి తొలగించి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఈ వివాదం నిజాయితీపరునిగా హర్షవర్ధన్కున్న పేరుకు మచ్చతెచ్చిందని వారు అంటున్నారు. అయితే అలాంటప్పుడు ఈ వివాదంలో చిక్కుకున్న జేపీ నడ్డాకు ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఎలా కట్టబెట్టారని డా. హర్షవర్ధన్‌ను సమర్థించేవారు ప్రశ్నిస్తున్నారు. -
ఒకే శాఖగా రైల్వే, ఉపరితల రవాణా, నౌకాయానం?
- నరేంద్రమోడీ కసరత్తు - రైల్వే శాఖలో విస్తృత చర్చ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న రైల్వే, ఉపరితల రవాణా, నౌకాయాన శాఖలను కలిపి ఇక ఒకే మంత్రిత్వ శాఖగా మార్చేందుకు.. త్వరలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోడీ బృందం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటితో కూడిన శాఖను సీనియర్ మంత్రికి కేటాయించబోతున్నట్టు సమాచారం. ఆ మంత్రి ఆధ్వర్యంలో ఒక్కో అంశానికి విడివిడిగా ముగ్గురు సహాయ మంత్రులు పర్యవేక్షించే అవకాశం ఉందని.. రైల్వే శాఖ అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పాలనలో తనదైన మార్కు చూపుతానంటున్న నరేంద్రమోడీ తన మంత్రివర్గ కూర్పులో కూడా వైవిధ్యానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు కొనసాగినట్టుగా.. ఒక్కో శాఖకు ఒక మంత్రి, అంతగా ప్రాధాన్యం లేని వాటికి సహాయ మంత్రులు ఉండే పద్ధతికి స్వస్తి చెప్పి.. రెండుమూడు విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి సీనియర్ మంత్రులకు అప్పజెప్పాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖకు సమాచారం అందిందని.. మోడీ సన్నిహితులు ఉన్నతాధికారులతో మాట్లాడి సమాచారం సేకరించారని చెప్తున్నారు. ఈ మూడు రకాల రవాణా శాఖలు ఒకే గొడుగు కింద ఉంటేనే వాటి పర్యవేక్షణలో సమస్యలు రాకుండా ఉంటాయనేది మోడీ ఆలోచనగా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. గడ్కారీకి రైల్వే శాఖ? ఆర్థిక, హోం, రక్షణ.. ఇలా ప్రాధాన్యతా శాఖల జాబితాలో రైల్వే శాఖ కూడా ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న మహారాష్ట్రలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాన్ని బీజేపీ ఖాతాలోకి తెచ్చే క్రమంలో కొన్ని కీలక శాఖలు ఆ రాష్ట్రానికి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా రైల్వే శాఖను కూడా ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీకే ఇవ్వాలని మోడీ భావిస్తున్నారని, ఇందుకు ఆయన సన్నిహితుడైన నితిన్‌గడ్కారీ పేరును పరిశీలిస్తున్నారని రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో ఇంకా స్పష్టత మాత్రం రాలేదనేది వారి అభిప్రాయం. రైల్వేశాఖ ద్వారా స్థానికంగా పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవలి వరకు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ శాఖనే అడ్డుపెట్టుకొని నెట్టుకొచ్చారని అధికారులంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్బర్గా నియోజకవర్గంలో గెలుపు అంత సులభం కాదని ముందే గ్రహించిన ఖర్గే, రైల్వే బడ్జెట్‌తో సంబంధం లేకుండా తన నియోజకవర్గానికి రైలు కోచ్‌ల విడిభాగాలు తయారు చేసే కర్మాగారాన్ని మంజూరు చేయించారు. గుల్బర్గా నియోజకవర్గం పరిధిలోని యద్గీర్ ప్రాంతంలో బడియాల్ గ్రామంలో గత ఫిబ్రవరిలో హడావుడిగా ఈ కర్మాగారం భూమిపూజ చేయించారు. దీనిద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఆయన విజయంలో ఇదే కీలక పాత్ర పోషించిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రను ఎంపిక చేయటానికి కూడా ఇలాంటి కారణం ఉందనేది వారి అభిప్రాయం.