- నరేంద్రమోడీ కసరత్తు
- రైల్వే శాఖలో విస్తృత చర్చ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న రైల్వే, ఉపరితల రవాణా, నౌకాయాన శాఖలను కలిపి ఇక ఒకే మంత్రిత్వ శాఖగా మార్చేందుకు.. త్వరలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోడీ బృందం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటితో కూడిన శాఖను సీనియర్ మంత్రికి కేటాయించబోతున్నట్టు సమాచారం. ఆ మంత్రి ఆధ్వర్యంలో ఒక్కో అంశానికి విడివిడిగా ముగ్గురు సహాయ మంత్రులు పర్యవేక్షించే అవకాశం ఉందని.. రైల్వే శాఖ అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
పాలనలో తనదైన మార్కు చూపుతానంటున్న నరేంద్రమోడీ తన మంత్రివర్గ కూర్పులో కూడా వైవిధ్యానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు కొనసాగినట్టుగా.. ఒక్కో శాఖకు ఒక మంత్రి, అంతగా ప్రాధాన్యం లేని వాటికి సహాయ మంత్రులు ఉండే పద్ధతికి స్వస్తి చెప్పి.. రెండుమూడు విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి సీనియర్ మంత్రులకు అప్పజెప్పాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం.
దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖకు సమాచారం అందిందని.. మోడీ సన్నిహితులు ఉన్నతాధికారులతో మాట్లాడి సమాచారం సేకరించారని చెప్తున్నారు. ఈ మూడు రకాల రవాణా శాఖలు ఒకే గొడుగు కింద ఉంటేనే వాటి పర్యవేక్షణలో సమస్యలు రాకుండా ఉంటాయనేది మోడీ ఆలోచనగా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
గడ్కారీకి రైల్వే శాఖ?
ఆర్థిక, హోం, రక్షణ.. ఇలా ప్రాధాన్యతా శాఖల జాబితాలో రైల్వే శాఖ కూడా ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న మహారాష్ట్రలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాన్ని బీజేపీ ఖాతాలోకి తెచ్చే క్రమంలో కొన్ని కీలక శాఖలు ఆ రాష్ట్రానికి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా రైల్వే శాఖను కూడా ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీకే ఇవ్వాలని మోడీ భావిస్తున్నారని, ఇందుకు ఆయన సన్నిహితుడైన నితిన్‌గడ్కారీ పేరును పరిశీలిస్తున్నారని రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
అయితే ఇందులో ఇంకా స్పష్టత మాత్రం రాలేదనేది వారి అభిప్రాయం. రైల్వేశాఖ ద్వారా స్థానికంగా పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవలి వరకు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ శాఖనే అడ్డుపెట్టుకొని నెట్టుకొచ్చారని అధికారులంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్బర్గా నియోజకవర్గంలో గెలుపు అంత సులభం కాదని ముందే గ్రహించిన ఖర్గే, రైల్వే బడ్జెట్‌తో సంబంధం లేకుండా తన నియోజకవర్గానికి రైలు కోచ్‌ల విడిభాగాలు తయారు చేసే కర్మాగారాన్ని మంజూరు చేయించారు.
గుల్బర్గా నియోజకవర్గం పరిధిలోని యద్గీర్ ప్రాంతంలో బడియాల్ గ్రామంలో గత ఫిబ్రవరిలో హడావుడిగా ఈ కర్మాగారం భూమిపూజ చేయించారు. దీనిద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఆయన విజయంలో ఇదే కీలక పాత్ర పోషించిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రను ఎంపిక చేయటానికి కూడా ఇలాంటి కారణం ఉందనేది వారి అభిప్రాయం.