Shipping Department
-
ఆగిపోతున్న సరకు రవాణా..!
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను అష్టకష్టాలతో ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన ఉదంతం ఉంది. ఈ ఘటన వల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా ప్రభావం పడింది. వేల టన్నుల్లోని సరకు రవాణా నిలిచిపోయింది. అయితే సూయెజ్ కాలువకు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రం ప్రపంచ నౌకా రవాణాకు కీలక మార్గం. ఈజిప్టులోని సూయెజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యదరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గరి మార్గం. ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ, తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడీ మార్గం ప్రమాదంలో పడింది. యెమెన్ కేంద్రంగా హౌతీ రెబల్స్ సరకు రవాణా చేసే నౌకలపై దాడులకు దిగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. హౌతీ దాడులతో షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఆఫ్రికాలోని బిజోటీ పక్కనే ఉన్న బాబ్ ఎల్-మండెబ్ మార్గంలో నౌకల రవాణా నిలిపేయనున్నట్లు ప్రకటించాయి. ఇది 10శాతం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. ఎర్ర సముద్రం మీదుగా 35 శాతం రవాణాను ఆపేశాయి. మార్స్క్, ఎంఎస్సీ, హపాగ్ లాయిడ్ కంపెనీలు ఇప్పటికే రవాణాను నిలిపేశాయి. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16శాతం. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌకగా ఉంటుంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైయినర్ ధర 5 శాతం పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సూయెజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతోపాటు సమయం వృథా అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా సముద్ర దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరోపాకు భారత్ నుంచి నౌకల ద్వారా సరకు రవాణా అవుతోంది. దీనికి ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటోంది. దీంతోపాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులే అధికంగా ఉంటారు. మొత్తం సిబ్బందిలో 12 శాతం భారతీయులే. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా యుద్ధం నేపథ్యంలో వారికి హౌతీ రెబల్స్ ప్రమాదకరంగా మారారు. ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే సరకు రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది. రెండు వైపులా రోజుకు దాదాపు 9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే.. హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీ షియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్‌ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రూప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఇరాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మండెబ్పై హౌతీ రెబల్స్‌కు ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్-మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. -
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అక్కయ్యపాలెం (విశాఖ, ఉత్తరం): ఆంధ్రప్రదేశ్ ఎన్నో సహజ వనరులున్న సుందర రాష్ట్రమని.. దీనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం విశాఖలోని అక్కయ్యపాలెంలో పేదల సంక్షేమ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏపీ ప్రజలకు 22 లక్షల ఇళ్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి రావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం అనకాపల్లి, విశాఖ జిల్లాల లబ్ధిదారులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చెక్కులను ఆయన అందజేశారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, కలెక్టర్ మల్లికార్జున, పోర్టు చైర్మన్ రామ్మోహన్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పాల్గొన్నారు. కాగా, ప్రధాని మోదీ కేంద్ర పథకాల లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. ఇందుకోసం సభా ప్రాంగణంలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే ఆయన లద్దాఖ్, బిహార్, త్రిపుర, కర్ణాటక, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారులతోనే ముచ్చటించారు. -
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మారుస్తాం: మోదీ
అహ్మదాబాద్: నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా పేరు మారుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్లో రో–పాక్స్ ఫెర్రీ (నౌక) సర్వీసును ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇది 370 కి.మీ దూరాన్ని ఇది 90 కిలోమీటర్లకు (సముద్ర మార్గం) తగ్గిస్తుంది. ‘ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్ శాఖ పేరును మారుస్తున్నామని చెప్పారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాల న్నారు. నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని తగ్గించేందుకు, పన్ను వ్యవహారాల్లో క్లిష్టత తొలగిపోవడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు దోహద పడిందని మోదీ చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. పన్నుల వ్యవహారాలు మెరుగుపడేందుకు, మెరుగైన పన్ను, జీడీపీ నిష్పత్తికి నోట్ల రద్దు ఎలా దోహదపడిందో తెలిపే గ్రాఫిక్‌ను షేర్ చేశారు. -
ఓడల్లో ప్లాస్టిక్ నిషేధం
న్యూఢిల్లీ: ఇకపై ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిర్ణయించింది. కేవలం మనదేశానికి చెందిన షిప్పులకు మాత్రమేగాక, ఇతర దేశ ఓడలు భారత జలాలపై తిరుగుతున్నపుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. భారత జలాల్లో ప్రవేశించే ముందే తమతో ఉన్న ప్లాస్టిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లను కూడా నిషేధించనున్నారు. సముద్ర జలాల్లో వీటి అవశేషాలే ఎక్కువగా ఉంటున్న తేలిన విషయం తెలిసిందే. -
‘జలరవాణా’తో అవకాశాలు
కొత్త ప్రాజెక్టులతో కోటిమందికి ఉపాధి ♦ మారిటైమ్ సదస్సులో ప్రధాని మోదీ ముంబై: దేశంలోని జలరవాణా అభివృద్ధి, అనుసంధానానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోదీ గురువారం పిలుపునిచ్చారు. ముంబైలో మొదటి మారిటైమ్ ఇండియా సమిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ... ఓడరేవుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు సేకరించాలని నిర్ణయించామని చెప్పారు. సముద్రతీర ప్రాంత అభివృద్ధికి ఇదే సరైన సమయమన్నారు. ఓడరేవుల సామర్థ్యాన్ని 2025 నాటికి 140 కోట్ల టన్నుల నుంచి 300 కోట్ల టన్నులకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఎగుమతి, దిగుమతుల సామర్థ్యాన్ని అందుకునేందుకు ఐదు కొత్త ఓడరేవుల్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. భారతీయ నౌకా పరిశ్రమ అభివృద్ధి కోసం సుదీర్ఘ కసరత్తుకు కట్టుబడి ఉన్నామని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని జారవిడుచుకోవ ద్దని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కరే... దేశ జల, నదీ రవాణా విధానానికి రూపకర్తని చెప్పారు. 10 ఏళ్లలో కోటిమందికి ఉపాధి మారిటైమ్ విభాగంలో 250 ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం నౌకాయాన శాఖ ఆహ్వానిస్తోందని తెలిపారు. 12 ప్రధాన ఓడరేవుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. వీటిలోని 100 ప్రాజెక్టులు సాగరమాల పథకంలో భాగంగా నిర్మిస్తారని మోదీ వెల్లడించారు. ఇవి అమలైతే కోటి మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు.సాగరమాలకు సంబంధించి జాతీయ విధానాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ.. పోర్టుల అభివృద్ధికి ఉద్దేశించిన సాగరమాల ప్రాజెక్టు కాలపరిమితిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈనామ్ ఆవిష్కరణ ఢిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ (ఈనామ్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతానికి తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 21 మార్కెట్లను అనుసంధానిస్తారు. -
ఒకే శాఖగా రైల్వే, ఉపరితల రవాణా, నౌకాయానం?
- నరేంద్రమోడీ కసరత్తు - రైల్వే శాఖలో విస్తృత చర్చ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న రైల్వే, ఉపరితల రవాణా, నౌకాయాన శాఖలను కలిపి ఇక ఒకే మంత్రిత్వ శాఖగా మార్చేందుకు.. త్వరలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోడీ బృందం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటితో కూడిన శాఖను సీనియర్ మంత్రికి కేటాయించబోతున్నట్టు సమాచారం. ఆ మంత్రి ఆధ్వర్యంలో ఒక్కో అంశానికి విడివిడిగా ముగ్గురు సహాయ మంత్రులు పర్యవేక్షించే అవకాశం ఉందని.. రైల్వే శాఖ అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పాలనలో తనదైన మార్కు చూపుతానంటున్న నరేంద్రమోడీ తన మంత్రివర్గ కూర్పులో కూడా వైవిధ్యానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు కొనసాగినట్టుగా.. ఒక్కో శాఖకు ఒక మంత్రి, అంతగా ప్రాధాన్యం లేని వాటికి సహాయ మంత్రులు ఉండే పద్ధతికి స్వస్తి చెప్పి.. రెండుమూడు విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి సీనియర్ మంత్రులకు అప్పజెప్పాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖకు సమాచారం అందిందని.. మోడీ సన్నిహితులు ఉన్నతాధికారులతో మాట్లాడి సమాచారం సేకరించారని చెప్తున్నారు. ఈ మూడు రకాల రవాణా శాఖలు ఒకే గొడుగు కింద ఉంటేనే వాటి పర్యవేక్షణలో సమస్యలు రాకుండా ఉంటాయనేది మోడీ ఆలోచనగా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. గడ్కారీకి రైల్వే శాఖ? ఆర్థిక, హోం, రక్షణ.. ఇలా ప్రాధాన్యతా శాఖల జాబితాలో రైల్వే శాఖ కూడా ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న మహారాష్ట్రలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాన్ని బీజేపీ ఖాతాలోకి తెచ్చే క్రమంలో కొన్ని కీలక శాఖలు ఆ రాష్ట్రానికి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా రైల్వే శాఖను కూడా ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీకే ఇవ్వాలని మోడీ భావిస్తున్నారని, ఇందుకు ఆయన సన్నిహితుడైన నితిన్‌గడ్కారీ పేరును పరిశీలిస్తున్నారని రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో ఇంకా స్పష్టత మాత్రం రాలేదనేది వారి అభిప్రాయం. రైల్వేశాఖ ద్వారా స్థానికంగా పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవలి వరకు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ శాఖనే అడ్డుపెట్టుకొని నెట్టుకొచ్చారని అధికారులంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్బర్గా నియోజకవర్గంలో గెలుపు అంత సులభం కాదని ముందే గ్రహించిన ఖర్గే, రైల్వే బడ్జెట్‌తో సంబంధం లేకుండా తన నియోజకవర్గానికి రైలు కోచ్‌ల విడిభాగాలు తయారు చేసే కర్మాగారాన్ని మంజూరు చేయించారు. గుల్బర్గా నియోజకవర్గం పరిధిలోని యద్గీర్ ప్రాంతంలో బడియాల్ గ్రామంలో గత ఫిబ్రవరిలో హడావుడిగా ఈ కర్మాగారం భూమిపూజ చేయించారు. దీనిద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఆయన విజయంలో ఇదే కీలక పాత్ర పోషించిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రను ఎంపిక చేయటానికి కూడా ఇలాంటి కారణం ఉందనేది వారి అభిప్రాయం.