
అక్కయ్యపాలెం (విశాఖ, ఉత్తరం): ఆంధ్రప్రదేశ్ ఎన్నో సహజ వనరులున్న సుందర రాష్ట్రమని.. దీనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం విశాఖలోని అక్కయ్యపాలెంలో పేదల సంక్షేమ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏపీ ప్రజలకు 22 లక్షల ఇళ్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి రావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం అనకాపల్లి, విశాఖ జిల్లాల లబ్ధిదారులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చెక్కులను ఆయన అందజేశారు.
సమావేశంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, కలెక్టర్ మల్లికార్జున, పోర్టు చైర్మన్ రామ్మోహన్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పాల్గొన్నారు. కాగా, ప్రధాని మోదీ కేంద్ర పథకాల లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. ఇందుకోసం సభా ప్రాంగణంలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే ఆయన లద్దాఖ్, బిహార్, త్రిపుర, కర్ణాటక, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారులతోనే ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment