Govt Undertaking 113 Projects Under Sagarmala Project In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీలో లక్షా 20 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌లు

Published Tue, Jul 25 2023 7:42 PM | Last Updated on Tue, Jul 25 2023 8:20 PM

Govt undertaking 113 Projects Under Sagarmala Project In Andhra Pradesh - Sakshi

న్యూఢిల్లీ: సాగరమాల కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయలతో 113 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. సాగరమాల ప్రోగ్రాం కింద ప్రస్తుతం ఉన్న పోర్టులు, టెర్మినల్స్, రోల్ ఆన్, రోల్ ఆఫ్, టూరిజం జెట్టీల ఆధునీకరణ, పోర్టుల కనెక్టివిటీ, విస్తరణ, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజక్టులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్టేట్ మారిటైం బోర్డులు, మేజర్ పోర్టులు, పబ్లిక్ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ సమన్వయంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ పోర్ట్ అథారిటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర రోడ్ విభాగం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యుత్ శాఖ, ఐఆర్ ఎస్, ఏపీ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ మారిటైం బోర్డు మెదలగు సంస్థలు ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

రాష్ట్రంలో చేపట్టిన మొత్తం ప్రాజెక్టుల్లో ఇప్పటికే 32 వేల కోట్లతో చేపట్టిన 36 ప్రాజక్టులు పూర్తి చేశామని, మిగిలిన రూ.91వేల కోట్లతో చేపట్టిన 77 ప్రాజక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు. పోర్టు ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు,పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, కోస్టల్ షిప్పింగ్, ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి రూ.32210 కోట్లతో చేపట్టిన 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే రూ.17,741 కోట్లతో చేపట్టిన 27 ప్రాజెక్టులు పురోగతి దశలోనూ, రూ.73527 కోట్లతో చేపట్టిన మిగిలిన 50 ప్రాజెక్టులు అమలు దశలోనూ ఉన్నట్లు మంత్రి తెలిపారు. 

రైతులకు అందుబాటులో నానో డీఏపీ
న్యూఢిల్లీ: నానో డీఏపీని మార్కెట్లోకి ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా వెల్లడించారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. ఇఫ్కో సమాచారం ప్రకారం నానో డీఏపీ ద్రవరూపంలో ఉండగా, సాంప్రదాయ డీఏపీ కణికల రూపంలో ఉంటుందని తెలిపారు.

నానో డీఏపీ విత్తనాలు, వేర్లు, ఆకులకు అందేలా వినియోగించగా, సాంప్రదాయ డీఏపీ మట్టిలో మాత్రమే వినియోగిస్తారని తెలిపారు. వినియోగ సామర్థ్యం 20%-30%గా ఉన్న సాంప్రదాయ డీఏపీతో పోలిస్తే నానో డీఏపీ వినియోగ సామర్థ్యం 80%-90% ఉంటుందని అన్నారు. సాంప్రదాయ డీఏపీకి రాయితీ అందిస్తుండగా, నానో డీఏపీకి మాత్రం సబ్సిడీ లేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement