Sagarmala programme
-
ఏపీలో లక్షా 20 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌లు
న్యూఢిల్లీ: సాగరమాల కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయలతో 113 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. సాగరమాల ప్రోగ్రాం కింద ప్రస్తుతం ఉన్న పోర్టులు, టెర్మినల్స్, రోల్ ఆన్, రోల్ ఆఫ్, టూరిజం జెట్టీల ఆధునీకరణ, పోర్టుల కనెక్టివిటీ, విస్తరణ, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజక్టులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్టేట్ మారిటైం బోర్డులు, మేజర్ పోర్టులు, పబ్లిక్ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ సమన్వయంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ పోర్ట్ అథారిటీ, ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర రోడ్ విభాగం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యుత్ శాఖ, ఐఆర్ ఎస్, ఏపీ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ మారిటైం బోర్డు మెదలగు సంస్థలు ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన మొత్తం ప్రాజెక్టుల్లో ఇప్పటికే 32 వేల కోట్లతో చేపట్టిన 36 ప్రాజక్టులు పూర్తి చేశామని, మిగిలిన రూ.91వేల కోట్లతో చేపట్టిన 77 ప్రాజక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు. పోర్టు ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు,పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, కోస్టల్ షిప్పింగ్, ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి రూ.32210 కోట్లతో చేపట్టిన 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే రూ.17,741 కోట్లతో చేపట్టిన 27 ప్రాజెక్టులు పురోగతి దశలోనూ, రూ.73527 కోట్లతో చేపట్టిన మిగిలిన 50 ప్రాజెక్టులు అమలు దశలోనూ ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు అందుబాటులో నానో డీఏపీ న్యూఢిల్లీ: నానో డీఏపీని మార్కెట్లోకి ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా వెల్లడించారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. ఇఫ్కో సమాచారం ప్రకారం నానో డీఏపీ ద్రవరూపంలో ఉండగా, సాంప్రదాయ డీఏపీ కణికల రూపంలో ఉంటుందని తెలిపారు. నానో డీఏపీ విత్తనాలు, వేర్లు, ఆకులకు అందేలా వినియోగించగా, సాంప్రదాయ డీఏపీ మట్టిలో మాత్రమే వినియోగిస్తారని తెలిపారు. వినియోగ సామర్థ్యం 20%-30%గా ఉన్న సాంప్రదాయ డీఏపీతో పోలిస్తే నానో డీఏపీ వినియోగ సామర్థ్యం 80%-90% ఉంటుందని అన్నారు. సాంప్రదాయ డీఏపీకి రాయితీ అందిస్తుండగా, నానో డీఏపీకి మాత్రం సబ్సిడీ లేదని తెలిపారు. -
విశాఖను వరించిన 'సాగరమాల'
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖను ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి అక్కడికి అనేక భారీ ప్రాజెక్ట్‌లు క్యూకడుతున్నాయి. తాజాగా ఆ ప్రాంతాన్ని మరిన్ని భారీ ప్రాజెక్ట్‌లు వరించాయి. ఏపీలో కేంద్రం ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 'సాగరమాల' పథకంలో భాగంగా విశాఖకు అనేక భారీ నిర్మాణ ప్రాజెక్ట్‌లు దక్కాయి. సోమవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు, జలరవాణ, షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. సాగరమాల పథకం కింద రూ. 85, 576 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 92 రోడ్లు, రైల్, పోర్టులు, జెట్టీలు, జలరవాణా అభివృద్ధి ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా, విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు 40 ప్రాజెక్టులు కేటాయించబడ్డట్లు ఆయన తెలిపారు. వీటిలో శ్రీకాకుళం జిల్లా బారువ, కళింగపట్నం పోర్టుల ఆధునీకరణ పనులు, విశాఖ జిల్లా భీమునిపట్నంలో ప్రయాణీకుల కోసం నిర్మించ తలపెట్టిన జెట్టీ నిర్మాణ ప్రాజెక్ట్, రూ.2,352 కోట్లతో విశాఖపట్నంలోని షీలా నగర్ జంక్షన్ నుంచి అనకాపల్లి, సబ్బవరం, పెందుర్తి మీదుగా ఎన్‌హెచ్ 16కు కలిసేలా రోడ్డు నిర్మాణం, రూ.138 కోట్ల వ్యయంతో గంగవరం పోర్టు నుంచి అచ్యుతాపురం ఎస్ఈజెడ్ వరకు నాలుగు వరుసల బీచ్ రోడ్డు, ఎన్‌హెచ్ 16పై మింది నుంచి నాతయ్యపాలెం వరకు ఫ్లైఓవర్ నిర్మాణం, గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టును కలిపేలా నాలుగు వరుసల కోస్టల్ రోడ్డు తదితర భారీ ప్రాజెక్ట్లున్నట్లు వెల్లడించారు. కాగా, కేంద్రం మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్ట్‌ల్లో రూ. 4,717 కోట్ల వ్యయంతో పోర్టు అధునీకరణ కింద 22 ప్రాజెక్ట్‌లు.. రోడ్డు, రైలు, జల రవాణా కనెక్టివిటీని పెంచేందుకు రూ. 47, 852 కోట్ల వ్యయంతో 54 ప్రాజెక్ట్‌లు.. పోర్టు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామీకరణకు రూ. 32, 053 కోట్ల వ్యయంతో 10 ప్రాజెక్ట్‌లు.. కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్కు 952 కోట్ల వ్యయంతో కూడిన 6 ప్రాజెక్ట్‌లున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ల్లో ఇప్పటి వరకు 25 వేల కోట్ల వ్యయంతో 28 ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినట్లు, 51 వేల కోట్ల వ్యయంతో 29 ప్రాజెక్టుల్లో పనులు కొనసాగుతున్నట్లు, 8,945 కోట్ల వ్యయం కాగల 35 ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో ఉన్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ వెల్లడించారు. -
రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్
సాక్షి, న్యూఢిల్లీ: సాగర్మాల కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఏడు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్పీ)లను ఏర్పా టు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజ స్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వీటిని నెలకొల్పనున్నారు. దేశవ్యాప్తంగా సరుకు రవాణా తీరుతెన్నులను అధ్యయనం చేసి పారిశ్రామిక క్లస్టర్లకు అందుబాటులో ఉండేలా ఆయా ప్రాంతాల ను గుర్తించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో ఒక ఎంఎంఎల్పీ అందుబాటులోకి వచ్చిందని కేంద్రానికి కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్) తెలి పింది. తెలంగాణలోని నాగులపల్లిలో 60 ఎకరాల్లో .. ఇప్పటికే 16 ఎకరాల్లో రూ.120 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధిలక్ష్యంగా కేంద్రం సాగర్మాల రూపొందించిన సంగతి తెలిసిందే.