కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడి
సాక్షి, అమరావతి: సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.2,483 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులను చేపట్టినట్లు కేంద్ర నౌకాయాన, ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ లోక్‌సభలో వెల్లడించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ మొత్తం ఏడు ప్రాజెక్టుల్లో ఇప్పటికే రూ.1,114 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల పనులు పూర్తయినట్లు తెలిపారు.
పూర్తయిన పనుల్లో రూ.85.83 కోట్లతో కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణ, విశాఖ పోర్టులో రూ.43 కోట్లతో కోస్టల్ బెర్త్ నిర్మాణం, రూ.46.34 కోట్లతో విశాఖ పోర్టును అనుసంధానం చేసే రహదారి నిర్మాణం, రెండో దశలో రూ.77 కోట్లతో రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ, రూ.574 కోట్లతో మారిటైమ్ షిప్‌బిల్డింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు, రూ.288 కోట్లతో నెల్లూరు వద్ద జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. మరో ఆరు ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు.
ఇందులో ముఖ్యమైనవి రూ.386 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, రూ.364 కోట్లతో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్, రూ.387 కోట్లతో పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్, రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రూ.73 కోట్లతో బియ్యపు తిప్ప వద్ద కోస్టల్ బెర్త్ నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. మూడేళ్లలో రాష్ట్రంలోని నాన్ మేజర్ పోర్టులు(విశాఖ పోర్టు కాకుండా మిగిలిన పోర్టులు) ద్వారా వాణిజ్య ఎగుమతులు 88 మిలియన్ టన్నుల నుంచి 118 మిలియన్ టన్నులకు పెరిగాయని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కాకినాడ గేట్‌వే పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల నుంచి 2021–22లో 88 మిలియన్ టన్నుల సరుకులు ఎగుమతి కాగా, అది 2023–24 ఆర్థిక సంవత్సరానికి 118 మిలియన్ టన్నులకు పెరిగిందని, ఇదే సమయంలో మేజర్ పోర్టు విశాఖ నుంచి ఎగుమతులు 69 మిలియన్ టన్నుల నుంచి 81 మిలియన్ టన్నులకు పెరిగినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment