పాస్‌పోర్టుకూ ఆధార్ లింకు
- విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టుకు ఆధార్ నంబర్ అనుసంధానం చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 7 పాస్‌పోర్ట్ సేవా కేంద్రా ల్లో తొలుత ఈ ప్రక్రియను చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, రాంచిలతో పాటు విశాఖ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఆధార్ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశంలోని అన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఆధార్ నంబర్‌ను పాస్‌పోర్టుకు అనుసంధానించడమంటే.. రెండింటికీ సంబంధించి వేలిముద్రలు, ఐరిష్ (కనుపాప)లను సరిపోల్చి నిర్ధారిస్తారు. బయోమెట్రిక్ వివరాలను కూడా సరిపోల్చుతారు. దీన్నే ‘డిజిటల్ ఇంటిగ్రేట్ డేటా బేస్’ అని అంటారు. ఇలా పాస్‌పోర్టుకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల నకిలీలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని విదేశీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది.