dr harshvardhan
-
మలినాలతో పాతఢిల్లీవాసులు విసిగిపోయారు
న్యూఢిల్లీ: మలినాల మధ్య కాలం గడపలేక పాత ఢిల్లీవాసులు విసిగిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. అందువల్లనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరంభించిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ చక్కగా ప్రతిస్పందించారన్నారు. నగరంంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి కుడ్యనగరవాసులు చక్కగా స్పందించడాన్ని నేను గుర్తించాను. మలినాల మధ్య కాలం వెళ్లదీయలేక పాత ఢిల్లీవాసులు ఇప్పటికే బాగా విసిగిపోయారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో పాతఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నేను పర్యటించా. ఈ సందర్భంగా అనేకమంది నగరవాసుల్లో పారిశుధ్యం ఆవశ్యకతపై స్ఫూర్తి కలిగించా. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ముందుకు రావాలని కోరా. ఈ ఆలోచన వారికి ఎంతగానో నచ్చింది’ అని అన్నారు. పారిశుధ్య కార్యక్రమం చేపట్టడానికి బక్రీద్ శుభదినమని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరచూ తనిఖీలు చేయండి పాత ఢిల్లీని తరచూ తనిఖీలు చేపట్టాలని మంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. ఈ ప్రాంతంలో మరిన్ని మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. ప్రతిరోజూ వ్యర్థాలను తొలగించాలన్నారు. ఫటక్ తెలియాన్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాలుకు మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులపై అవసరమని భావిస్తే మరింత శ్రద్ధ చూపాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
కర్నూలులో ఎయిమ్స్, కృష్ణా వాటర్ బోర్డును ఏర్పాటు చేయండి
సాక్షి, కర్నూలు: వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కర్నూలులో ఎయిమ్స్ కళాశాల, కృష్ణా వాటర్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్లమెంట్ హౌస్‌లో శుక్రవారం విడివిడిగా కలిసి విజ్ఞప్తి చేశారు. కర్నూలులో ఎయిమ్స్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల సీమ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, అలాగే రూ. 250 కోట్లతో కర్నూలు మెడికల్ కళాశాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించాలని, మరో రూ.30 కోట్లతో ఆర్పీఎన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసిన సందర్భంలో కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని, అలాగే తుంగభద్ర, వేదావతి నదులపై సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు సహకరించాలని ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి చేశారు. -
ఆప్ సభపై దాడి
ఢిల్లీ చాందినీ చౌక్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగసభపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చాందినీ చౌక్ నియోజకవర్గంలోని సీతారామ్ బాజార్ లో ఆప్ సభ జరుగుతూండగా దగ్గర్లోని ఒక భవనం నుంచి బాటిళ్లు విసిరారు. దీనితో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎక్కడివారక్కడ పరుగులు తీశారు. సభలో చాందినీ చౌక్ అభ్యర్థి అశుతోష్, మరికొందరు నాయకులు ఉన్నారు. ఒక మహిళా కార్యకర్త ప్రసంగిస్తూండగా ఈ దాడి జరిగింది. అయితే అదృష్ట వశాత్తూ ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. తక్షణమే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఒక ముప్పావుగంటకి మళ్లీ సభ మొదలైంది. 'ఇలాంటి దాడులను అందరూ గర్హించాలి. ఇది ప్రజాస్వామ్యం కానేకాదు. మాకు ఇలాంటి దాడులంటే భయం లేదు. మేం ముందుకు సాగుతూనే ఉంటాం' అని అశుతోష్ అన్నారు. చాందినీ చౌక్ నియోజకవర్గంలో ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి డా. హర్షవర్ధన్ కూడా పోటీలో ఉన్నారు. -
గోయల్ గాయబ్!!
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్ ఎంపిక కావడంతో ఆ పార్టీ ప్రచార పోస్టర్లు, హోర్డింగ్‌లు ఒక్కసారిగా మారిపోయాయి. ఇన్నాళ్లూ ఆ పార్టీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ ముఖచిత్రం ప్రధాన ఆకర్షణగా కనిపించిన పోస్టర్లన్నీ ఇప్పుడు కనిపించడంలేదు. గోయల్ ముఖచిత్రం స్థానంలో ఇప్పుడు ఎక్కడ చూసినా డాక్టర్ హర్షవర్ధన్ ముఖచిత్రమే కనిపిస్తోంది. ఈ పరిణామంతో హర్షవర్ధన్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగానేకాకుండా ఢిల్లీ విధానసభ ఎన్నికలకు బీజేపీ తరఫున ప్రచార సారథిగా కూడా మారిపోయారు. నిజాయతీ కలిగిన నేతగా ముద్రవేసుకున్న హర్షవర్ధన్ చిత్రాలను పోస్టర్లపై ముద్రించడంతో ఆ పార్టీ ప్రచార వ్యూహం కూడా మారిపోయింది. కొత్త కొత్త నినాదాలతో నగరవ్యాప్తంగా బీజేపీ పోస్టర్లను, హోర్డింగులను ఏర్పాటు చేసింది. ఇమాన్దార్ వ్యక్తిత్వ్..జిమ్మెదార్ నేతృత్వ్ (నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం, బాధ్యతాయుతమైన నేతృత్వం), శాసక్ నహీ సేవక్ (పాలకులం కాదు సేవకులం), బద్లేంగే దిల్లీ బద్లేంగే భారత్ (ఢిల్లీని మారుద్దాం, భారత్‌ను మారుద్దాం) అనే సరికొత్త నినాదాలతో ఏర్పాటు చేసిన పోస్టర్లు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హర్షవ ర్ధన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మరుపసటి రోజునే చాలా ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి. వాటిని ఇప్పుడు నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా ముగ్గురు సభ్యులున్న ప్రచార కమిటీ ఢిల్లీలో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నళిన్ కోహ్లీ, ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు అశీష్ సూద్, అజయ్ సింగ్ ఈ కమిటీలో సభ్యులు. సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ మార్గదర్శకత్వంలో ఈ కమిటీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తోంది.