ఆప్ సభపై దాడి
ఢిల్లీ చాందినీ చౌక్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగసభపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చాందినీ చౌక్ నియోజకవర్గంలోని సీతారామ్ బాజార్ లో ఆప్ సభ జరుగుతూండగా దగ్గర్లోని ఒక భవనం నుంచి బాటిళ్లు విసిరారు. దీనితో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎక్కడివారక్కడ పరుగులు తీశారు.
సభలో చాందినీ చౌక్ అభ్యర్థి అశుతోష్, మరికొందరు నాయకులు ఉన్నారు. ఒక మహిళా కార్యకర్త ప్రసంగిస్తూండగా ఈ దాడి జరిగింది. అయితే అదృష్ట వశాత్తూ ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. తక్షణమే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఒక ముప్పావుగంటకి మళ్లీ సభ మొదలైంది.
'ఇలాంటి దాడులను అందరూ గర్హించాలి. ఇది ప్రజాస్వామ్యం కానేకాదు. మాకు ఇలాంటి దాడులంటే భయం లేదు. మేం ముందుకు సాగుతూనే ఉంటాం' అని అశుతోష్ అన్నారు. చాందినీ చౌక్ నియోజకవర్గంలో ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి డా. హర్షవర్ధన్ కూడా పోటీలో ఉన్నారు.