గోయల్ గాయబ్!!
Published Sat, Oct 26 2013 11:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్ ఎంపిక కావడంతో ఆ పార్టీ ప్రచార పోస్టర్లు, హోర్డింగ్‌లు ఒక్కసారిగా మారిపోయాయి. ఇన్నాళ్లూ ఆ పార్టీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ ముఖచిత్రం ప్రధాన ఆకర్షణగా కనిపించిన పోస్టర్లన్నీ ఇప్పుడు కనిపించడంలేదు. గోయల్ ముఖచిత్రం స్థానంలో ఇప్పుడు ఎక్కడ చూసినా డాక్టర్ హర్షవర్ధన్ ముఖచిత్రమే కనిపిస్తోంది. ఈ పరిణామంతో హర్షవర్ధన్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగానేకాకుండా ఢిల్లీ విధానసభ ఎన్నికలకు బీజేపీ తరఫున ప్రచార సారథిగా కూడా మారిపోయారు. నిజాయతీ కలిగిన నేతగా ముద్రవేసుకున్న హర్షవర్ధన్ చిత్రాలను పోస్టర్లపై ముద్రించడంతో ఆ పార్టీ ప్రచార వ్యూహం కూడా మారిపోయింది. కొత్త కొత్త నినాదాలతో నగరవ్యాప్తంగా బీజేపీ పోస్టర్లను, హోర్డింగులను ఏర్పాటు చేసింది.
ఇమాన్‌దార్ వ్యక్తిత్వ్..జిమ్మెదార్ నేతృత్వ్ (నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం, బాధ్యతాయుతమైన నేతృత్వం), శాసక్ నహీ సేవక్ (పాలకులం కాదు సేవకులం), బద్లేంగే దిల్లీ బద్లేంగే భారత్ (ఢిల్లీని మారుద్దాం, భారత్‌ను మారుద్దాం) అనే సరికొత్త నినాదాలతో ఏర్పాటు చేసిన పోస్టర్లు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హర్షవ ర్ధన్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మరుపసటి రోజునే చాలా ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి. వాటిని ఇప్పుడు నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా ముగ్గురు సభ్యులున్న ప్రచార కమిటీ ఢిల్లీలో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నళిన్ కోహ్లీ, ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు అశీష్ సూద్, అజయ్ సింగ్ ఈ కమిటీలో సభ్యులు. సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ మార్గదర్శకత్వంలో ఈ కమిటీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తోంది.
Advertisement