తెలుగు సాహిత్య వైతాళికుడు సుందరరాజు
అనంతపురం కల్చరల్ : ప్రముఖ దళిత కవి, కథా రచయిత డాక్టర్ నాగప్పగారి సుందరరాజు తెలుగు సాహిత్యానికి వైతాళికుడని ప్రముఖ కథారచయిత లక్ష్మీనరసయ్య కొనియాడారు. మాదిగ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించిన సుందరరాజు 16వ వర్థంతి సభకు డాక్టర్ జెన్నే ఆనంద్‌కుమార్ అధ్యక్షత వహించారు. లక్ష్మీనరసయ్యతో పాటు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య ఏవీ రమణ, డీన్ ఆచార్య బాలసుబ్రమణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఆధునిక తెలుగు సాహిత్యం–మాదిగ అస్తిత్వం’ అనే అంశంపై వారు మాట్లాడారు. కారంచేడు సంఘటన మాదిగ సాహిత్యానికి పునాది వేసిందన్నారు. దళితుల జీవితాల కోసం అహర్నిశలు ఆలోచించి వాటిని పోరాటాలుగా మార్చిన ఘనత సుందరరాజుదేనన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జూపల్లి ప్రేమ్‌చంద్, ప్రముఖ కథా రచయిత శాంతినారాయణ, మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడుతూ సుందరరాజు సాహితీ సేవలను గుర్తు చేసుకున్నారు. కార్పొరేటర్ బంగి సుదర్శన్, బండారు శంకర్, బహుజన దళిత ఉద్యమ నేత జెన్నే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.