రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్: కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ రాజ్యాంగానికి, సంప్రదాయానికి, చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు సీమాంధ్ర ప్రజలు, మరోవైపు తెలంగాణ లోని మెజార్టీ ప్రజలు రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్రాన్ని విభిజించేందుకు పూనుకుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రతులను యుద్ధ విమానంలో రాష్ట్రానికి తీసుకురావాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టంపై యుద్ధం చేసేందుకే వచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఆరు కోట్లమంది ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. చట్టసభల్లో పోరాటం చేయకుండా సిగ్గులేకుండా విభజనకు పాల్పడుతున్నారన్నారు.
ఇటువంటి విభజన గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. విభజన రాజ్యాంగంలోని 371(డి) ఆర్టికల్ 3ని ఉల్లంఘించి జరుగుతుం దన్నారు. విభజన అనేది అన్ని పక్షాల ఆమోదంతో జరగాల్సివుండగా ఎమ్మెల్యేల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ర్టపతి కూడా నిర్ణయం తీసుకున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించినా ఇంకా విభజన చేయాలనే తలంపుతోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు.
భారత సంతతి కాని సోనియాగాంధీ ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ ఒక మాఫి యాలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రానున్న 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనిపించదని డాక్టర్ కోడెల జోస్యం చెప్పారు. సొంత పార్టీ ఎంపీలే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస నోట్ ఇవ్వటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతిగా తయారైందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో చర్చలంటేనే భయపడే పరిస్థితికి చేరుకుందన్నారు. రాహూల్ గాంధీ పేరు చెబితే ఓట్లుకూడా పడని పరిస్థితి ఎదురైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతమయ్యేవరకు సీమాంధ్రలో ఉద్యమం సాగుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రియాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి కొల్లి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ కడియం కోటిసుబ్బారావులు పాల్గొన్నారు.