హిల్లరీ క్లింటన్ ఫిట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ ఆరోగ్యంపై అనేక వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో వాటిని తెరదించేందుకు ఆమె సిద్ధమయ్యారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను విడుదల చేశారు. హిల్లరీ ఆరోగ్యంగానే ఉన్నారని, అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వ్యక్తిగత వైద్యుడు లిసా బర్డాక్ చెప్పారు.
నాలుగు రోజుల క్రితం న్యూయార్క్‌లో సెప్టెంబర్ 11 దాడుల మృతులకు నివాళులర్పిస్తుండగా స్పృహ తప్పి పడిపోయిన విషయం విదితమే. దీంతో ఎన్నికల ప్రచారంతో పాటు నిధుల సేకరణ కోసం ముందుగా ఏర్పాటు చేసుకున్న కాలిఫోర్నియా పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు. దీంతో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. హిల్లరీకి ఆరోగ్య సమస్యలు కొత్త కాదని, గతంలో అనేకమార్లు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు.
గతంలో ఒకసారి క్లేవ్‌ల్యాండ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా గుక్కతిప్పుకోలేని దగ్గుతో హిల్లరీ ఇబ్బంది పడ్డారు. 2013 డిసెంబర్లో అకస్మాత్తుగా స్పృహతప్పిపడిపోవడంతో న్యూయార్క్‌లోని ప్రెస్పిటేరియన్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె వ్యక్తిగత వైద్యుడు బర్డాక్ మాత్రం ఆమె పూర్తిస్థాయిలో కోలుకున్నారని, అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన ఫిట్నెస్తో ఉన్నారని చెబుతున్నారు.