మెదడులో కణుతులు
మరెక్కడైనా కణితి వస్తే దాని దుష్ర్పభావం వెనువెంటనే కనిపించకపోవచ్చు గానీ... మెదడు అతి కీలకభాగం. మన శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించే కేంద్రాలు అక్కడ ఉంటాయి. దాంతో పెరిగే కణితి... ఏ అవయవాన్నైనా నియంత్రించే మెదడులోని ఆ సెంటర్‌ను నొక్కేస్తూ ఉంటే, దాని దుష్ర్పభావం తక్షణం సదరు అవయవం కదలికలపై కనిపిస్తుంటుంది. నేడు ‘ప్రపంచ మెదడు కణుతుల దినం’ సందర్భంగా మెదడులో కణుతులు... అవి ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు, చికిత్స వంటి అనేక అంశాలను తెలుసుకుందాం.
నేడు వరల్డ్ ట్యూమర్ డే
మెదడులో కణితి అంటే...
మెదడులో అవాంఛిత కణజాలం ముద్దలా పెరుగుతూ అది గడ్డలా రూపొందితే దాన్ని మెదడు కణితి (బ్రెయిన్ ట్యూమర్) అని వ్యవహరిస్తారు. అది పెరుగుతున్న కొద్దీ మెదడులోని ఆరోగ్యకరమైన కణాలను నొక్కేస్తూ, వాటిని దెబ్బతీస్తుంది. ఈ పెరుగుతున్న కణితి ఒత్తిడి మెదడుపై పడుతున్న కొద్దీ మెదడు పక్కకు జరుగుతూ పుర్రె ఎముకను నొక్కుతుంటుంది. దాంతో ఆరోగ్యకరమైన మెదడు కణాలు, అక్కడి నరాలు పాడైపోతాయి.
కారణాలు
మెదడులో కణుతులు అభివృద్ధి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. రేడియేషన్ కిరణాలకు, కొన్ని రకాల రసాయనాలకు ఎక్స్పోజ్ కావడం మెదడు కణుతులకు ఒక కారణం. అయితే పర్యావరణానికి సంబంధించిన అంశాలకూ, మెదడు కణుతులకు సంబంధం ఉన్నట్లు ఇంకా ఇతమిత్థంగా తెలియలేదు. కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉదాహరణకు న్యూరోఫైబ్రోమటోసిస్, వాన్ హిప్పెల్ లాండువా డిజీస్ వంటివి మెదడులో కణుతులకు కారణం కావచ్చు. సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల కూడా మెదడులో కణుతులు ఏర్పడవచ్చనే వాదన ఉంది. కానీ ఇది ఇంకా శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణ కాలేదు. దీనిమీద ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
కణుతుల్లో రకాలు: మెదడులోని కణుతుల్లో ప్రైమరీ అనీ, సెకండరీ (మెటాస్టాటిక్) అని రకాలు ఉన్నాయి. మెదడులో వచ్చే కణుతుల్లో దాదాపు 60 శాతం ప్రైమరీ కణుతులే. ఇవి పూర్తిగా నిరపాయకరమైనవి. ఇక గ్లియోమా అనే రకం కణుతులు పెద్దల్లో కనిపిస్తాయి. మెడుల్లోబ్లాస్టోమా అనే రకం కణుతులు చిన్న పిల్లల్లో ఎక్కవగా ఉంటాయి. ప్రైమరీ కణుతులు మెదడులోనే ఆవిర్భవిస్తాయి. ఇవి మెదడుకే పరిమితమవుతాయి. అంతేగానీ వేరే అవయవాలకు పాకవు. ఒకవేళ పాకినా అది చాలా అరుదు.
ఇక వీటిలోనూ బినైన్ (హాని చేయనివి), క్యాన్సరస్ (కాన్సర్ కణుతులు) అనే రకాలు ఉంటాయి. అయితే బినైన్ కణుతులనూ పూర్తిగా హానిచేయనివిగానూ పరిగణించలేము. ఎందుకంటే కొన్ని బినైన్ కణుతులు క్యాన్సర్ కణుతుల కంటే కూడా ఎక్కువ హానికరమైనవి కావచ్చు. ఉదాహరణకు అవి బ్రెయిన్‌స్టెమ్ అనే కీలకమైన ప్రదేశంలో ఉండి తొలగించడానికి వీలు కాకపోతే అవి ఉన్న ప్రదేశం ఆధారంగా అవి ప్రమాదకరంగా మారవచ్చు. ఇక ఒక క్యాన్సర్ కణితి చాలా సులభంగా తొలగించగల ప్రదేశంలో ఉంటే బినైన్ కణితి కంటే కూడా క్యాన్సర్ కణితితో జరిగే హాని తక్కువ. ఎందుకంటే దీన్ని చాలా తేలిగ్గా తొలగించగలం కాబట్టి.
లక్షణాలు : మెదడులో కణుతులు ఉన్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలివే...
తలనొప్పి (సాధారణంగా ఉదయం వేళల్లో దీని తీవ్రత ఎక్కువ) వికారం లేదా వాంతులు (సాధారణంగా వీటి తీవ్రత కూడా ఉదయం వేళల్లోనే ఎక్కువ) మెదడులో కణుతులు ఉన్నాయనడానికి మంచి ఉదాహరణ ఏమిటంటే... వాంతి కాగానే తలనొప్పి తగ్గుతుంది పద్దెనిమిది ఏళ్లకు పైబడిన వారిలో మొదటిసారి కణుతుల వల్లనే ఫిట్స్ రావచ్చు మాట్లాడటంలో (ఉచ్చారణలో) ఇబ్బందులు వ్యక్తిత్వంలో మార్పులు కొన్ని శరీర భాగాలు బలహీనంగా మారడం లేదా చచ్చుబడిపోవడం (పక్షవాతంలోలా) నిటారుగా ఉండటం సాధ్యంకాకపోవడం (బ్యాలెన్స్ తప్పడం) చూపులో మార్పులు రావడం అయోమయానికి గురికావడం జ్ఞాపకశక్తిని కోల్పోవడం వినికిడి సమస్యలు రావడం మింగడంలో ఇబ్బంది వంటి అనేక లక్షణాల్లో కొన్ని కనిపించవచ్చు.
మెదడులో కణుతుల నిర్ధారణ
మెదడులో కణుతులు ఉన్నట్లుగా నిర్ధారణ చేయడం అన్నది ఒక క్రమపద్ధతిలో (స్టెప్ బై స్టెప్‌గా) జరుగుతుంది. బ్రెయిన్ స్కాన్స్, ఎమ్మారై, సీటీస్కాన్, బయాప్సీ (కణితి నుంచి ముక్క తొలగించి పరీక్షించడం) ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.
మెదడు కణుతులు తిరగబెడుతుంటాయా?
సాధారణంగా మెదడులో కణుతులను శస్త్రచికిత్స చేసి తొలగిస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో అవి చాలా అరుదుగా తిరగబెడుతుంటాయి. హానికరం కాని (బినైన్) కణుతులు తిరగబెట్టడం చాలా అరుదు. అయితే కణితి తిరగబెట్టడం అన్నది శస్త్రచికిత్స చేసే నిపుణుడి నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కణితిని ఎంత పూర్తిగా తొలగించగలిగితే అది తిరగబెట్టకుండా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కణితి మెదడులో బాగా లోతుగా ఒదిగిపోయి ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని తీయడం వల్ల మెదడులోని ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినే అవకాశం ఉంటే... అప్పుడు తొలగించగలిగేంతవరకు తొలగించి, ఆపై మిగిలిన భాగాన్ని నిర్వీర్యం చేసేందుకు రేడియేషన్ థెరపీ ఇస్తుంటారు. అయితే మెలిగ్నెంట్ (హానికరమైన క్యాన్సరస్) కణుతులు తరచూ తిరగబెడుతుంటాయి. అది హానికరమైన క్యాన్సర్ కణితి అయినా లేదా హాని చేయని బినైన్ కణితి అయినా ఒకసారి మెదడులో కణితిని తొలగించాక... తరచూ డాక్టర్ల ఫాలో అప్‌లో ఉండి, కణితి మళ్లీ పెరుగుతోందా లేదా అన్నది తరచూ పరీక్షింపజేసుకుంటూ ఉండాలి.
కణితి తొలగించాక సాధారణ జీవితం సాధ్యమేనా?
మెదడులోని కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించాక చాలా సందర్భాల్లో రోగి మునుపటిలాగానే తన సాధారణ జీవితం గడపవచ్చు. ఒకవేళ అది హానికరమైన క్యాన్సర్ గడ్డ (మెలిగ్నెంట్ ట్యూమర్) అయినా అది తేలిగ్గా తొలగించగలిగేలా ఉండి, శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగిస్తే... ఇలాంటి వారు కూడా మంచి నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే మెదడులోని కణితిని తొలగించడం అన్నది శస్త్రచికిత్స చేసేవారి నైపుణ్యం మీద ఆధారపడి ఉండటంతో పాటు అనేక విభాగాలకు చెందిన నిపుణులు ఉండే పెద్ద సెంటర్లలో చికిత్స చేయించుకోవడం మేలు.
డాక్టర్ ప్రవీణ్ అంకతి
సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్,
గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్
చికిత్స
మెదడులోని కణుతులకు శస్త్రచికిత్స ప్రధానమైన సంప్రదాయ చికిత్స. దీనితో పాటు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ కూడా సాధారణంగా ఇస్తుంటారు. కొన్నిసార్లు నిర్ధారణ జరిగిన వెంటనే చికిత్సకు సత్వరం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మెదడులో కణితి ఉన్న స్థానాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మెదడులో కణితికి చికిత్స చేయడం అనేది కేవలం ఒక రంగానికి చెందిన ఒకే డాక్టరు గాక... అనేక విభాగాలకు చెందిన డాక్టర్లు ఒక బృందంలా చేయాల్సిన చికిత్స.