వచ్చే నెలాఖరు నుంచి అదనపు బస్సు సేవలు
పింప్రి, న్యూస్‌లైన్: పుణే మహానగర్ పరీవాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎంఎల్) జనవరి ఆఖరు నాటికి నగరంలో అదనంగా మరికొన్ని బస్సులను నడపనుంది. బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా 300 కొత్త బస్సులను నడపాలని యోచిస్తోంది. కొత్త బస్సుల రాక ఆలస్యమయ్యే సూచనలు ఉండడంతో ప్రైవేటు బస్సులను బాడుగకు తీసుకొని నడపాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. పీఎంపీఎంఎల్ బస్సులు తరచూ మరమ్మతులకు గురికావడం, సాంకేతికపరమైన సమస్యలు తలెత్తి ఆగిపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అందువల్ల బాడుగకు తీసుకున్న బస్సులను డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నడుపుతామని పీఎంపీఎంఎల్ సంచాలకుడు డాక్టర్ ప్రవీణ్ అష్టికర్ పేర్కొన్నారు.
ఇదిలాఉంచితే బీఆర్టీ (బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థ) మార్గాలలో నడిపే బస్సులకు ఇరువైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు.15 ఏళ్లు పైబడిన పాత బస్సులను తుక్కు సామగ్రి కింద అమ్మివేయనున్నారు. తెలిపారు. కాగా పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ), పుణే మహానగర్ పరీవాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎంఎల్)లు సంయుక్తంగా ఇటీవల మండాయి బస్సు సేవలను ప్రారంభించాయి. అయితే మండాయి నుంచి కనీస చార్జి కింద కేవలం ఐదు రూపాయలు వసూలు చేయాలని నగర బస్సు ప్రయాణికుల సంఘం విజ్ఞప్తి చేసింది. మండాయి నుంచి పది మార్గాల్లో బస్సులు నడపాలని, మండాయి పరిసరాలలోని ఆక్రమణలను తొలగించి బస్టాపులను ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ వినపతిపత్రం సమర్పించింది. మండాయి నుంచి పది మార్గాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సును నడపాలని కోరింది.