చరిత్ర గాయాలను మాన్పుతున్న క్షణాలు!
నేడు ‘బాబాసాహెబ్’ అంబేడ్కర్ 125వ జయంతి. దళితనాయకుడిగా, ధర్మశాస్తక్రోవిదునిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక తత్వవేత్తగా స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం కూడా దేశ ప్రజల స్థితిగతులపై, దేశ రాజకీయాలపై తన సిద్ధాంతాలతో అత్యంత ప్రభావం చూపిన ఈ ప్రయోగశీలికి సాక్షి ‘ఫ్యామిలీ’ పడుతున్న అక్షర నీరాజనమిది.
డా.రాజశేఖర్ ఉండ్రు
నూట పాతికేళ్ల కాలానికి చరిత్రలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ అంబేడ్కర్ జన్మించిన తర్వాత గడిచిన ఈ 125 సంవత్సరాలు (1891-2016) దేశ చరిత్రలో దళితులకు, పీడిత జనావళి కోసం ఒక నవ యుగానికి నాంది పలికాయి. ఒక ‘అంటరాని’ మహాజాతిని మొత్తంగానే నాగరిక అణచివేత నుంచి తప్పించి కేవలం 125 ఏళ్ల కాలంలోనే నమ్మశక్యం కాని సమానతా ప్రయాణంలోకి పరివర్తింపజేసిన ఘటన.. చరిత్రలో ఏ సంస్కృతిలోనూ, ఏ నాగరికతలోనూ మనం చూసి ఉండం. ఈ నూట పాతికేళ్ల కాలం మానవ చరిత్రలో వాస్తవంగానే ఒక శకాన్ని నిర్మించిన కాలం.
అంబేడ్కర్ కొనసాగించిన 125 సంవత్సరాల పయనంలో వాస్తవానికి సగం కాలం మాత్రమే ఆయన జీవించి ఉన్నారు. ఆ జీవిత కాలంలోనూ ఆయన సాగించిన ప్రయాణం ఏమంత సులువైనదేం కాదు. తన భావాలను వ్యతిరేకించిన గాంధీతో ఆయన పోరాడాల్సి వచ్చింది. కానీ, ఈరోజు న్యాయం పట్ల అంబేడ్కర్ భావనే నిజమైన న్యాయమని అందరూ గ్రహిస్తున్నారు. జాతివివక్షత, బానిసత్వం అంటే ఏమిటో ఆయనకు కొలంబియా విశ్వవిద్యాలయం, న్యూయార్క్ 1913లో అర్థం చేయించాయి. వలసవాదం అంటే ఏమిటో లండన్ నగరం ఆయనకు నేర్పింది.
ఇకపోతే కులతత్వం, అణచివేత అంటే ఏమిటో భారత సమాజం ఆయనకు తెలియజెప్పింది. దళిత విముక్తి విషయంలో కాస్త నిదానంగా వ్యవహరించవలసిందిగా గాంధీ అంబేడ్కర్‌కు సూచించారు. మహిళా విముక్తి విషయంలో కాస్త వేచి ఉండాలని నెహ్రూ చెప్పారు. కాని అంబేడ్కర్ దృష్టిలో విముక్తి అనేది వేచి ఉండే విషయం కాదు. అందుకే ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం నేడు ప్రజలకు జీవించే హక్కును, ఆహార హక్కును, విద్యా హక్కును, పని హక్కును తదితర హక్కులను న్యాయస్థానాలు దఖలుపర్చేలా చేసింది.
అంబేడ్కర్ ఉద్యమం కారణంగానే ఆయన శతజయంతికి ముందు కొన్నేళ్ల క్రితం అంటే 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ఉనికిలోకి వచ్చింది. ఈ చట్టం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొరివి వినయ్‌కుమార్, మల్లెపల్లి లక్ష్మయ్య నాయకత్వంలో 20 సంవత్సరాల పాటు భారీ ఉద్యమానికి దారి తీసింది. ఈ చట్టం దళితులకు, గిరిజనులకు, పీడన నుంచి ఎంత స్థాయిలో ఉపశమనం కలిగించి కొత్త జీవితాన్ని ప్రసాదించిందంటే, పీడక కులాలు ఈ చట్టాన్ని ద్వేషించేవరకు వెళ్లాయి. ప్రస్తుత కేంద్రప్రభుత్వం ముందు పెండింగులో ఉన్నటువంటి ‘ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణల’ను నిజంగా తీసుకురాగలరేమో మనం వేచి చూడాల్సిందే. ఈ పాతికేళ్ల కాలంలో అంబేడ్కర్ వామపక్షాలను కూడా ప్రభావితం చేశారు. కులసమస్యపై దళితులు వామపక్షాలను ప్రశ్నించడమే కాకుండా ఆ ఉద్యమ గమనాన్ని కూడా మార్చారు.
అంబేడ్కర్ శతజయంతి తర్వాత గడచిన పాతికేళ్లలో దళితేతర విద్యాపండితులు అంబేడ్కర్‌ను చిత్తశుద్ధితో చదవడమే కాకుండా, ఆయన మేధస్సుకు, సూక్ష్మబుద్ధికి అప్రతిభులయ్యారు. ఈరోజు సామాజిక శాస్త్రాలు ఇంకేమాత్రం అంబేడ్కర్‌ను నిర్లక్ష్యం చేయలేవు. పైగా అవి ఆయనకు దాసోహమైపోయాయి. అంబేడ్కర్ సాహిత్యం నేడు ఒక ప్రమాణమై నిలిచింది. దళిత సాహిత్యం ప్రచురణా రంగంలో అత్యంత విజయవంతమైంది. అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించి 2006 నాటికి అరవై సంవత్సరాలు (1956-2006) అయింది. 2006 నుంచి అంబేద్కర్ బుద్ధిజం ఒడిదుడుకులకు లోనవుతూ ముందుకెళుతోంది. దళితులందరూ అంబేడ్కర్ బుద్ధిస్టులుగా మారడానికి ఇక అట్టే కాలం పట్టదు. అంబేడ్కర్ సర్వాంతర్యామి అని తెలంగాణ ఉద్యమం చూపింది.
చిన్న రాష్ట్రాలపై ఆయన చేసిన ప్రతిపాదనే తెలంగాణకు తాత్విక భూమిక అయింది. దీని ప్రాతిపదికనే దేశంలో చిన్న రాష్ట్రాలకోసం ఉద్యమాలు ముందుకెళుతున్నాయి. ఇక రాజకీయ రంగంలో దళిత రాజకీయాలకు మించి అంబేడ్కర్ రాజకీయాలు పెరుగుతున్నాయి. అంబేడ్కర్ సిద్ధాంతంపై ఆధారపడే కాన్షీరామ్ బహుజన సమాజ్ పార్టీ ఉత్తర ప్రదేశలో గత పాతికేళ్లలో నాలుగు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పర్చగలిగింది. దీని తర్వాత చట్టం ద్వారా బడ్జెటరీ వనరుల్లో దళితులకు భాగస్వామ్యం ఇవ్వాలని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌లో మల్లెపల్లి లక్షయ్య, ఉద్యమం నిర్వహించారు. అంబేడ్కర్ తత్వశాస్త్రం సాధించిన విజయాల్లో ఇది ఆభరణమై నిలిచింది.
ముందే చెప్పినట్లుగా చరిత్రలో 125 సంవత్సరాల కాలానికి ఏమంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు కానీ, అంబేడ్కర్ శకం కొనసాగుతున్న గడచిన నూట పాతికేళ్ల కాలం అత్యంత శక్తివంతమైన పరివర్తనా కాలం. అయితే నిజం చెప్పాలంటే ఆయన ఆశయాలు ఫలించడానికి ఇది నాంది మాత్రమే. అంబేడ్కర్ జయంతి ఘటనను అద్వితీయంగా జరుపుకుందాం. మన దేశంలో ఇప్పటికీ పట్టు దొరకకుండా జారిపోతున్న సమానత్వం కోసం వెదుకులాటలో ముందడుగు వేద్దాం.
(వ్యాసకర్త సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యకార్యదర్శి, న్యూఢిల్లీ. vundru@yahoo.com)