పల్మొనాలజీ కౌన్సెలింగ్
మావారికి ఆస్థమా ఉంది. ఇది ఉన్నవారికి నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ అని తేలింది. ఒక్కోసారి అది ప్రమాదకరం కూడా అని తెలిశాక ఆందోళనగా ఉంది. నిమోనియా నివారించడానికి జాగ్రత్తలు చెప్పండి.
- సునీత, గుంటూరు
పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి బయటి వాతావరణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.
మావారు సిగరెట్లు ఎక్కువగా తాగుతారు. దగ్గు ఎక్కువగా వస్తుంటే డాక్టర్ను కలిశాం. సీవోపీడీ అనే జబ్బు ఉందని చెప్పి మందులు ఇచ్చారు. దీన్ని ఎలా నిర్ధారణ చేశారు? నివారించుకునే అవకాశం చెప్పండి.
- శ్రీలత, విజయవాడ
సీఓపీడీని నిర్ధారణ చేయడానికి స్పైరోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని సహాయంతో కొన్ని శ్వాస పరీక్షలు చేసి వ్యాధితో పాటు... అది తక్కువ (మైల్డ్)గా ఉందా, ఓ మోస్తరా (మాడరేట్) లేక తీవ్రం (సివియర్)గా ఉందా అన్నది నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు అతడు పనిచేసే ప్రదేశం, వాతావరణం, వృత్తిగత సమస్యల (ప్రొఫెషనల్ హజార్డ్స్) వంటి అంశాల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు.
నివారణ: పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండాలి / పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం మానేయాలి. ఊపిరితిత్తుల్లోకి పొగ ప్రవేశిస్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం (కళ్లె) మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ (ప్రాణవాయువు) పాళ్లు బాగా తగ్గి, పనిచేసే శక్తిని, సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే వ్యాధి ఉన్నవారు ముందుగా పొగతాగే అలవాటుపై కష్టమైనా నియంత్రణ సాధించాలి.
డాక్టర్ రమణప్రసాద్ వి.వి.
సీనియర్ కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్