శాడిస్టు ప్రొఫెసర్
విద్యార్థులపై నిత్యం తిట్లు,హేళనలు
ఒక డెంటల్ ప్రొఫెసర్ వేధింపుల పర్వం
విజయవాడ: మేము కట్టే పన్నులతో మీరు చదువుకుంటున్నారు. నోరు మూసుకుని చెప్పినట్లు చేయండి. లేకుండా మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు అంటూ ఓ ప్రైవేటు దంత వైద్య కళాశాలలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ రిజర్వేషన్ విద్యార్థుల పట్ల నిత్యం వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
గన్నవరం సమీపంలోని ఓ ప్రైవేటు దంత వైద్య కళాశాలలో ఓరల్ సర్జరీకి చెందిన ఓ ప్రొఫెసర్ గత కొంత కాలంగా పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మా దయతో మీరు చదువుకుంటున్నారని బీసీ, ఎస్సీ ఎస్టీ విద్యార్థులను రోజూ దెప్పిపొడవడం అతనినైజం. పార్టీలు, సినిమాలు పేరుతోనూ శాడిస్టులా వేధిస్తున్నట్లు తెలిసింది.
అతని అభిమాన నటుడు సినిమా విడుదల అంటూ విద్యార్థులతో టికెట్లు తీయించి, పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తనిఖీల సమయంలో కూడా విద్యార్థులను అవహేళన చేశారని పలువురు బాధితులు తెలిపారు.
బయటకు చెప్పకోలేక ఆవేదన
ప్రాక్టికల్స్, మార్కులు ప్రొఫెసర్ల చేతిలో ఉండటంతో తమపై ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారోనని ఆందోళన చెందుతున్న బాధిత విద్యార్థులు అతని ఆగడాలపై బటయకు చెప్పుకోలేకోతున్నారు. గతంలో ఇదే కళాశాలలో ఓ ప్రొఫెసర్ ఇలానే వ్యవహరిస్తే అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం ఇతన్ని చూసీచూడనట్లు వదిలేస్తోందనే విమర్శలున్నాయి. ఒకటిరెండు సార్లు సాధారణ విచారణతో సరిపెట్టడంతో ఇతడు చెలరేగిపోతున్నాడు. అవమానభారంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని తెలిపారు.
మా దృష్టికి వచ్చాయి
ఒక ప్రొఫెసర్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ రాసిన లేఖలు మాకు అందాయి. అయితే అవి ఎవరు రాశారన్నది తేలడం లేదు. విద్యార్థులు ఎవరూ నేరుగా మాకు ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ ఈ విషయమై విచారణ జరిపించాము. యాజమాన్యం కూడా సీరియస్‌గానే ఉంది. ముందు ఎవరు లేఖలు రాస్తున్నారో తెలుసుకోవాల్సి ఉంది.
-డాక్టర్ రామోజీ, కళాశాల ప్రిన్సిపాల్