Dr. Rao ramesbabu
-
బాబుకు తరచు జ్వరం..?
పీడియాట్రీషియన్ కౌన్సెలింగ్ మా బాబుకు 6 నెలలు. వాడికి ఇటీవల రెండుసార్లు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల ఇలా తరచూ జ్వరం వస్తున్నట్లు చెప్పారు. ఇంత చిన్న పిల్లల్లోనూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? అలా రాకుండా ఉండాలంటే మేము ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? - సావిత్రి, తుని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లో కూడా చాలా సాధారణమే. చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, అనువంశీకంగా కనిపించడం, వ్యాధి నిరోధక శక్తి, మూత్రకోశానికి సంబంధించి అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలుండటం, మూత్రవిసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపల మిగిలిపోవడం, మలబద్ధకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటి అనేక కారణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. జ్వరం, తేలిగ్గా చిరాకు పడుతుండటం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను గుర్తించినప్పుడు వారిలో మూత్రకోశ వ్యవస్థకు సంబంధించి ఏదైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరి. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), మూత్రపిండాల్లో ఏవైనా తేడాలు (కిడ్నీ అబ్నార్మాలిటీస్) వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, వీసీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్దపిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలను అనుసరిస్తూ తగిన పరీక్షలు చేయించుకుని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్సను కొనసాగించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హెదరాబాద్ -
పీడియాట్రీ కౌన్సెలింగ్
మా పిల్లవాడికి 11 ఏళ్లు. ఇంకా నిద్రలో పడకపైనే మూత్రవిసర్జన అవుతోంది. ఏం చేయాలి? - సుకుమార్, నిడదవోలు పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్ అన్యురిసిస్ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే 1 శాతం మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం చూస్తుంటాం. ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ ఎస్సే చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు. ఇలాంటి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు... నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించాలి. చికిత్స: ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి ఈ పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. ఇలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ సమస్యకు హార్మోన్ లోపాలు కారణం అయితే 3-6 నెలలపాటు మందులు వాడటం వల్ల సమస్యను 50 శాతం మందిలో అదుపు చేయవచ్చు సమస్య అదుపులోకి రాకపోతే పిల్లల డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స చేయించాలి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా అమ్మాయికి ఆరేళ్లు. పాపకు మెడలో కాయలా ఒక గడ్డ కనిపిస్తోంది. ఇది కనీసం ఐదారు నెలల నుంచి ఉంది. డాక్టర్‌కు చూపించాం. ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఇటీవల అది కాస్త పెద్దదైందేమోనని అనుమానంగా ఉంది. ఈ గడ్డ ఏమిటి? ఇదేమైనా తీవ్రమైన వ్యాధికి సూచనా? - జమునారాణి, విజయవాడ మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మెడ భాగంలో గడ్డలుగా ఉన్నవి లింఫ్‌నోడ్స్ అయి ఉండవచ్చు. ఈ కండిషన్‌ను సర్వైకల్ లింఫెడినోపతి అంటారు. పిల్లల్లో మెడ భాగంలో లింఫ్ గ్రంథులు పెద్దవిగా (వివిధ సైజుల్లో) ఉండటాన్ని చాలా సాధారణంగా చూస్తుంటాం. లింఫ్‌నోడ్స్ ఇలా పెద్దవి అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సాధారణ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్తో పాటు తీవ్రమైన క్యాన్సరస్ పెరుగుదల వంటి ప్రమాదకరమైన కండిషన్స్‌కు ఇది సూచన కావచ్చు. ఇక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టీబీ లేదా టీబీ కాని బ్యాక్టీరియాలు, లింఫోమా (క్యాన్సర్) వంటి పెద్ద కారణాలతో పాటు, కొన్నిసార్లు కనెక్టివ్ టిష్యూ డిసీజ్, చెవికి ఏదైనా గాయం కావడం (చెవి కుట్టించినప్పుడు కూడా), రకరకాల గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి అతి మామూలు కారణాల వల్ల కూడా ఈ గ్లాండ్స్ పెద్దవి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్లాండ్స్ ఎంత పరిమాణంలో పెరిగాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఇలా పెరగడం అన్నది చాలా సందర్భాల్లో చాలా సాధారణమైన వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వారం నుంచి రెండు వారాల పాటు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేసి చూస్తాం. అప్పటికీ ఇవి తగ్గకుండా ఉండటంతో పాటు, వీటి పరిమాణం 2.5 సెం.మీ. కంటే పెద్దవిగా ఉంటే తప్పనిసరిగా కొన్ని రక్తపరీక్షలతో పాటు, బయాప్సీ కూడా చేయించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒకే నోడ్ పెద్దగా అయి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు కూడా బయాప్సీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీ పాప విషయంలో ఇతర లక్షణాలూ ఏమీ కనిపించడం లేదు కాబట్టి, ్ట మీరు చింతించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్లాండ్ పెరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా తదుపరి అంశాల నిర్ధారణ కోసం ఒకసారి బయాప్సీ చేయించండి. మీరు మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. మా పాపకు ఈ నెలతో ఆర్నెల్లు నిండుతాయి. పిల్లలకు ఆర్నెల్లు దాటాక ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియజేయండి. -సువర్ణ, హైదరాబాద్ చిన్నపిల్లలకు ఆర్నెల్లు దాటాక తల్లిపాలతో పాటు అన్నం, గోధుమల వంటి గింజధాన్యాలు, ఆపిల్, సపోటా వంటి పళ్లు, పప్పుధాన్యాలు, కూరలలో క్యారట్, బాగా ఉడికించిన దుంపలు వంటివి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చాక మంచినీళ్లు తాగించడం అవసరం. ఈ వయసు పిల్లలకు పళ్లను జ్యూస్ రూపంలో ఇవ్వడం సరికాదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్