పీడియాట్రీ కౌన్సెలింగ్ | Counseling pidiyatri | Sakshi
Sakshi News home page

పీడియాట్రీ కౌన్సెలింగ్

Published Fri, Jun 12 2015 10:53 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

Counseling pidiyatri

మా పిల్లవాడికి 11 ఏళ్లు. ఇంకా నిద్రలో పడకపైనే మూత్రవిసర్జన అవుతోంది. ఏం చేయాలి?
 - సుకుమార్, నిడదవోలు


 పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్ అన్యురిసిస్ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే 1 శాతం మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం చూస్తుంటాం.

ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్ అబ్‌నార్మాలిటీస్ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు.  పిల్లల్లో ఈ సమస్య ఉంటే  మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ ఎస్సే చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు. ఇలాంటి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...   నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు  సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం  పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించాలి.

 చికిత్స: ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి  ఈ పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. ఇలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది  ఈ సమస్యకు హార్మోన్ లోపాలు కారణం అయితే  3-6 నెలలపాటు మందులు వాడటం వల్ల సమస్యను 50 శాతం మందిలో  అదుపు చేయవచ్చు  సమస్య అదుపులోకి రాకపోతే పిల్లల డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స చేయించాలి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
 సీనియర్ పీడియాట్రీషియన్
 స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement