పీడియాట్రీషియన్ కౌన్సెలింగ్
మా బాబుకు 6 నెలలు. వాడికి ఇటీవల రెండుసార్లు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల ఇలా తరచూ జ్వరం వస్తున్నట్లు చెప్పారు. ఇంత చిన్న పిల్లల్లోనూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? అలా రాకుండా ఉండాలంటే మేము ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సావిత్రి, తుని
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లో కూడా చాలా సాధారణమే. చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, అనువంశీకంగా కనిపించడం, వ్యాధి నిరోధక శక్తి, మూత్రకోశానికి సంబంధించి అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలుండటం, మూత్రవిసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపల మిగిలిపోవడం, మలబద్ధకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటి అనేక కారణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
జ్వరం, తేలిగ్గా చిరాకు పడుతుండటం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు.
పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను గుర్తించినప్పుడు వారిలో మూత్రకోశ వ్యవస్థకు సంబంధించి ఏదైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరి. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), మూత్రపిండాల్లో ఏవైనా తేడాలు (కిడ్నీ అబ్‌నార్మాలిటీస్) వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, వీసీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్దపిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేయడం అవసరం.
మీరు పైన పేర్కొన్న విషయాలను అనుసరిస్తూ తగిన పరీక్షలు చేయించుకుని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్సను కొనసాగించండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హెదరాబాద్
బాబుకు తరచు జ్వరం..?
Published Sun, Jul 26 2015 11:19 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
Advertisement