విశ్వాసమే కీలకం
సాక్షి, హైదరాబాద్: ‘రోగులు వైద్యులను దేవుడిలా భావిస్తారు. అలాం టి వైద్యుడిపై ప్రస్తుతం రోగుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. జబ్బును ముందే గుర్తించి హెచ్చరించినా లెక్కచేయడం లేదు. తమ నుంచి డబ్బులు గుంజేందుకే లేని రోగాన్ని ఉన్నట్లు చెప్పి భయపెడుతున్నారని భావిస్తున్నారు. వైద్యుల పట్ల నమ్మ కం లేకపోవడం వల్ల వారికంటే ఎక్కువగా నష్టపోయేది రోగులేనన్న విషయాన్ని గుర్తించాలి’ అని పలు వురు ప్రముఖ వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. రోజు వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ‘నాట్ జస్ట్ మెడ్స్–లెట్స్ టాక్ బియాండ్ మెడిసిన్’ అనే అంశం పై ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హోటల్లో జరిగిన సదస్సులో అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని, కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు, సన్‌షైన్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి, స్టార్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గోపిచంద్ మన్నం, డాక్టర్ అమిత్వారే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోగుల్లో తమపై నమ్మకం సడలకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులదని అన్నారు. మరోవైపు వృత్తిపరంగా చోటు చేసుకుంటున్న సాంకేతిక మార్పులు, చట్టాలు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మెడికల్ కాలేజీ నుంచి బయటకొచ్చి వైద్యుడిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత అనేక అంశాలు సవాల్‌గా మారుతాయని, వృత్తిపరమైన అంశాలే కాదు, ఆర్థిక, సామాజిక అంశాలు, కుటుంబ పరమైన సమస్యలు తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తుంటాయన్నారు. వీటిని తట్టుకోలేక అనేక మంది యువ వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
చేస్తే ఒక సమస్య.. చేయకపోతే మరో సమస్య
వైద్య పరీక్షలు చేస్తే ఎందుకు చేశారని, చేయకపోతే వ్యాధినెలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు. రోగికి ఏదైనా జరిగితే.. వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. నిజం చెప్పినా నమ్మని దుస్థితి. ఇది వైద్యుల కంటే రోగులకే నష్టం తెచ్చిపెడుతుంది.
–డాక్టర్ సోమరాజు
మధ్యవర్తుల జోక్యం వల్లే..
వైద్యసేవల్లో రాజకీయ నాయకులు, ఇతరుల జోక్యం పెరిగింది. బాధితుల కంటే ఎక్కువ వీరే హల్చల్ చేస్తున్నారు. బెదిరింపులకు, దూషణలకు పాల్పడుతున్నారు. ఈ మార్పు రోగులకు, వైద్యులకు మధ్య కొంత గ్యాప్‌ను పెంచింది. ఇది మంచిది కాదు. వైద్యులపై నమ్మకం ఉంచాలి.
–డాక్టర్ ఏవీ గురువారెడ్డి
ఒత్తిడి వల్లే వైద్యులు చనిపోతున్నారు
ఇతరులతో పోలిస్తే వైద్యులు ఐదు నుంచి పదేళ్లు తక్కువ జీవిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని కూడా నష్టపోతున్నారు. వృత్తిపరమైన సమస్యలతో అనేకమంది వైద్యులు ఒత్తిడికి గురవుతున్నారు. వృత్తిపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను తట్టుకోలేక దేశవ్యాప్తంగా ఏటా 2,500 మంది వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
–డాక్టర్ హరిప్రసాద్, అపోలో ఆస్పత్రి