క్యాన్సర్‌ను నయం చేయడం సులువే
కేర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు
సాక్షి, హైదరాబాద్: గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడం కంటే కూడా క్యాన్సర్‌ను నయం చేయడం సులువని కేర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి.సోమరాజు స్పష్టం చేశారు. తక్కువ కోతల శస్త్రచికిత్స, కీమోథెరపీ మందులు, రేడియో థెరపి వంటి అధునాతన చికిత్స ద్వారా క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు. ‘లైఫ్ బియాండ్ ఫియర్’ నినాదంతో క్యాన్సర్‌పై కేర్ ఆసుపత్రి ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. చికిత్స ద్వారా బతికి బయటపడిన రోగులతో ముఖాముఖి నిర్వహించింది.
ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో సోమరాజు మాట్లాడారు. వచ్చే పదీ పదిహేనేళ్లలో ప్రతీ ముగ్గురు పురుషుల్లో ఒకరికి, ఐదుగురు మహిళల్లో ఒకరికి క్యాన్సర్ సోకే ప్రమాదముందన్నారు. కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్, బోన్‌మారో ట్రాన్స్‌ఫ్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ సొనాలి సదవర్తె మాట్లాడుతూ క్యాన్సర్ అంటే భయం అవసరం లేదని.. అనేకమంది చికిత్స చేయించుకొని సాధారణ జీవితం గడుపుతున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో కేర్ సీనియర్ మేనేజర్ ఎం.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.