‘సహకారం’తో సామాజిక ప్రయోజనం
క్రమబద్ధమైన మార్కెట్లు, గ్రేడింగ్, ప్రామాణీకరణ, సరైన తూనికలు,కొలతలు, గిడ్డంగులు, నిల్వ సౌకర్యాలు, మార్కెట్ సమాచారం లభ్యత,సేకరణ, మద్దతు ధరల నిర్ణయం, మార్కెటింగ్ పర్యవేక్షణ డెరైక్టరేట్ ఏర్పాటు లాంటి ప్రభుత్వ చర్యలు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపర్చడానికి దోహదపడుతున్నాయి. పెద్ద రైతులకు విక్రయించిన తర్వాత మిగులు అధికంగా ఉంటోంది. ప్రభుత్వ చర్యల కారణంగా వీరే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు తమ ఉత్పత్తిలో అధిక భాగాన్ని పరపతి అవసరాల కోసం ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లకు విక్రయిస్తున్నారని అనేక అనుభవ పూర్వక ఆధారాలు తెలియజేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందే క్రమంలో సహకార మార్కెటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు సహకార ప్రాతిపదికపై మార్కెటింగ్ సంఘాలుగా ఏర్పడి వస్తువులను విక్రయించుకునే
విధానమే సహకార మార్కెటింగ్.
సహకార మార్కెటింగ్
భారత్‌లో సహకార మార్కెటింగ్ వ్యవస్థ రెండు రకాలుగా ఉంది. మొదటి రకంలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ రెండంచెల్లో ఉంది. దీనిలో భాగంగా కిందిస్థాయిలో ప్రాథమిక సంఘాలు, అత్యున్నత స్థాయిలో రాష్ట్ర సొసైటీ ఉంటాయి. రెండో రకంలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ మూడంచెలుగా ఉంటుంది.
ఈ విధానంలో.. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక సంఘాలు, జిల్లా స్థాయిలో కేంద్ర మార్కెటింగ్ సంఘాలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార సంఘం ఉంటాయి. ఆల్ - ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ సిఫారసుల ఆధారంగా రెండో పంచవర్ష ప్రణాళికలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు. వీటిని మూడో ప్రణాళికలో విస్తరించారు. ప్రస్తుతం సహకార మార్కెటింగ్ వ్యవస్థలో భాగంగా మండి స్థాయిలో 2633 సాధారణ అవసరాలకు సంబంధించిన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘాలు, నూనె గింజలకు సంబంధించి 3290 ప్రత్యేక ప్రాథమిక మార్కెటింగ్ సంఘాలు, 172 జిల్లా లేదా కేంద్ర మార్కెటింగ్ సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
జాతీయ స్థాయిలో సహకార మార్కెటింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థగా ‘నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటీవ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ూఅఊఉఈ)’ను ఏర్పాటు చేశారు. సేకరణ, పంపిణీ, ఎంపిక చేసిన వ్యవసాయ వస్తువుల ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను ‘నాఫెడ్’ నిర్వహిస్తోంది. ఇది ప్రభుత్వానికి కేంద్ర నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ త్వరగా పాడవని పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర ఉత్పత్తులకు సంబంధించి మద్దతు ధర కార్యకలాపాలను నిర్వహిస్తోంది. త్వరితంగా కుళ్లిపోయే బంగాళాదుంప, ఉల్లిపాయలు, ద్రాక్ష, ఆరెంజ్, గుడ్లు, ఆపిల్స్, మిరపకాయలు, బ్లాక్ పెప్పర్ లాంటి విషయంలో మార్కెట్ జోక్యాన్ని చేపడుతుంది.
సహకార వ్యవస్థ ద్వారా మార్కెటింగ్ చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. కానీ సహకార మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో ఒకేవిధంగా లేదు. అనేక రాష్ట్రాల్లో సహకార మార్కెటింగ్ సంఘాల ఆర్థిక ప్రగతి సంతృప్తికరంగా లేకపోవడం వల్ల ఇవి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
ఆహార ప్రాసెసింగ్:
ప్రపంచంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తుల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం పండ్ల ఉత్పత్తిలో భారత్ వాటా 10% కాగా, కూరగాయల ఉత్పత్తిలో 13%. నేషనల్ హార్టికల్చర్ బోర్డ గణాంకాల ప్రకారం 2012-13లో భారత్‌లో పండ్ల ఉత్పత్తి 81.285 మిలియన్ మెట్రిక్ టన్నులు, కూరగాయల ఉత్పత్తి 162.19 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది.
పండ్ల ఉత్పత్తి విస్తీర్ణం 6.98 మిలియన్ హెక్టార్లు, కూరగాయల ఉత్పత్తి విస్తీర్ణం 9.21 మిలియన్ హెక్టార్లు. 2013-14లో పండ్లు, కూరగాయల ఎగుమతుల విలువ రూ. 8760.96 కోట్లకు చేరుకుంది. దేశంలోని మొత్తం పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 35% వృథా కావడానికి అవస్థాపనా సౌకర్యాలైన శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, రిఫ్రిజిరేటేడ్ ట్రక్ల కొరత లాంటివి కారణమవుతున్నాయి.
దేశంలో ఇటీవల ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధి ప్రాధాన్యం పెరిగింది. భారత్‌లో సహకార సంఘాల్లా ఏ ఇతర రంగం కూడా రైతులకు చేరువ కాలేదు. ఈ నేపథ్యంలో ఆహార ప్రాసెసింగ్ విషయంలో సహకార సంఘాలు దృష్టి సారించడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. సహకార సంఘాలు గిడ్డంగి వసతి, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, త్వరగా పాడయ్యే వస్తువుల రవాణా కోసం రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను సమకూర్చుకోవాలి.
సహకార సంఘాలు - సామాజిక ప్రయోజనం
1. సహకార సంఘాల ఉత్పత్తులకు సంబంధించి కామన్బ్రాండ్లను అభివృద్ధి చేసి వాటిని వినియోగదారులకు చేరువ చేయడం ద్వారా సమాజానికంతటికీ ప్రయోజనం కలుగుతుంది. సహకార సంఘం సభ్యులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా వారి ఆదాయస్థాయి పెరుగుతుంది.
ఉదా: ప్రాసెసింగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే ఆయా ప్లాంట్లలో సహకార సంఘ సభ్యులకు ప్రత్యక్షంగా, ప్రాసెస్డ్ ఫుడ్ (్కటౌఛ్ఛిటట ఊౌౌఛీ) తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకులను సరఫరా చేసే రైతులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
2. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సహకార సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్లో ధరల స్థిరీకరణకు సహకార సంఘాల ఉత్పత్తులు దోహదపడుతున్నాయి. ప్రైవేట్ డెయిరీలు పాల ప్యాకెట్ల సరఫరా విషయంలో సహకార డెయిరీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందువల్ల ధరలు కొంతమేర నియంత్రణలో ఉంటున్నాయి.
3. వ్యవసాయ ఆధారిత సహకార సంఘాలు వాటి ఉత్పత్తుల మార్కెటింగ్‌లో విజయవంతమైతే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఫార్మింగ్ కో-ఆపరేటివ్స, సర్వీస్ సొసైటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఫెర్టిలైజర్ కో-ఆపరేటివ్స, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ పనిముట్ల తయారీ యూనిట్లు మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తులు, ఉపాధి పెంపుదలలో ప్రధాన భూమిక పోషిస్తాయి.
4. స్వదేశీ మార్కెట్లో సహకార ఉత్పత్తుల కామన్బ్రాండ్లు అభివృద్ధి చెందితే ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం పెరిగి విదేశీ వాణిజ్యం వృద్ధి చెందుతుంది. భారత్‌లోని డెయిరీ, టెక్స్టైల్స్, తోలు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఉత్పత్తులకు సంబంధించి మొదటగా స్వదేశీ డిమాండ్ పెరుగుదలపై సహకార సంఘాలు దృష్టి సారించాలి.
5. సహకార సంఘాల అభివృద్ధి ద్వారా పటిష్టమైన, విలువ ఆధారిత సమాజం రూపుదిద్దుకుంటుంది. తద్వారా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో సాధికారత సాధించవచ్చు.
6. {పజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తగిన సేవలు అందించడంలో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బియ్యం, గోధుమ, పంచదార, గోధుమ పిండి, కిరోసిన్‌ను సబ్సిడీ ధర వద్ద పంపిణీ చేయగలుగుతాయి. ప్రభుత్వ ఉచిత పంపిణీ పథకమైన చేనేత వస్త్రాల (చీరలు, దోవతిలు) పంపిణీని సహకార సంఘాల ద్వారా చేపడుతున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. 1915లో తొలి సహకార మార్కెటింగ్ సంఘాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1) ఆంధ్రప్రదేశ్ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) పంజాబ్
2. గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను ప్రైవేట్ వ్యాపారుల నుంచి రక్షించడానికి ఏర్పాటైన సంస్థ?
1) ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
2) ఐఎఫ్ఎఫ్సీవో
3) ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
4) ఏదీకాదు
3. కేంద్ర గిడ్డంగుల సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1957 2) 1963 3) 1964 4) 1969
4. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) హైదరాబాద్ 2) కోల్‌కతా
3) న్యూఢిల్లీ 4) ముంబయి
5. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ?
1) రంగరాజన్ కమిటీ
2) వై.కె. అలఘ్ కమిటీ
3) పద్మనాభయ్య కమిటీ
4) వై.వి. రెడ్డి కమిటీ
6. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1961 2) 1962 3) 1963 4) 1964
సమాధానాలు:
1) 2 2) 3 3) 1 4) 4
5) 2 6) 3.
సహకార మార్కెటింగ్ ప్రయోజనాలు:
1. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అంతిమ కొనుగోలుదార్లతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి.
2. రైతులకు తమ ఉత్పత్తుల విక్రయంలో బేరమాడే శక్తి పెరుగుతుంది.
3. సహకార మార్కెటింగ్ సంఘాల నుంచి రైతులు తగినంత పరపతి పొందగలుగుతారు. తద్వారా గిట్టుబాటు ధరలు లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించకుండా వేచి ఉండవచ్చు. ఫలితంగా వారికి లభించే ప్రతిఫలాల్లో పెరుగుదల ఉంటుంది.
4. సహకార మార్కెటింగ్ సంఘాలకు సొంత రవాణా సాధనాలు ఉండటం వల్ల రవాణా వ్యయంలో తగ్గుదల ఏర్పడుతుంది.
5. సహకార సంఘాలు గిడ్డంగి సౌకర్యాలను కల్పిస్తున్నందు వల్ల గిట్టుబాటు ధర లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు.
6. {శేణీకరణ, ప్రామాణీకరణ ఉంటుంది.
7. మార్కెట్ ధరలు, డిమాండ్, సప్లయ్, ఇతర మార్కెట్ సమాచారం ఎప్పటికప్పుడు సహకార సంఘాలకు లభిస్తుండటం వల్ల తదనుగుణంగా తగిన ప్రణాళికలను రూపొందించుకోవచ్చు.
8. సహకార మార్కెటింగ్ సంఘాలు ఉత్పాదితాలైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, వినియోగ వస్తువులను అధిక పరిమాణంలో తక్కువ ధరలకే కొనుగోలు చేసి సభ్యుల మధ్య పంపిణీ చేసుకోగలుగుతారు.
9. సహకార మార్కెటింగ్ సంఘాలు ప్రాసెసింగ్ కార్యకలాపాలను చేపట్టవచ్చు.
10. రైతుల్లో ఆత్మవిశ్వాసం, సమష్టి కృషికి సంబంధించిన అవగాహన వల్ల వ్యవసాయాభివృద్ధి సాధించవచ్చు.
11. సమగ్రమైన ప్రణాళికల ద్వారా పంటల తీరులో మార్పు చేపట్టవచ్చు.
12. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి విక్రయం అయిన మిగులులో పెరుగుదల ద్వారా ద్రవ్యోల్బణ పరిస్థితులను అరికట్టవచ్చు.
13. సహకార సంఘాలు చట్టబద్ధంగా గుర్తింపు పొందిన సంస్థలు. వీటికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది.
డాక్టర్ తమ్మా కోటిరెడ్డి
ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్