Dr. vishes
-
పనికిరాని మొక్క!
ఆత్మబంధువు ఆనంద్ ఆఫీసుకు, పిల్లలు స్కూల్‌కు వెళ్లిపోయాక రేఖ వంటపనిలో మునిగి పోయింది. ఇంతలో డోర్‌బెల్ మోగింది. ఈ టైమ్‌లో ఎవరా అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. పక్కింటి మాధవి. ‘‘రండి ఆంటీ’’ అంటూ లోపలికి ఆహ్వానించింది రేఖ. ఈ టైమ్‌లో వచ్చా రేమిటా అనుకుంటూనే కాఫీ తెచ్చిచ్చింది. కాసేపు అదీ ఇదీ మాట్లాడుకున్న తర్వాత మాధవి అసలు విషయానికి వచ్చింది. ‘‘రేఖా.. మా అబ్బాయి రాము ఈ మధ్యే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. వస్తుందన్న నమ్మకమూ లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వేదైనా సలహా చెప్తావేమోనని వచ్చా’’ అంది మాధవి. ‘‘అసలిప్పుడేం చేస్తున్నాడు ఆంటీ?’’ ‘‘ఏం చేస్తున్నాడో చెప్పడు. కానీ ఎప్పుడూ ఊళ్లు పట్టుకు తిరుగు తుంటాడు. వాడెందుకూ పనికి రాకుండా పోతాడేమోనని భయమేస్తోంది.’’ మాధవి వాళ్లది పక్కిల్లే. వాళ్లింట్లో మాట్లాడుకునే మాటల్లో కొన్ని రేఖకు వినిపిస్తూనే ఉంటాయి. రామూని నిత్యం పనికిరాని వాడని తిట్టడం రోజూ ఆమె చెవిన పడుతూనే ఉంటుంది. అలా అనకూడదని చెప్పాలని చాలాసార్లు అనుకుంది, కానీ చెప్పలేకపోయింది. ఇప్పుడు సమయం, సందర్భం వచ్చాయి. ‘‘ఆంటీ... నేను మీకో కథ చెప్తాను, వింటారా?’’ అని అడిగింది. నేను సలహా కోసం వస్తే ఈ పిల్లేంటీ కథలంటోంది అనుకుంటూనే... ‘‘చెప్పు రేఖా’’ అంది మాధవి. ‘‘పూర్వం జీవకుడు అనే వ్యక్తి ఆయుర్వేదం నేర్చుకోవాలని ఓ గురువు దగ్గర చేరాడు. ఏళ్ల తరబడి శిష్యరికం చేశాడు. విద్య పూర్తయి వెళ్లిపోయే రోజు వచ్చింది. గురువుగారు జీవకుడ్ని పిలిచి ‘నీ విద్యాభ్యాసం పూర్తయింది. చివరగా ఒక పరీక్ష పెడతాను. ఉత్తీర్ణుడవైతే నువ్వు సొంతగా వైద్యం ప్రారంభించవచ్చు’ అని చెప్పాడు. ఆజ్ఞాపించమన్నాడు జీవకుడు. తాముంటున్న అరణ్యంలో వైద్యానికి పనికి రాని మొక్క ఏదైనా తీసుకువస్తే పరీక్షలో ఉత్తీర్ణుడైనట్లేనన్నాడు గురువు. చిటికెలో తీసుకొస్తానంటూ జీవకుడు అరణ్యంలోకి వెళ్లాడు. సూర్యాస్తమయం అవుతోంది, జీవకుడు రాలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. జీవకుని జాడ లేదు. దాదాపు ఏడాది తర్వాత మీసాలు, గడ్డాలతో తిరిగి వచ్చాడు. ‘గురుదేవా... వైద్యానికి పనికిరాని మొక్క కోసం ఏడాది పాటు అరణ్యమంతా అన్వేషించాను. ఒక్కటీ కానరాలేదు. నేను వైద్యుడిగా పనికిరానా గురుదేవా?’ అంటూ రోదించాడు. అప్పుడు గురువు... ‘భూమి మీద కనపడే ప్రతి మొక్కా వైద్యానికి ఉప యోగపడేదే. ఆ విషయం తెలుసుకోవడం తోనే నువ్వు ఉత్తీర్ణుడివయ్యావు’ అన్నాడు. ‘‘అంటే... ప్రపంచంలోని మొక్కలన్నీ వైద్యానికి పనికొస్తాయా రేఖా?’’ ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ‘‘అవునాంటీ... ప్రతి మొక్కా ఏదో విధంగా వైద్యానికి పనికొస్తుంది. అలాగే ప్రపంచంలోని మనుషులందరూ ఏదో ఒక రకంగా సమాజానికి పనికొస్తారు. పనికి మాలిన మొక్కలు, పనికిమాలిన మనుషు లంటూ ఎవ్వరూ ఉండరు’’ చెప్పింది రేఖ. రేఖ ఆ మాట ఎందుకు చెప్పిందో మాధవికి అర్థమైంది. ‘‘నువ్వు చెప్పింది నిజం కావొచ్చు రేఖా. కానీ మా వాడి విషయం వేరు. నిజంగానే వాడెందుకూ పనికి రాకుండా పోతున్నాడనే మా బాధంతా’’ అంది బాధగా. ‘‘రామూకేం తక్కువాంటీ! మంచి కుర్రాడు, బాగా మాట్లాడతాడు, పాటలు పాడతాడు, పదిమందినీ చక్కగా ముందుకు నడిపించగలడు.’’ ‘‘అదేనమ్మా అసలు సమస్య. అన్నీ చేస్తాడు, ఉద్యోగం తప్ప. అదే చాలా గొడవగా ఉంది ఇంట్లో.’’ ‘‘ఉద్యోగం అంటే ఏంటి ఆంటీ?’’ ‘‘అదేంటి రేఖా అలా అడిగావ్? అందరూ చేసేదే. ఏదో ఒక ఆఫీసులో చక్కగా ఉద్యోగం చేసుకుంటే ఎంత బావుంటుందీ.’’ ‘‘ఆంటీ... రామూ నైన్ టూ ఫైవ్ జాబ్ చేయాలని మీరు చూస్తున్నారను కుంటా. కానీ నేను అబ్జర్వ్ చేసిన మేరకు, నాకు తెలిసినంత వరకు అతను అలాంటి జాబ్ చేయలేడు. మీరు బలవంతంగా చేర్పించినా అక్కడ ఇమడలేడు.’’ ‘‘మరెలా రేఖా?’’ ‘‘మీరు 7/జి బృందావన్ కాలనీ సినిమా చూశారా? అందులో హీరో ఎందుకూ పనికిరాని వాడని అందరూ తిడుతుంటారు. హీరోయిన్ కూడా తిట్టేస్తుంది. కానీ బైక్ మెకానిజంలో అతనో జీనియస్ అని చివరకు గుర్తిస్తుంది. అలాగే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆంటీ. దాన్ని గుర్తించి ప్రోత్సహించాలంతే!’’ రేఖ చెప్పింది మాధవికి అర్థమైంది. తన కొడుకు విషయంలో తర్వాత తానేం చేయాలో ఆలోచిస్తూ వెళ్లిపోయింది. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
కాఫీనా? క్యారెట్టా?
‘‘అక్కా...’’ ఫోన్లో ఏడుస్తోంది ఉష. ‘‘ఏంట్రా.. ఏమైంది?’’ అడిగింది రేఖ. ‘‘కిరణ్ ఏమీ మారలేదు.’’ ‘‘మొన్ననే కదా నేనొచ్చి మాట్లాడా. మారతాడ్లే. కాస్త ఓపిక పట్టు.’’ ‘‘నావల్లకాదు. పొద్దున లేచిన దగ్గర్నుంచీ మొబైల్‌తో కాపురం చేసేవాడికి నేనెందుకూ?’’ ‘‘అరె.. అతనేదో మొబైల్లో బుక్స్ చదువుకుంటున్నా అనుమానిస్తావేం?’’ ‘‘ఏమో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు?’’ ‘‘నువ్వు ఇప్పటికే ఒకటికి రెండుసార్లు చెక్ చేశావుగా.. ఏం చేస్తున్నాడోనని.’’ ‘‘ఏమో... ఇంట్లో ఏమీ తెలియలేదు. ఆఫీసులో ఏం చేస్తున్నాడో ఏమో!’’ ‘‘ఏయ్ మొద్దూ... కిరణ్ అలాంటి వాడేం కాదులే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు.’’ ‘‘నీకేం.. బావగారు పువ్వుల్లో పెట్టు కుని చూసుకుంటారు కాబట్టి ఎన్ని మాట లైనా చెప్తావ్. పడే వాళ్లకు తెలుస్తుంది ఆ బాధేంటో...‘‘ నిష్టూరమాడింది ఉష. ఇప్పుడేం చెప్పినా వినే మూడ్‌లో లేదని అర్థమైంది రేఖకు. ‘‘సరే... ఇక్కడకు రా. నాల్రోజులు ఉండి వెళ్దువుగాని’’ అని చెప్పింది. సరేనని ఫోన్ పెట్టేసింది ఉష. మర్నాడు ఉదయానికంతా ఉష అక్క ఇంటికి వచ్చేసింది. ‘‘హేయ్ ఉషా... ఏంటీ సర్ప్రైజ్ విజిట్?’’ అని పలకరించాడు బావ ఆనంద్. ‘‘అక్కనూ పిల్లల్నీ చూడాలనిపించి వచ్చాను బావా’’ అంది. ‘‘ఓకే.. ఓకే.. ఎంజాయ్. లోపలున్నారు చూడు.’’ ఉష లోపలకు వెళ్లి అక్కను పలక రించి, పిల్లలతో కాస్సేపు మాట్లాడింది. ఆనంద్, పిల్లలు స్కూల్‌కి వెళ్లాక అక్కా చెల్లెళ్లు కూర్చున్నారు తాపీగా. భార్యా భర్తల మధ్య అభిప్రాయభేదాలు, చిన్న చిన్న గొడవలూ సాధరణమేనని నచ్చ జెప్పేందుకు రేఖ ఎంత ప్రయత్నించినా వినడం లేదు ఉష. మాటలతో చెప్తే తనకు అర్థం కాదని అర్థమైంది రేఖకు. అందుకే వంటింట్లోకి తీసుకెళ్లింది. రెండు గిన్నెల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టింది. నీళ్లు బాగా మరిగాక ఒక గిన్నెలో గుడ్లు, క్యారట్లు... మరో గిన్నెల్లో కాఫీ గింజలు వేసింది. ‘‘గుడ్లు, క్యారెట్లు కలిపి వండుతావా ఏంటక్కా?’’.. ఆశ్చర్యంగా అడిగింది ఉష. అవునని తలూపింది రేఖ. ‘‘అవునా? కోడిగుడ్లు, క్యారెట్లు కలిపి వండుతారని నాకు ఇప్పటివరకూ తెలియదు.’’ ‘‘ఇప్పుడు తెలిసిందిగా. ఎలా చేస్తానో చూడు.’’ ఆసక్తిగా చూస్తోంది ఉష. బాగా ఉడికాక స్టవ్ ఆపేసి, ఓ ప్లేటులో క్యార ట్, కోడిగుడ్డు పెట్టి... ‘‘ఆ క్యారెట్ ఎలా ఉందో చూడవే’’ అంది. ‘‘మెత్తగా ఉందక్కా.’’ ‘‘మరి గుడ్డు?’’ ‘‘గట్టిగా ఉంది.’’ ‘‘సరే... ఈ కాఫీ ఎలా ఉందో చెప్పు’’ అంటూ మరగబెట్టిన డికాషన్‌తో కాఫీ కలిపి ఇచ్చింది. ‘‘సూపర్‌గా ఉందక్కా.’’ ‘‘నువ్వు క్యారట్లా ఉంటావా? కోడి గుడ్డులా ఉంటావా? లేదంటే కాఫీలా ఉండాలనుకుంటున్నావా?’’ అడిగింది చెల్లెలి ముఖంలోకి చూస్తూ. అర్థం కాలేదు ఉషకి. అయోమయంగా ఫేస్ పెట్టింది. ‘‘నీకు అర్థం కాలేదు కదా. సరే... మామూలుగా క్యారెట్, గుడ్డు, కాఫీ గింజలు ఎలా ఉంటాయ్?’’ ‘‘క్యారట్, కాఫీ గింజలు గట్టిగా ఉంటాయి. గుడ్లు డెలికేట్‌గా ఉంటాయి.’’ ‘‘కదా... మరిగే నీళ్లలో వేసి ఉడకబెట్టాక?’’ ‘‘క్యారెట్ మెత్తగా అవుతుంది. గుడ్లు గట్టిగా మారతాయి. కాఫీగింజలు కూడా కాస్త మెత్తబడతాయి.’’ ‘‘కరెక్ట్. చూడూ... మరిగే నీళ్లు మన లైఫ్‌లో వచ్చే సమస్యల్లాంటివి. అందరికీ ఎప్పుడో ఒకసారి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటికి ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతారు’’ అని చెల్లెలి వైపు చూసింది. ఆమె శ్రద్ధగా వింటోంది. దాంతో హుషారుగా చెప్పసాగింది. ‘‘కొందరు మొదట్లో క్యారట్లా గట్టిగా ధైర్యంగా ఉంటారు. కానీ సమస్యలు తట్టుకోలేక మెత్తబడతారు. కొందరు గుడ్డులా సున్నితమైన మనసుతో ఉంటారు. కానీ సమస్యలతో మనసును రాయిలా మార్చుకుంటారు. మరికొందరు కాఫీ గింజల్లా తెలివిగా ఉంటారు. తమ సమయస్ఫూర్తితో చుట్టూ ఉన్న సమస్యలను కూడా సువాసనాభరితంగా, అంటే తమకు నచ్చేలా, సంతోషాన్ని ఇచ్చేలా మార్చేస్తారు. అర్థమైందా?’’ ‘‘హా... అర్థమైందక్కా.’’ ‘‘ఇప్పుడు చెప్పు... నువ్వెలా ఉన్నావ్? ఎలా ఉండాలను కుంటున్నావ్?’’ ‘‘ఇప్పుడు నేను ఎగ్లా ఉన్నాను. కానీ భవిష్యత్తులో కాఫీ గింజల మాదిరిగా ఉండాలనుకుంటున్నాను .’’ ‘‘దట్స్ గుడ్. ఆల్ ద బెస్ట్’’ అంటూ ప్రేమగా చెల్లెల్ని హగ్ చేసుకుంది రేఖ. - డాక్టర్ విశేష్ కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మా మిక్కీ మౌస్ అత్తగారు...
ఆత్మబంధువు ‘‘భవానీ... భవానీ... కాఫీ కావాలని చెప్పి ఎంతసేపైంది?’’ అరిచింది రత్నమాంబ. ‘‘తెస్తున్నా అత్తమ్మా.’’ ‘‘తెస్తున్నా, తెస్తున్నా... అని అరగంట నుంచి చెప్తున్నావ్... తెచ్చిస్తే కదా!’’ ‘‘ఇదిగోండి అత్తమ్మా కాఫీ. ఐదు నిమిషాల్లో తెచ్చేశా.’’ ‘‘అంటే... అరగంటని నేను అబద్ధం చెప్తున్నానా?’’ ‘‘అయ్యో... నేనలా అన్లేదు అత్తమ్మా’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘ఏంటే నవ్వుతున్నావ్. అంత ఎగ తాళిగా ఉందా?’’ అరిచింది రత్నమాంబ. ‘‘అదేంటత్తమ్మా... మిమ్మల్ని అలా ఎందుకనుకుంటాను!’’ ‘‘మరెందుకే నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నావ్?’’ ‘‘అలాంటిదేంలేదత్తమ్మా’’ అని ముసిముసిగా నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్లింది భవాని. ‘‘భవానీ... ఏంటిది ఇల్లు ఇలా ఉంది? నీపాటికి నువ్వు నీటుగా రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్తే సరిపోతుందా? ఇల్లెలా ఉందో చూసుకునే పన్లేదా?’’... అరిచింది రత్నమాంబ. ‘‘పొద్దున్నే ఇల్లు సర్దాకే మిగతా పనులు చేశానత్తమ్మా.’’ ‘‘అంటే... నువ్వు ఇల్లు సర్దినా సర్దలేదని నేనంటున్నానా?’’ అని రాగం తీసింది రత్నమాంబ. ఇక ఆవిడతో మాట్లాడటం అనవసరమని ఆఫీసుకు వెళ్లిపోయింది భవాని. ఇవి మచ్చుకు రెండు సంఘటనలు మాత్రమే. కానీ ఈ ఆర్నెల్లలో ఇలాంటివి ఎన్నో. రత్నమాంబకు ఇద్దరు కుమారులు... రమేష్, సురేష్. రమేష్‌కు ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లి చేసింది. సురేష్ తన కొలీగ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారిది కులాంతర వివాహం. రత్న మాంబకు బొత్తిగా ఇష్టం లేని పని అది. కానీ కొడుకు పట్టుపట్టడంతో చేసేదేంలేక అంగీకరించింది. కొత్తకోడలు భవాని ఇంటిలో అడుగు పెట్టినప్పటినుంచీ ఇలా సూటిపోటి మాటలతో హింసిస్తోంది. కానీ భవాని నవ్వుతూ తన పని తాను చేసుకు పోతుంది. అత్తగారలా చీటికీ మాటికీ సూటిపోటి మాటలంటున్నా భవాని నవ్వుతూ ఎలా ఉండగలుగుతుందో పెద్దకోడలు మాధవికి అర్థం కాలేదు. వింటున్న తనకే కోపమొస్తుంది, ఈ అమ్మాయెలా నవ్వ గలుగుతుందని ఆశ్చర్యం. ఒకసారి కాక పోతే మరోసారైనా అత్తగారికి భవాని ఎదురు మాట్లాడుతుందని ఎదురు చూసింది. కానీ భవాని ముసిముసి నవ్వులతోనే సరిపెడుతోంది. ఇక ఉండబట్టలేక ఓ రోజు అడిగేసింది. ‘‘భవానీ... అత్తగారు రోజూ నిన్ను అన్ని మాటలంటున్నా నువ్వు మాట్లాడవేం?’’ నవ్వింది భవాని. ‘‘ఇదిగో ఇలాగే ముసిముసిగా నవ్వుకుంటావ్. నీకు కోపం రాదా?’’ అడిగింది మాధవి. ‘‘మిక్కీ మౌస్ మాట్లాడుతుంటే ఎవరికైనా కోపమొస్తుందా అక్కా?’’ ‘‘మిక్కీ మౌసా? నేను మాట్లాడు తోంది కార్టూన్ చానల్ గురించి కాదు భవానీ, మన అత్తగారి గురించి.’’ ‘‘అక్కా... అత్తగారు మాట్లాడుతుంటే నీకెందుకు కోపమొస్తుందో చెప్పు?’’ అడిగింది భవాని. ‘‘ఆవిడలా లేనిపోని దానికి వంకలు పెడుతుంటే కోపం రాదా మరి.’’ ‘‘వస్తుందనుకో. మరి అదే పని మిక్కీమౌస్ చేస్తే?’’ ‘‘మధ్యలో ఈ మిక్కీమౌస్ ఏంటి భవానీ? నాకు అర్థం కావడంలేదు.’’ ‘‘అక్కా... అత్తగారు అలా తప్పులు పడతారనీ, గట్టిగా అరుస్తారనే కదా నీకు కోపం. అదే పని మిక్కీమౌస్ చేసిం దనుకో... నువ్వు కోప్పడతావా? నవ్వు కుంటావా? మిక్కీమౌస్ ఏం చేసినా నవ్వే వస్తుంది కదా. నేను రోజూ నవ్వుతున్నది అందుకే. అంటే... నేను అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నా నన్నమాట’’... ‘‘అత్తగారిని మిక్కీమౌస్‌లా చూడ్డ మేంటి భవానీ? అర్థమయ్యేలా చెప్పవా?’’ ‘‘చెప్పినా నీకు అర్థం కాదక్కా. ఓ సారి చేసి చూస్తావా?’’ ‘‘ఓకే.’’ ‘‘సరే.. కళ్లు మూసుకుని ఓసారి మన అత్తగారిని ఊహించుకో. ఆవిడెలా కనిపిస్తుందో, వినిపిస్తుందో, నీకేం అనిపిస్తుందో చెప్పు.’’ కళ్లు మూసుకుని అంది మాధవి. ‘‘రాక్షసిలా కనిపిస్తుంది భవానీ, గట్టిగా అరుస్తోంది. నాకైతే పీక నొక్కేయాలని పిస్తోంది తెలుసా!’’ ‘‘కదా... ఇప్పుడు ఆ రాక్షసిని మిక్కీ మౌస్లా మార్చెయ్.’’ ‘‘ఓకే... యా... నౌ షి ఈజ్ లైక్ ఎ మిక్కీమౌస్. హహహ... భలే ఫన్నీగా ఉంది భవానీ. ఆమె అరుపుల్ని ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.’’ ‘‘కదా... ఓ నాలుగు రోజులు ఇలా ప్రాక్టీస్ చెయ్. ఐదో రోజు నుంచి ఆవిడెలా అరిచినా నీకు మిక్కీమౌస్ అరిచినట్లే వినిపిస్తుంది. నేను రోజూ చేస్తుంది అదే’’ అని పకపకా నవ్వింది భవాని. ‘‘అంటే.. రోజూ నువ్వు అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావ్ ఈ టెక్నిక్?’’ ‘‘ఎక్కడ నేర్చుకుంటేనేం.. బావుంది కదా. ఆవిడ అరుస్తున్నకొద్దీ మనకు ఎంటర్టైన్మెంట్.’’ ‘‘హహహ... నిజమే. ఇవ్వాల్టి నుంచి నేను కూడా నీ టెక్నిక్‌నే ఫాలో అవుతా’’... అని నవ్వుతూ చెప్పింది మాధవి. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్