కాఫీనా? క్యారెట్టా?
‘‘అక్కా...’’ ఫోన్‌లో ఏడుస్తోంది ఉష.
‘‘ఏంట్రా.. ఏమైంది?’’ అడిగింది రేఖ.
‘‘కిరణ్ ఏమీ మారలేదు.’’
‘‘మొన్ననే కదా నేనొచ్చి మాట్లాడా. మారతాడ్లే. కాస్త ఓపిక పట్టు.’’
‘‘నావల్లకాదు. పొద్దున లేచిన దగ్గర్నుంచీ మొబైల్‌తో కాపురం చేసేవాడికి నేనెందుకూ?’’
‘‘అరె.. అతనేదో మొబైల్‌లో బుక్స్ చదువుకుంటున్నా అనుమానిస్తావేం?’’
‘‘ఏమో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు?’’
‘‘నువ్వు ఇప్పటికే ఒకటికి రెండుసార్లు చెక్ చేశావుగా.. ఏం చేస్తున్నాడోనని.’’
‘‘ఏమో... ఇంట్లో ఏమీ తెలియలేదు. ఆఫీసులో ఏం చేస్తున్నాడో ఏమో!’’
‘‘ఏయ్ మొద్దూ... కిరణ్ అలాంటి వాడేం కాదులే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు.’’
‘‘నీకేం.. బావగారు పువ్వుల్లో పెట్టు కుని చూసుకుంటారు కాబట్టి ఎన్ని మాట లైనా చెప్తావ్. పడే వాళ్లకు తెలుస్తుంది ఆ బాధేంటో...‘‘ నిష్టూరమాడింది ఉష.
ఇప్పుడేం చెప్పినా వినే మూడ్‌లో లేదని అర్థమైంది రేఖకు. ‘‘సరే... ఇక్కడకు రా. నాల్రోజులు ఉండి వెళ్దువుగాని’’ అని చెప్పింది. సరేనని ఫోన్ పెట్టేసింది ఉష.
మర్నాడు ఉదయానికంతా ఉష అక్క ఇంటికి వచ్చేసింది.
‘‘హేయ్ ఉషా... ఏంటీ సర్‌ప్రైజ్ విజిట్?’’ అని పలకరించాడు బావ ఆనంద్. ‘‘అక్కనూ పిల్లల్నీ చూడాలనిపించి వచ్చాను బావా’’ అంది.
‘‘ఓకే.. ఓకే.. ఎంజాయ్. లోపలున్నారు చూడు.’’
ఉష లోపలకు వెళ్లి అక్కను పలక రించి, పిల్లలతో కాస్సేపు మాట్లాడింది. ఆనంద్, పిల్లలు స్కూల్‌కి వెళ్లాక అక్కా చెల్లెళ్లు కూర్చున్నారు తాపీగా. భార్యా భర్తల మధ్య అభిప్రాయభేదాలు, చిన్న చిన్న గొడవలూ సాధరణమేనని నచ్చ జెప్పేందుకు రేఖ ఎంత ప్రయత్నించినా వినడం లేదు ఉష.
మాటలతో చెప్తే తనకు అర్థం కాదని అర్థమైంది రేఖకు. అందుకే వంటింట్లోకి తీసుకెళ్లింది. రెండు గిన్నెల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టింది. నీళ్లు బాగా మరిగాక ఒక గిన్నెలో గుడ్లు, క్యారట్‌లు... మరో గిన్నెల్లో కాఫీ గింజలు వేసింది.
‘‘గుడ్లు, క్యారెట్లు కలిపి వండుతావా ఏంటక్కా?’’.. ఆశ్చర్యంగా అడిగింది ఉష.
అవునని తలూపింది రేఖ.
‘‘అవునా? కోడిగుడ్లు, క్యారెట్లు కలిపి వండుతారని నాకు ఇప్పటివరకూ తెలియదు.’’
‘‘ఇప్పుడు తెలిసిందిగా. ఎలా చేస్తానో చూడు.’’
ఆసక్తిగా చూస్తోంది ఉష. బాగా ఉడికాక స్టవ్ ఆపేసి, ఓ ప్లేటులో క్యార ట్, కోడిగుడ్డు పెట్టి... ‘‘ఆ క్యారెట్ ఎలా ఉందో చూడవే’’ అంది.
‘‘మెత్తగా ఉందక్కా.’’
‘‘మరి గుడ్డు?’’
‘‘గట్టిగా ఉంది.’’
‘‘సరే... ఈ కాఫీ ఎలా ఉందో చెప్పు’’ అంటూ మరగబెట్టిన డికాషన్‌తో కాఫీ కలిపి ఇచ్చింది.
‘‘సూపర్‌గా ఉందక్కా.’’
‘‘నువ్వు క్యారట్‌లా ఉంటావా? కోడి గుడ్డులా ఉంటావా? లేదంటే కాఫీలా ఉండాలనుకుంటున్నావా?’’ అడిగింది చెల్లెలి ముఖంలోకి చూస్తూ.
అర్థం కాలేదు ఉషకి. అయోమయంగా ఫేస్ పెట్టింది.
‘‘నీకు అర్థం కాలేదు కదా. సరే... మామూలుగా క్యారెట్, గుడ్డు, కాఫీ గింజలు ఎలా ఉంటాయ్?’’
‘‘క్యారట్, కాఫీ గింజలు గట్టిగా ఉంటాయి. గుడ్లు డెలికేట్‌గా ఉంటాయి.’’
‘‘కదా... మరిగే నీళ్లలో వేసి ఉడకబెట్టాక?’’
‘‘క్యారెట్ మెత్తగా అవుతుంది. గుడ్లు గట్టిగా మారతాయి. కాఫీగింజలు కూడా కాస్త మెత్తబడతాయి.’’
‘‘కరెక్ట్. చూడూ... మరిగే నీళ్లు మన లైఫ్‌లో వచ్చే సమస్యల్లాంటివి. అందరికీ ఎప్పుడో ఒకసారి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటికి ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతారు’’ అని చెల్లెలి వైపు చూసింది. ఆమె శ్రద్ధగా వింటోంది. దాంతో హుషారుగా చెప్పసాగింది.
‘‘కొందరు మొదట్లో క్యారట్‌లా గట్టిగా ధైర్యంగా ఉంటారు. కానీ సమస్యలు తట్టుకోలేక మెత్తబడతారు. కొందరు గుడ్డులా సున్నితమైన మనసుతో ఉంటారు. కానీ సమస్యలతో మనసును రాయిలా మార్చుకుంటారు. మరికొందరు కాఫీ గింజల్లా తెలివిగా ఉంటారు. తమ సమయస్ఫూర్తితో చుట్టూ ఉన్న సమస్యలను కూడా సువాసనాభరితంగా, అంటే తమకు నచ్చేలా, సంతోషాన్ని ఇచ్చేలా మార్చేస్తారు. అర్థమైందా?’’
‘‘హా... అర్థమైందక్కా.’’
‘‘ఇప్పుడు చెప్పు... నువ్వెలా ఉన్నావ్? ఎలా ఉండాలను కుంటున్నావ్?’’
‘‘ఇప్పుడు నేను ఎగ్‌లా ఉన్నాను. కానీ భవిష్యత్తులో కాఫీ గింజల మాదిరిగా ఉండాలనుకుంటున్నాను .’’
‘‘దట్స్ గుడ్. ఆల్ ద బెస్ట్’’ అంటూ ప్రేమగా చెల్లెల్ని హగ్ చేసుకుంది రేఖ.
- డాక్టర్ విశేష్ కన్సల్టింగ్ సైకాలజిస్ట్