Kapuram
-
విభేదాల మధ్య మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉండగలరా?
కాపురంలో ప్రేమానురాగాలు ఎంత సహజమో మనస్పర్థలూ అంతే సహజం. కాని కొంతమందికి జీవితంలో మనశ్శాంతి కరువవుతుంది. జీవితభాగస్వామి బాధపెడుతుంటే భార్య/భర్త తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురికావలసి వస్తుంది. అర్థం చేసుకోని లైఫ్పార్ట్నర్ దొరికినప్పుడు సమస్యలు స్థిమితం లేకుండా చేస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అయితే మీరే అర్థం చేసుకోగలిగినప్పుడు బాధపెట్టే జీవితభాగస్వామితో సర్దుకొని పోవచ్చు. కాని దానికీ పరిధి ఉంటుంది. బాధ పెట్టడం మరీ ఎక్కువైనప్పుడు, మీరు భరించలేని స్థితికి వచ్చినప్పుడు సమస్య పరిష్కారమయ్యేవరకు మీ లైఫ్‌పార్ట్‌నర్‌కు దూరంగా ఉండటమే మంచిది. అయితే పరిస్థితి అంతదూరం రానివ్వకుండా మీ జీవితభాగస్వామితో కలిసివుండే ప్రయత్నం చేయచ్చు. బాధపెట్టే మీ జీవితభాగస్వామితో కలిసి ఉండగలరా? మీలో ఆ నైపుణ్యం, ఓర్పు ఉందా? 1. మీ జీవితభాగస్వామి బలహీనతలను అర్థం చేసుకొని, వారిని క్షమించగలరు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. ఎవరైనా ప్రతిసారీ తప్పు చేయరని నమ్ముతారు. బాధతో ఉన్నప్పుడు మీ జీవితభాగస్వామితో మీరు గడిపిన సంతోష క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. మిమ్మల్ని బాధలకు గురిచేసిన సంఘటనలను మనసులో ఉంచుకోరు. ప్రతిరోజూ కొంత సమయాన్ని విశ్రాంతిగా గడుపుతారు. ఎ. అవును బి. కాదు 4. ప్రతిమనిషికీ సమస్యలుంటాయనుకుంటారు. జీవించినంత కాలం ఆనందంగా ఉండాలని మనసులో గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు. మీలా సమస్యల్లో బాధ పడేవారికి రోల్‌మోడల్‌గా ఉండాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, వీలైతే మీ జీవితభాగస్వామికి నచ్చిన విధంగా నడుచుకొనే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఎప్పుడూ అధైర్యపడరు. సమస్యలను ఎదుర్కొనేందు ధైర్యం అవసరమనుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. లైఫ్పార్ట్నర్ బాధ పెట్టేటప్పుడు మాట్లాడకుండా ఉండరు. వారి సమస్య ఏమిటని ప్రశ్నిస్తారు. మీరెంత బాధ పడుతున్నారో వివరించే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 9. వాదనకు దిగరు. ఎక్కువసేపు వాదోపవాదాలను కొనసాగనివ్వరు. ఆర్గ్యుమెంట్ వల్ల రిలేషన్ మరింత దెబ్బతింటుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 10. ఎక్కువ కాలం మీ భాగస్వామిపై కోపాన్ని ప్రదర్శించరు. ఆందోళనతో మీ నిద్ర, ఆరోగ్యం చెడగొట్టుకోరు.(ఇదే సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ ఆనందంగానే ఉంటారని గుర్తించగలరు). ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీ లైఫ్ పార్ట్నర్ ఇబ్బందులకు గురిచేస్తున్నా వారితో సర్దుకుపోవాలనుకుంటారు. మీలో సహనగుణం ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ జీవితభాగస్వామితో కలిసుండేలా చేస్తుంది. కోపం వచ్చినా మీ పార్ట్నర్ను అర్థం చేసుకుంటారు. ‘బి’ సమాధానాలు ‘ఎ’ ల కంటే ఎక్కువగా వస్తే బాధపెట్టే మీ పార్ట్నర్తో మీరు కలిసివుండలేరు. సర్దుకుపోలేక పోవటం వల్ల అలజడికి గురవుతారు. మీ మధ్య చిన్న చిన్న విషయాల వల్ల విభేదాలు వచ్చినా, మీ జీవితభాగస్వామి కలిగించే ఇబ్బందులు మితిమీరకుండా ఉన్నా వాటిని క్షమించటానికి ట్రై చేయండి. ఆత్మవిశ్వాసంతో సమస్యలు పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. -
కోర్టు చొరవతో కాపురం నిలిచింది!
బిర్భూమ్: న్యాయస్థానాలు కేవలం దోషుల్ని శిక్షించడమే కాదు మానవత్వంతోనూ వ్యవహరిస్తాయని మరోసారి రుజువైంది. పశ్చిమబెంగాల్లో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఓ జంట విషయంలో న్యాయమూర్తి వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంది. బెంగాల్‌లోని బిర్భూమ్‌కు చెందిన గౌతమ్ దాస్, అహనాలకు ఇటీవల వివాహమైంది. అత్తామామల వేధింపులు ఎక్కువకావడంతో దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని జనవరి 16న సూరీలోని జిల్లా కోర్టును ఆశ్రయించారు. అయితే కుటుంబ సభ్యులతో కాకుండా విడిగా ఓ హోటల్లో కొద్దిరోజులు గడపాలనీ, సమస్యను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి పార్థసారథి సేన్ వీరికి సూచించారు. హోటల్లో ఉండేందుకు తన వద్ద తగిన నగదు లేదని గౌతమ్ కోర్టుకు చెప్పడంతో హోటల్ బిల్లు మొత్తం కోర్టు నిధుల నుంచి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మొత్తాన్ని తానే భరిస్తానని ప్రభుత్వ న్యాయవాది రంజిత్ గంగూలీ ముందుకొచ్చారు. దీనికి కోర్టు అంగీకరించడంతో ఆ జంటకు గంగూలీ బిర్భూమ్లోని ఓ హోటల్లో సూట్ బుక్ చేశారు. ప్రస్తుతం వీరు విడిపోవాలనుకోవడం లేదని గంగూలీ మీడియాకు తెలిపారు. -
ఒక పొరపాటుకు యుగములు పొగిలే గుప్పెడు మనసు
నాటి సినిమా ఒకరితో సంబంధం పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడం బేబీకి ఇష్టం లేదు. అలాగని తన వల్ల విద్య, బుచ్చిబాబులు విడిపోయి ఉండటం కూడా ఇష్టం లేదు. ఇదో చిక్కుముడి. ఎలా విప్పాలి? సరిత కోసమే ఈ సినిమా తీశారా, సరిత వల్లనే ఈ సినిమా బాగుందా, సరితతోటే ఈ సినిమా గుర్తుండిపోయిందా చెప్పలేం. సినిమాలో సరిత పాత్ర పేరు ‘బేబీ’. చిన్న పిల్ల. పెద్దగా అవుతున్న పిల్ల. మనసు, శరీరమూ ఎదిగీ ఎదుగుతూ అలజడికి లోనవుతున్న అల్లరి పిల్ల. ఆమె తల్లి ఒక మాజీ నటి. వేషాలు లేవు. తండ్రి వాళ్లను విడిచి పెట్టి చాలా కాలం అవుతోంది. ఏదో గుట్టుగా కాపురం నడుస్తోంది. ఈ లోపు పక్కింట్లో ఒక ఆర్కిటెక్ట్ కుటుంబం దిగింది. భర్త బుచ్చిబాబుగా శరత్‌బాబు, భార్య విద్యగా సుజాత బేబికి పరిచయం అవుతారు. బేబీ ఈ ఇంటికి వస్తుంటుంది, పోతుంటుంది. కాని కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. బేబీ తల్లి హటాత్తుగా చనిపోతుంది. దాంతో బుచ్చిబాబు, విద్యల కుటుంబమే బేబీ కుటుంబం అవుతుంది. బేబిని వాళ్లు చదివిస్తుంటారు.కాని ఒకరోజు వానలో తడిసిన బేబీ బుచ్చిబాబు మనసును బలహీనం చేస్తుంది. క్షణికవాంఛకు అతడు లోబడతాడు. బేబీని లోబరుచుకుంటారు. అది వాన కురిసిన రోజు. కాని బంగారంలాంటి మూడు జీవితాల్లో తుఫాను కొట్టిన రోజు. వారిద్దరు కలిసి ఉండటం బుచ్చిబాబు భార్య చూసేస్తుంది. బుచ్చిబాబు కూతురు కూడా చూసేస్తుంది. ఎంత హుందాగా ఉండాలనుకున్నా ఆమెలోని సగటు స్త్రీ భర్తతో విడిపొమ్మనే చెబుతుంది. భార్యాభర్తల మధ్య అగాధం... ఈలోపు బేబీ గర్భం దాలుస్తుంది.ఒకరితో సంబంధం పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడం బేబీకి ఇష్టం లేదు. అలాగని తన వల్ల విద్య, బుచ్చిబాబులు విడిపోయి ఉండటం కూడా ఇష్టం లేదు. ఇదో చిక్కుముడి. ఎలా విప్పాలి? చివరకు తొమ్మిదంతస్తుల భవంతి టెర్రస్ మీద బేబీ తన కూతురి బర్త్‌డే పార్టీకి బుచ్చిబాబును, విద్యను పిలుస్తుంది. వారి చేత ఒకరినొకరికి క్షమాపణ చెప్పిస్తుంది. ఇక మీదట తన అడ్డంకి ఉండదని చెప్పి, హాయిగా బతకమని కోరి, హటాత్తుగా అంత ఎత్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. విద్య బేబీ కూతురిని దగ్గరకు తీసుకుంటూ ఉండగా సినిమా ముగుస్తుంది. 1979లో ఇలాంటి కథతో ఒక సినిమా తీయడమే పెద్ద సాహసం. కాని దర్శకుడు బాలచందర్ తన విశేష ప్రతిభతో సినిమాను నడిపి తానెందుకు గొప్ప దర్శకుడో నిరూపిస్తాడు. సినిమాలో ఎన్నో అంతరార్థాలు, ఆంతర్యాలు ఉన్నాయి. సినిమాలో సుజాత సెన్సార్ బోర్డ్ మెంబర్. అన్నీ రూల్సు ప్రకారం ఉండాలని రూల్సు మాట్లాడుతుంటుంది. కాని మనసుకు, అనూహ్యమైన మానవ ప్రవర్తనకు రూల్సు ఉండవు. ఆ సంగతి తన ఇంట్లో జరిగిన ఉదంతం ద్వారా దర్శకుడు మనకు చెబుతాడు. బేబీ పాత్ర పరిచయం అయ్యే మొదటి సన్నివేశంలోనే సుజాత సరదాగా ‘కెవ్వు’మని కేక వేస్తుంది. క్లయిమాక్స్‌లో కూడా భీతావహంగా బేబీ ఆత్మహత్యను చూస్తూ ‘కెవ్వు’ను కేక వేయాల్సి వస్తుంది. బేబీ పాత్ర రాకపోకలు అవే. ఆమెను తీవ్రంగా తల్లకిందులు చేసేవే. స్త్రీ, పురుష ఆకర్షణల్లో చంచలమైన మనసు మనుషులను నీటన ముంచుతుంది. నిప్పున కాలుస్తుంది. దాని మాయలో పడని వాళ్లు ఉండరు. దాని చెలగాటంతో సతమతమవని వారూ ఉండరు. మనసును అర్థం చేసుకోకపోతే ఎదుటి మనిషి తప్పొప్పులను సరిగా అర్థం చేసుకోలేము. ఆ మాటే ఈ సినిమా చెబుతుంది. గణేశ్ పాత్రో మాటలు, ఆత్రేయ పాటలు అందరికీ గుర్తుంటాయి. ‘నేనా పాడనా పాట’.. ‘నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా’ పాటలు ఇప్పటికీ రేడియోలో హిట్. ఇక మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ ఆల్‌టైమ్ క్లాసిక్. ‘లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’ అనే పంక్తిలో వెతుక్కుంటే వేయి అర్థాలు. 1979లో ద్విభాషా చిత్రంగా రూపొందిన గుప్పెడు మనసు తెలుగులో, తమిళంలో భారీ విజయం నమోదు చేసింది. మనసు ఒక మరీచిక. మాయలేడీ. ఆ విషయాన్నే ఎంతో ప్రతిభావంతంగా ఈ సినిమా చెప్పగలిగింది. అందుకే ఇది కాంచనం. మేలిమి బంగారం. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నాటి సినిమా. – కె -
పిచ్చి మొగుడు
లీగల్ స్టోరీస్ మగవాళ్ల పిచ్చిచేష్టలతో ఎన్నో పెళ్లిళ్లు నాశనం అవుతున్నాయి! కట్నాల పిచ్చి, కామం పిచ్చి, అభద్రత పిచ్చి, వయొలెన్స్ పిచ్చి, పోల్చే పిచ్చి, హేళన పిచ్చి, శాడిజం పిచ్చి, నిర్లక్ష్యం పిచ్చి... ఇలాంటి వెర్రి వేధింపులెన్నో! ఏదోలా ఈ పిచ్చిమొగుళ్లతో మన బంగారాలు సర్దుకుపోతున్నారు. కానీ.. మొగుడు నిజంగానే పిచ్చోడైతే? ఆ ‘పిచ్చిపెళ్లి’కి సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చే సెక్షన్ ఉంది!! ఎప్పటిలాగే భయంభయంగా గదిలోకి వెళ్లింది స్వర్ణ. మంచం మీద బాలాజీ వెల్లకిలా పడుకొని గాల్లో రాతలు రాస్తున్నాడు. ఆమె అలికిడిని గమనించినట్టు లేడు. కొంచెం ధైర్యం వచ్చింది స్వర్ణకు. ఆ ధైర్యంతోనే మంచం మీద కూర్చుంది. ఆ కదలికా బాలాజీని డిస్టర్బ్ చేయలేదు. పరిశీలనగా చూసింది అతడిని. సీరియస్‌గా ఉంది మొహం గాల్లో రాస్తున్న రాతల మీదే ఉంది అతడి ఏకాగ్రత. అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టు కళ్ల మీద పడుతోంది. కనీసం దాన్ని పక్కకు తోసుకోవాలన్న ఆలోచన కూడా లేదు మనిషికి. మోకాలు దాకా మడిచిన కుడి కాలు మీద ఎడమ కాలు బరువు వేసి.. కుడి చేయి పొట్టమీద పెట్టుకొని ఎడమ చేయిని గాల్లో ఆడిస్తున్నాడు. మొహమంతా చెమటలు పట్టి ఉంది. వెళ్లి ఏసీ ఆన్ చేసింది. ఆ తేడానూ గమనించినట్టు లేదు. ఈసారి మంచానికి అటుపక్కకు వెళ్లి బాలాజీ కళ్లమీద పడుతున్న జుట్టును సవరిద్దామని అతని మొహందాకా చేతిని తీసుకెళ్లింది.. అంతే హఠాత్తుగా ఈలోకంలోకి వచ్చినవాడిలా... ఆమె చేతిని విసిరికొట్టాడు బాలాజీ. ఆ తోపుకి అడుగు దూరంలో పడింది ఆమె. కోపంగా లేచి ఆమె జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చికెళ్లి గది బయటకు గెంటేసి తలుపేసుకున్నాడు బాలాజీ. బాధ, అవమానం, ఉక్రోషంతో ఆమె మొహం ఎర్రబడింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని కళ్లల్లోకి రాకుండా అదిమేసింది. తొలి రాత్రే బతుకు తెల్లారింది పెళ్లయి రెండేళ్లవుతోంది. తొలిరాత్రీ ఇదే అనుభవం. ఎంతసేపూ మనిషి నుంచి ఏ స్పందన రాకపోయేసరికి తనే చొరవ తీసుకుంది. ఈడ్చి కొట్టాడు. బిత్తర పోయింది. తెల్లవారి గదిలోకి రావడానికే భయపడింది. అత్తగారికి విషయం చెబితే... ‘వాడికి సంప్రదాయంగా ఉండే ఆడపిల్లంటే ఇష్టం. అడ్వాన్స్‌గా ప్రవర్తిస్తే నచ్చదు. వాడంతట వాడు నీ దగ్గరకు వచ్చే వరకు ఆగాలి మరి’ అని సూక్తి చెప్పింది. అదింకా అవమానంగా అనిపించింది స్వర్ణకు. నెల.. రెండు నెలలు.. యేడాది.. యేడాదిన్నర గడిచినా భర్త నడతలోని మర్మం బోధపడలేదు స్వర్ణకి. అరుస్తాడు. అప్పుడే ఏడుస్తాడు. ఇంతలోకే నవ్వుతాడు. మూలుగుతాడు. ఆరోగ్యవంతుడో.. అనారోగ్యవంతుడో తెలియట్లేదు. యేడాదిన్నర తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగినప్పుడు.. అతిదగ్గరి వాళ్లనే అతిథులుగా పిలిచారు అత్తింటి వాళ్లు. చివరకు తన పుట్టింటి వాళ్లను కూడా పిలవలేదు. వ్రతానికేంటి.. అసలు పెళ్లయినప్పటి నుంచి అత్తగారింట్లో ఏ శుభకార్యమైనా వాళ్లకు వచ్చే అనుమతిలేదు.. తనకు అటు వెళే యాక్సెస్ లేదు. అంతా అయోమయం. ఏం జరుగుతుందో.. తన జీవితమెటుపోతుందో తెలీని అయోమయం. పుట్టింటి వాళ్లతో కనెక్షన్ కట్! భర్త ఎప్పుడూ ఈ లోకంలో ఉండడు. పెళ్లి చూపులప్పుడు అబ్బాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పారు. వాకబు చేస్తే కూడా నిజమే అని తేలింది. అయితే రెండు నెలలుగా లీవ్‌లో ఉన్నారని చెప్పారు యూనివర్శిటీలో. కారణం అడిగితే.. పోస్ట్ డాక్టోరియల్ కోర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అందుకే లీవ్ అన్నారు అత్తగారు వాళ్లు. నిజమే కామోసు అని సర్దుకున్నారు పుట్టింటివాళ్లు. పెళ్లిచూపులప్పుడు ఆయన తీరుతెన్నులు చూసి ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్లాగే ఉన్నాడు ఏమీ పట్టించుకోకుండా అని జోకులేశారే కాని అసలు విషయాన్ని గ్రహించలేకపోయారు. పెళ్లయ్యాక ఆయన పద్ధతి గురించి అత్తగారికి చెబితే.. ‘వాడినేం ఇన్సల్ట్ చేస్తున్నావో అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు’ అంది. అలాంటి సమర్థింపులు వినివినీ సహనం చచ్చిపోయి ‘అసలు నావైపు చూస్తే కదా ఇన్సల్ట్ అయినా చేయడానికి’ అని స్వర్ణ జవాబిచ్చింది.‘అమ్మో మీ అమ్మలాంటి దాన్ని నాకే ఎదురు మాట్లాడుతున్నావంటే! పాపం.. చదువు తప్ప లోకం తెలీని అమాయకుడు నా కొడుకు.. వాడిని ఎంత రాచిరంపాన పెడుతున్నావో? అందుకే వాడు అలా ఉంటున్నాడు నీతో’ అని నింగీ నేలా ఏకం చేసింది. అప్పటి నుంచి పుట్టింటివారితో తన కనెక్షన్‌ను కట్ చేసింది. భర్త ఏ కోర్స్కూ ప్రిపేర్ అవట్లేదు. ఉద్యోగానికీ వెళ్లట్లేదు. పదిమందిలో కలవడు. ఎవరింటికీ వెళ్లడు. కొత్తవాళ్లెవరు వచ్చినా సహించడు. తన గదిలోకి వస్తే చాలు.. బయటకు గెంటేస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గరా వాళ్లమ్మ తప్ప ఎవరు కనిపించినా కంచాలు, గిన్నెలు గిరాటేస్తాడు. కుర్చీలు ఎత్తేస్తాడు. అసలు తన పొడే గిట్టదు అతనికి. క్షణమొక నరకంగా బతుకుతోంది. మెట్టినింటి మెంటల్ బ్యాగ్రౌండ్! ఇందాక స్వర్ణ అత్తగారింట్లో జరిగిన సత్యనారాయణ వ్రతం దగ్గర ఆగాం కదా! ఆరోజూ పీటల మీద అత్తగారు, మామగారితో పాటు స్వర్ణ, బాలాజీ కూడా కూర్చోవాల్సి ఉండింది. భయభయంగానే భర్త పక్కన సర్దుకుంది స్వర్ణ. ఆమెను గమనించలేదు అతడు. వ్రతం మధ్యలో ఉన్నప్పుడు ఏదో సందర్భంగా ఆమె చేయి అతడికి తగిలింది. అంతే ఎక్కడలేని బలంతో ఆమెను తన్నాడు. అతని చర్యకు అక్కడున్న వాళ్లంతా హతాశులయ్యారు. బిక్కచచ్చిపోయింది స్వర్ణ. ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోయింది. ఆమె అత్తగారి వదిన (అన్నయ్య భార్య) స్వర్ణ గదిలోకి వెళ్లి ఆమెను సముదాయించింది. ‘ఇదేంటి పెద్దమ్మా.. పెళ్లయి యేడాదిన్నర అవుతున్నా ఆయన అంతు చిక్కడు నాకు’ అంటూ గోడు వెళ్లబోసుకుంది. ‘అతనికేం మాయరోగమో తెలిసి చావట్లేదు’ అని బాధను వెళ్లగక్కింది. ‘మెంటలమ్మా’ అంది నిపాందిగా ఆవిడ! షాక్ అయింది స్వర్ణ. ‘అవును.. మీ అత్తగారి వంశంలో ఆ రోగం ఉంది. మీ అత్తగారి మరిదికీ ఉండేది. పిచ్చితో దేశాలు పట్టుకుపోయాడు. వీడికీ వచ్చింది. బాగా చదివాడు. కాని మెంటల్. దాంతోనే ఉద్యోగానికి కూడా వెళ్లట్లేదు’ అని నిజం చెప్పింది. చెవులప్పగించి విన్నది స్వర్ణ. టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ఒత్తిడి బంధువులు అందరూ వెళ్లిపోయాక అత్తగారికి నిలదీసింది ‘మానసికంగా బాగాలేడని తెలిసీ తన గొంతు ఎందుకు కోశారు’ అంటూ. ‘గొంతు కోయడం కాదు. బంగారు పల్లకీ ఎక్కించాం. నీ జన్మలో నీకిలాంటి అత్తిల్లు దొరికేదా? ఇప్పుడు నీకేం తక్కువ. లంకంత ఇల్లు.. ఒంటినిండా బంగారం. బీర్వానిండా పట్టు చీరలు. తినడానికి వెండి కంచాలు... కాలుకదపనివ్వకుండా ఇంటినిండా నౌకర్లు, చాకర్లు. పుట్టినప్పటి నుంచి ఇలాంటి సుఖాన్ని ఎరుగుదువా? ఇంకే ఇంటికి వెళ్లినా ఇలాంటి జీవితం ఉండేదా? నోర్మూసుకొని పడి ఉండు. నువ్వు మాకేం చేయక్కర్లేదు. ఓ వారసుడిని మా చేతుల్లో పెట్టు చాలు’ అంది. ఖంగు తిన్నది ఆ మాటకు స్వర్ణ. ‘వారసుడా? కాపురం చేయకుండా బిడ్డనెట్లా కంటారు?’ అంది అమాయకంగా. ‘నంగనాచిలా మాట్లాడకు. చదువుకున్న దానివే కదా.. కాపురం లేకుండా పిల్లల్ని కనే పద్ధతులున్నాయని తెలీదా? టెస్ట్‌ట్యూబ్ బేబీని కనివ్వు. మా బంధువులకే నర్సింగ్‌హోమ్ ఉంది. గుట్టుచప్పుడు కాకుండా పని జరిగిపోతుంది. మీ ఇంట్లో వాళ్లకు కూడా తెలియద్దు. బిడ్డ పుట్టాక.. ఆస్తిలో సగం నీ పేర రాస్తాం’ వ్యాపారిలా మాట్లాడుతున్న అత్తగారిని చూసి విస్తుపోయింది స్వర్ణ. ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించింది. ఆ రోజు నుంచి తనను ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టుదిట్టం చేశారు. 24 గంటలూ ఆవిడ కాపలా. రోజూ ఒత్తిడే.. టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ఒప్పుకోమని. ఆ మానసిక హింసను తట్టుకోలేక.. ఓరోజు తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. ‘అతడు మానసిక రోగి. నీకు అంటగట్టారు. వెంటనే లాయర్ని కలువు’ అని సలహాతో పాటు తనకు తెలిసిన అడ్వకేట్ నంబరూ ఇచ్చింది. పిచ్చికి ‘ట్రీట్మెంట్’ ఉంది పై కేసులో అబ్బాయి తీవ్రమైన మానసిక అస్వస్థతతో ఉన్నాడు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. మందుల వల్ల మత్తులో ఉన్నప్పుడు తప్ప మిగతా వేళ్లల్లో అబ్బాయి వయొలెంట్‌గా ప్రవర్తిస్తున్నాడు. కొన్నిసార్లు అతని ఉనికి ఇతరులకు.. ముఖ్యంగా భార్యకు ప్రాణాపాయంగా çపరిణమించవచ్చు. ఎందుకంటే భార్యకే ఆయనతో సన్నిహితంగా మెలిగే అవకాశం ఎక్కువ కాబట్టి. ఇలా సంసారం జీవితం ఉండకపోగా.. ప్రాణాలకూ ముప్పే. చికిత్సకు లొంగని మానసిక అస్వస్థత, పిచ్చి, ఉన్మాదం ఉన్నప్పుడు భాగస్వామి విడాకులు తీసుకునే వీలు కల్పిస్తోంది చట్టం. బాలాజీ మానసిక అనారోగ్యం మందులతో తాత్కాలికంగా మేనేజ్ చేయడం తప్ప అది తగ్గేదికాదని డాక్టర్లూ స్పష్టం చేశారు. దాంతో స్వర్ణ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13, సబ్ సెక్షన్ 1, క్లాజ్ 3 ప్రకారం బాలాజీ నుంచి విడాకులు తీసుకుంది. అబ్బాయి విషయం తెలిసీ దాచి పెట్టి , మోసం చేశారని అత్తింటి వారిపై కూడా క్రిమినల్ కేసులు వేయవచ్చు. లేదంటే తగినంత దీర్ఘకాలిక భరణం పొందవచ్చు. – ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ parvatiadvocate2015@gmail.com – సరస్వతి రమ -
క్యాన్సర్ కాపురం
భరోసా క్యాన్సర్ ప్రాణాంతకవ్యాధి. రాక్షసుడైన భర్త దొరికితే కాపురం కూడా ప్రాణాంతకమే. హైదరాబాద్ గోల్కొండకు చెందిన అర్షియా నాజిమా ఈ రెండు క్యాన్సర్ల బారిన పడింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వదిలేసిపోయాడు. చుట్టూ గాఢాంధకారం. కావల్సింది ఈ సమాజం ఉంది అన్న భరోసా. అశ్రువును తుడిచే ఔషధం. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, థర్డ్ బ్లాక్, సెకండ్ ఫ్లోర్లో 20వ నంబర్ బెడ్‌పైన అచేతనంగా పడుకొని ఉంది 32 ఏళ్ళ అర్షియా నాజిమా. వెంట్రుకలు ఊడిపోయి పలుచబడిన తలను చున్నీలాంటి దానితో కప్పుకుని ఉంది. చున్నీని చూపిస్తూ పెగలని గొంతుతో అంది- నా భర్త ఇలాంటి చిన్న గుడ్డ కూడా ఎరుగడు. ఆ చున్నీ వెనుక ఉన్న శరీరమే అతనికి కావాల్సింది అని. ఆమెది ఇరవై ఏళ్ల విషాద గాథ. విన్నవారికి మనిషికి ఇలాంటి కష్టాలు ఉంటాయా అనిపించేంత వేదన. ఆ వేదనను ఆమె ఇలా ఏకరువు పెట్టింది. ‘‘మాది గోల్కొండ ఏరియా. మా నాన్న గోల్కొండ ఫోర్ట్ దగ్గర చరిత్ర పుస్తకాలు అమ్మేవాడు. మేము ఏడుమంది సంతానం. నలుగురు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. నేను చివరిదాన్ని. నాన్న సంపాదన అంతంత మాత్రం కావడంతో మాది చాలీచాలని బతుకని చెప్పాలి. నా భర్త ఒక హాస్పిటల్లో అటెండర్‌గా పని చేసేవాడు. పేరు మహ్మద్ అలీ అహ్మద్. మా ఏరియాలోనే వాళ్లూ ఉండేవాళ్లు. నన్ను చూసి చేసుకుంటానని వెంటపడ్డాడు. మా పెళ్లి జరిగిపోయింది... అత్త రాక్షసి... మా అత్తకు ఈ పెళ్లి ఇష్టం లేదో లేదంటే కొడుకు నా ప్రేమలో ఆమెను నిర్లక్ష్యం చేస్తాడని భయమో చాలా రాక్షసంగా ప్రవర్తించేది. నా భర్తతో నా తొలిరాత్రి జరిగిన సంఘటనే భయానకమైనది. మా అత్త తొలిరాత్రి నన్ను నా భర్త దగ్గర నుంచి ఈడ్చుకొచ్చి ‘ఇంత లావుగా వున్నావు. వెళ్లి వాకింగ్ చేసిరా’ అని ఇంటి నుంచి బయటకు నెట్టింది. అంత రాత్రిపూట ఏం చేయాలో తోచక బిక్కు బిక్కుమంటూ ఇంటి బయటే గడిపాను. నా భర్త నీడని కూడా తాకకుండా చాలా రోజులు కాపలా కాసింది మా అత్త. ఇంటికి సరైన తలుపు కూడా లేని గదిని మాకిచ్చింది. చుట్టుపక్కల కుర్రాళ్ళు అర్ధరాత్రుళ్ళు తలుపుకొడుతుంటే భయంతో నిద్రలేని రాత్రిళ్ళు గడిపాను. పెళ్ళయిన కొత్తలో నా భర్త లేని సమయంలో ఎవడో ఒక అపరిచితుడిని నా గదిలోకి నెట్టి బయట గడిపెట్టింది నా అత్త. భయంతో కేకలు పెట్టాను. ఆడపిల్ల ఇష్టం లేదు... నాకు తొలిచూలు ఆడపిల్ల. నా భర్తకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు. అత్తకు కూడా. కాని పుట్టిన బిడ్డను ఎలా వద్దనుకుంటాం. పాప పుట్టిన ఆరు నెలలకు రంజాన్ పండుగ వచ్చింది. అందరూ కొత్త గుడ్డలు కొనుక్కుంటున్నారు. నా చూపు వాళ్ల గుడ్డలపైన లేదు. గిన్నె నిండా వున్న పాలపైన వుంది. బిడ్డ నా దగ్గర పాలు తాగడం లేదు. గిన్నెలో పాలు పడదామని చిన్నగ్లాసుడు పాలు తీసుకున్నాను. అంతే నా ఐదుగురు ఆడబిడ్డలూ, భర్తా, అత్తా కలిసి నన్ను గొడ్డును బాదినట్టు బాదారు. రెండో కాన్పులో మగపిల్లాడు పుట్టాడు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బిడ్డ చాలా అందంగా పుట్టాడని వాడు నా కొడుకు కాదని వెళ్లిపోయాడు. నా అన్నలే ఆసుపత్రి బిల్లు కట్టి ఇంటికి తెచ్చారు. నా అదృష్టమో దురదృష్టమో మూడో కాన్పులో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. అదే నా నేరం అయ్యింది. నన్ను విడిచి వెళ్లిపోయాడు. తొమ్మిదేళ్లుగా అతడు ఏమయ్యాడో నాకు తెలియదు. ఎప్పుడూ రాలేదు. కనీసం ‘తలాక్’ కూడా చెప్పలేదు. పెళ్లయిన 20 ఏళ్ళలో తండ్రిగా తన బాధ్యతను ఏనాడూ నిర్వర్తించలేదు. పిల్లలకి ఓ బిస్కెట్టు కొనిపెట్టిన జ్ఞాపకం నాకు లేదు. కనీసం వాళ్ళనాన్న మొహం ఎలా వుంటుందో చూసిన జ్ఞాపకం నా పిల్లలకి లేదు. బ్లడ్ క్యాన్సర్... మూడు నెలల క్రితం ఆరోగ్యం సరిగా ఉండకపోతే హాస్పిటల్లో చూపించుకున్నాను. నాకు ఎఎంపిఎల్ బ్లడ్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అని చెప్పారు. భోరున విలపించాను. పదహారేళ్ళకే నన్ను జీవచ్ఛవంలా మార్చిన అత్తగారితో పోరాడాను. చిన్నవయస్సులోనే మోయలేని భారాన్ని నా భర్త మిగిల్చి పోతే విధితో పోరాడాను. కాని ఈ క్యాన్సర్‌తో మాత్రం పోరాడలేకున్నాను. ఇంత ఖరీదైన జబ్బుని తట్టుకునే స్థాయి కాదు మాది. కటిక పేదరికం అనుభవిస్తున్నాం. అయినప్పటికీ ఎలాగో కష్టాలు పడి జూలై మొదటి తారీఖున ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు మా అన్నలు. 35 రోజులు ఇక్కడే ఉన్నాం. రెండున్నర లక్షలకు పైగా ఖర్చయ్యింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 85 వేలు సాయం చేసింది. నిజాం ట్రస్ట్ కొంత సాయపడింది. మా బంధువులు, మిత్రులు అంతా ఏదో తోచిన సాయం చేసారు. ఇప్పుడు మళ్లీ హాస్పిటల్లో చేరాను. ఈ జబ్బుకి ఇంకా చాలా ఖర్చవుతుందంటున్నారు. దాదాపు 20 లక్షలు. అంత డబ్బు ఎలా తేగలం? నువ్వు అమ్మవవుతావా తల్లీ... నా పెద్ద కూతురు గులఫ్షా ఇంటర్మీడియట్ చదువుతోంది. కొడుకు ఒజియాప్కి 11 ఏళ్ళు. సెవెంత్ క్లాస్. చిన్నకూతురు మరియంకి తొమ్మిదేళ్ళు ఫోర్త్ చదువుతోంది. నాకేదైనా అయితే నా పిల్లలేం అవుతారోనని నా బెంగ. నా చిన్న కూతురు మరియంకి దిండుపైన పడుకునే అలవాటు లేదు. నా చేతిపైనే ఎప్పుడూ నిద్దరోతుంది. గత మూడు నెలలుగా నేను ఆసుపత్రిలో ఉన్నాను. అప్పటి నుంచి ఇంట్లో నా బిడ్డకి నిద్రలేదు. ఆమే కాదు. నా ముగ్గురు పిల్లలకీ కంటిపైన కునుకులేదు. బక్కచిక్కి పోయారు. నా బిడ్డలకు తల్లీ తండ్రీ నేనే. ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్‌తో నేను చనిపోతే వాళ్ళేమౌతారోనని నా గుండె తరుక్కుపోతోంది. అల్లా నాకిలా చేసి ఉండాల్సింది కాదు. నా అన్నలిద్దరూ గోల్కొండకోటలో టూరిస్ట్ గైడ్స్. వాళ్ళకొచ్చే నాలుగైదొందల్లో ప్రతి రోజూ నాకు యాభయ్యో వందో ఇచ్చి నన్ను పోషిస్తూ వచ్చారు. గత మూడు నెలలుగా వాళ్లిద్దరూ వంతులు వేసుకొని నా దగ్గర ఉంటున్నారు. ఒక్కరోజు డబ్బుల్లేకపోయినా పొయ్యి వెలగని పరిస్థితి మాది. నా బిడ్డలకోసమే నాకు బతకాలని వుంది. అల్లా కరుణిస్తే, ఎవరైనా సాయం చేస్తే నేను బతుకుతానన్న ఆశ వుంది. ‘నేను చనిపోతే నీ చెల్లికీ, తమ్ముడికీ నువ్వు అమ్మవవుతావా అమ్మా’ అని నా పెద్దకూతురిని అడిగాను. బోరున ఏడ్వడం తప్ప తను సమాధానం చెప్పలేకపోయింది. అల్లానే నాకు అన్యాయం చేసాడు. ఇక నా కష్టం ఎవరు తీరుస్తారు’’. - అత్తలూరి అరుణ ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి అర్షియా నాజిమాకు సహాయం చేయదలచినవారు 96185 52260కు సంప్రదించవచ్చు. అకౌంట్ వివరాలు: MD Baseed Khan, A/C No. 3243700561, CBI, Chota Bazar, Golconda Fort, IFS Code CBIN0 282389లో కూడా డబ్బు జమ చేయొచ్చు. -
కాఫీనా? క్యారెట్టా?
‘‘అక్కా...’’ ఫోన్లో ఏడుస్తోంది ఉష. ‘‘ఏంట్రా.. ఏమైంది?’’ అడిగింది రేఖ. ‘‘కిరణ్ ఏమీ మారలేదు.’’ ‘‘మొన్ననే కదా నేనొచ్చి మాట్లాడా. మారతాడ్లే. కాస్త ఓపిక పట్టు.’’ ‘‘నావల్లకాదు. పొద్దున లేచిన దగ్గర్నుంచీ మొబైల్‌తో కాపురం చేసేవాడికి నేనెందుకూ?’’ ‘‘అరె.. అతనేదో మొబైల్లో బుక్స్ చదువుకుంటున్నా అనుమానిస్తావేం?’’ ‘‘ఏమో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు?’’ ‘‘నువ్వు ఇప్పటికే ఒకటికి రెండుసార్లు చెక్ చేశావుగా.. ఏం చేస్తున్నాడోనని.’’ ‘‘ఏమో... ఇంట్లో ఏమీ తెలియలేదు. ఆఫీసులో ఏం చేస్తున్నాడో ఏమో!’’ ‘‘ఏయ్ మొద్దూ... కిరణ్ అలాంటి వాడేం కాదులే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు.’’ ‘‘నీకేం.. బావగారు పువ్వుల్లో పెట్టు కుని చూసుకుంటారు కాబట్టి ఎన్ని మాట లైనా చెప్తావ్. పడే వాళ్లకు తెలుస్తుంది ఆ బాధేంటో...‘‘ నిష్టూరమాడింది ఉష. ఇప్పుడేం చెప్పినా వినే మూడ్‌లో లేదని అర్థమైంది రేఖకు. ‘‘సరే... ఇక్కడకు రా. నాల్రోజులు ఉండి వెళ్దువుగాని’’ అని చెప్పింది. సరేనని ఫోన్ పెట్టేసింది ఉష. మర్నాడు ఉదయానికంతా ఉష అక్క ఇంటికి వచ్చేసింది. ‘‘హేయ్ ఉషా... ఏంటీ సర్ప్రైజ్ విజిట్?’’ అని పలకరించాడు బావ ఆనంద్. ‘‘అక్కనూ పిల్లల్నీ చూడాలనిపించి వచ్చాను బావా’’ అంది. ‘‘ఓకే.. ఓకే.. ఎంజాయ్. లోపలున్నారు చూడు.’’ ఉష లోపలకు వెళ్లి అక్కను పలక రించి, పిల్లలతో కాస్సేపు మాట్లాడింది. ఆనంద్, పిల్లలు స్కూల్‌కి వెళ్లాక అక్కా చెల్లెళ్లు కూర్చున్నారు తాపీగా. భార్యా భర్తల మధ్య అభిప్రాయభేదాలు, చిన్న చిన్న గొడవలూ సాధరణమేనని నచ్చ జెప్పేందుకు రేఖ ఎంత ప్రయత్నించినా వినడం లేదు ఉష. మాటలతో చెప్తే తనకు అర్థం కాదని అర్థమైంది రేఖకు. అందుకే వంటింట్లోకి తీసుకెళ్లింది. రెండు గిన్నెల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టింది. నీళ్లు బాగా మరిగాక ఒక గిన్నెలో గుడ్లు, క్యారట్లు... మరో గిన్నెల్లో కాఫీ గింజలు వేసింది. ‘‘గుడ్లు, క్యారెట్లు కలిపి వండుతావా ఏంటక్కా?’’.. ఆశ్చర్యంగా అడిగింది ఉష. అవునని తలూపింది రేఖ. ‘‘అవునా? కోడిగుడ్లు, క్యారెట్లు కలిపి వండుతారని నాకు ఇప్పటివరకూ తెలియదు.’’ ‘‘ఇప్పుడు తెలిసిందిగా. ఎలా చేస్తానో చూడు.’’ ఆసక్తిగా చూస్తోంది ఉష. బాగా ఉడికాక స్టవ్ ఆపేసి, ఓ ప్లేటులో క్యార ట్, కోడిగుడ్డు పెట్టి... ‘‘ఆ క్యారెట్ ఎలా ఉందో చూడవే’’ అంది. ‘‘మెత్తగా ఉందక్కా.’’ ‘‘మరి గుడ్డు?’’ ‘‘గట్టిగా ఉంది.’’ ‘‘సరే... ఈ కాఫీ ఎలా ఉందో చెప్పు’’ అంటూ మరగబెట్టిన డికాషన్‌తో కాఫీ కలిపి ఇచ్చింది. ‘‘సూపర్‌గా ఉందక్కా.’’ ‘‘నువ్వు క్యారట్లా ఉంటావా? కోడి గుడ్డులా ఉంటావా? లేదంటే కాఫీలా ఉండాలనుకుంటున్నావా?’’ అడిగింది చెల్లెలి ముఖంలోకి చూస్తూ. అర్థం కాలేదు ఉషకి. అయోమయంగా ఫేస్ పెట్టింది. ‘‘నీకు అర్థం కాలేదు కదా. సరే... మామూలుగా క్యారెట్, గుడ్డు, కాఫీ గింజలు ఎలా ఉంటాయ్?’’ ‘‘క్యారట్, కాఫీ గింజలు గట్టిగా ఉంటాయి. గుడ్లు డెలికేట్‌గా ఉంటాయి.’’ ‘‘కదా... మరిగే నీళ్లలో వేసి ఉడకబెట్టాక?’’ ‘‘క్యారెట్ మెత్తగా అవుతుంది. గుడ్లు గట్టిగా మారతాయి. కాఫీగింజలు కూడా కాస్త మెత్తబడతాయి.’’ ‘‘కరెక్ట్. చూడూ... మరిగే నీళ్లు మన లైఫ్‌లో వచ్చే సమస్యల్లాంటివి. అందరికీ ఎప్పుడో ఒకసారి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటికి ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతారు’’ అని చెల్లెలి వైపు చూసింది. ఆమె శ్రద్ధగా వింటోంది. దాంతో హుషారుగా చెప్పసాగింది. ‘‘కొందరు మొదట్లో క్యారట్లా గట్టిగా ధైర్యంగా ఉంటారు. కానీ సమస్యలు తట్టుకోలేక మెత్తబడతారు. కొందరు గుడ్డులా సున్నితమైన మనసుతో ఉంటారు. కానీ సమస్యలతో మనసును రాయిలా మార్చుకుంటారు. మరికొందరు కాఫీ గింజల్లా తెలివిగా ఉంటారు. తమ సమయస్ఫూర్తితో చుట్టూ ఉన్న సమస్యలను కూడా సువాసనాభరితంగా, అంటే తమకు నచ్చేలా, సంతోషాన్ని ఇచ్చేలా మార్చేస్తారు. అర్థమైందా?’’ ‘‘హా... అర్థమైందక్కా.’’ ‘‘ఇప్పుడు చెప్పు... నువ్వెలా ఉన్నావ్? ఎలా ఉండాలను కుంటున్నావ్?’’ ‘‘ఇప్పుడు నేను ఎగ్లా ఉన్నాను. కానీ భవిష్యత్తులో కాఫీ గింజల మాదిరిగా ఉండాలనుకుంటున్నాను .’’ ‘‘దట్స్ గుడ్. ఆల్ ద బెస్ట్’’ అంటూ ప్రేమగా చెల్లెల్ని హగ్ చేసుకుంది రేఖ. - డాక్టర్ విశేష్ కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
రూ. కోటి తెస్తేనే కాపురమంటున్నాడు
* మేడ్చల్ ఎస్ఐ సతీష్‌పై భార్య శిరీష ఆరోపణ * అతని నుంచి రక్షించాలని అభ్యర్థన రాజమండ్రి క్రైం: తన భర్త, మేడ్చల్ ఎస్ఐ సతీష్ రూ. కోటి అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధిస్తున్నాడని రాజమండ్రికి చెందిన శిరీష వాపోయింది. అతడి బారి నుంచి తనకు, తన తండ్రికి రక్షణ కల్పించాలని వేడుకుంది. బుధవారం ఆమె ‘సాక్షి’ మీడియూతో తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ ఎస్ఐగా పనిచేస్తున్న సతీష్‌కు శిరీషనిచ్చి పెళ్లి చేసినప్పుడు రూ.17 లక్షల కట్నం, నాలుగు అంతస్తుల బిల్డింగ్, ఇతర లాంఛనాలు ఇచ్చారు. అయితే రూ. కోటి అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి రావాలని చెప్పి తొమ్మిదవ రోజునే శిరీషను బయటకు గెంటివేశాడు. తరచూ ఆమెకు ఫోన్లు చేసి ఎస్ఐగా తన వద్దకు వచ్చే కేసుల నుంచి అక్రమంగా ఎలా సంపాదిస్తున్నదీ వివరించేవాడు. అంత భారీగా సంపాదిస్తున్న తనకు రూ. కోటి కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకువెళతానని చెప్పేవాడు. భర్తతో పాటు అత్త మామలు, ఆడపడుచులు శిరీషను వేధించేవారు. దీంతో శిరీష తన భర్తపై గతేడాది అక్టోబర్ 17న రాజమండ్రి మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. కాగా భర్త తనపైనా, తన తండ్రిపైనా తిరిగి అక్రమ కేసులు పెట్టాడని, ఆ ‘క్రిమినల్ ఎస్ఐ’ నుంచి తమకు రక్షణ కల్పించాలని శిరీష వేడుకుంది. -
మరుగు దొడ్డి నిర్మించకపోతే కాపురం చేయకండి
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు. మరుగుదొడ్డి వాడని వాడు మనిషే కాదని అన్నారు. మరుగుదొడ్డి నిర్మించకపోతే మహిళలు కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లాలని సూచించారు. మరుగుదొడ్ల వినియోగం వల్ల 20 శాతం వ్యాధులను దూరం చేయవచ్చని, వీటి నిర్మాణం ద్వారా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ స్థాపనకు మార్గం ఏర్పడుతుందని చెప్పారు.