ఒక పొరపాటుకు యుగములు పొగిలే గుప్పెడు మనసు | Ages oversight mind a handful of flattering | Sakshi
Sakshi News home page

ఒక పొరపాటుకు యుగములు పొగిలే గుప్పెడు మనసు

Published Tue, Feb 21 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

ఒక పొరపాటుకు యుగములు పొగిలే గుప్పెడు మనసు

ఒక పొరపాటుకు యుగములు పొగిలే గుప్పెడు మనసు

నాటి సినిమా

ఒకరితో సంబంధం పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడం బేబీకి ఇష్టం లేదు. అలాగని తన వల్ల విద్య, బుచ్చిబాబులు విడిపోయి ఉండటం కూడా ఇష్టం లేదు. ఇదో చిక్కుముడి. ఎలా విప్పాలి?

సరిత కోసమే ఈ సినిమా తీశారా, సరిత వల్లనే ఈ సినిమా బాగుందా, సరితతోటే ఈ సినిమా గుర్తుండిపోయిందా చెప్పలేం. సినిమాలో సరిత పాత్ర పేరు ‘బేబీ’. చిన్న పిల్ల. పెద్దగా అవుతున్న పిల్ల. మనసు, శరీరమూ ఎదిగీ ఎదుగుతూ అలజడికి లోనవుతున్న అల్లరి పిల్ల. ఆమె తల్లి ఒక మాజీ నటి. వేషాలు లేవు. తండ్రి వాళ్లను విడిచి పెట్టి చాలా కాలం అవుతోంది. ఏదో గుట్టుగా కాపురం నడుస్తోంది. ఈ లోపు పక్కింట్లో ఒక ఆర్కిటెక్ట్‌ కుటుంబం దిగింది. భర్త బుచ్చిబాబుగా శరత్‌బాబు, భార్య విద్యగా సుజాత బేబికి పరిచయం అవుతారు. బేబీ ఈ ఇంటికి వస్తుంటుంది, పోతుంటుంది. కాని కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది.

బేబీ తల్లి హటాత్తుగా చనిపోతుంది. దాంతో బుచ్చిబాబు, విద్యల కుటుంబమే బేబీ కుటుంబం అవుతుంది. బేబిని వాళ్లు చదివిస్తుంటారు.కాని ఒకరోజు వానలో తడిసిన బేబీ బుచ్చిబాబు మనసును బలహీనం చేస్తుంది. క్షణికవాంఛకు అతడు లోబడతాడు. బేబీని లోబరుచుకుంటారు. అది వాన కురిసిన రోజు. కాని బంగారంలాంటి మూడు జీవితాల్లో తుఫాను కొట్టిన రోజు. వారిద్దరు కలిసి ఉండటం బుచ్చిబాబు భార్య చూసేస్తుంది. బుచ్చిబాబు కూతురు కూడా చూసేస్తుంది. ఎంత హుందాగా ఉండాలనుకున్నా ఆమెలోని సగటు స్త్రీ భర్తతో విడిపొమ్మనే చెబుతుంది. భార్యాభర్తల మధ్య అగాధం... ఈలోపు బేబీ గర్భం దాలుస్తుంది.ఒకరితో సంబంధం పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడం బేబీకి ఇష్టం లేదు. అలాగని తన వల్ల విద్య, బుచ్చిబాబులు విడిపోయి ఉండటం కూడా ఇష్టం లేదు. ఇదో చిక్కుముడి. ఎలా విప్పాలి?

చివరకు తొమ్మిదంతస్తుల భవంతి టెర్రస్‌ మీద బేబీ తన కూతురి బర్త్‌డే పార్టీకి బుచ్చిబాబును, విద్యను పిలుస్తుంది. వారి చేత ఒకరినొకరికి క్షమాపణ చెప్పిస్తుంది. ఇక మీదట తన అడ్డంకి ఉండదని చెప్పి, హాయిగా బతకమని కోరి, హటాత్తుగా అంత ఎత్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. విద్య బేబీ కూతురిని దగ్గరకు తీసుకుంటూ ఉండగా సినిమా ముగుస్తుంది. 1979లో ఇలాంటి కథతో ఒక సినిమా తీయడమే పెద్ద సాహసం. కాని దర్శకుడు బాలచందర్‌ తన విశేష ప్రతిభతో సినిమాను నడిపి తానెందుకు గొప్ప దర్శకుడో నిరూపిస్తాడు. సినిమాలో ఎన్నో అంతరార్థాలు, ఆంతర్యాలు ఉన్నాయి. సినిమాలో సుజాత సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌. అన్నీ రూల్సు ప్రకారం ఉండాలని రూల్సు మాట్లాడుతుంటుంది. కాని మనసుకు, అనూహ్యమైన మానవ ప్రవర్తనకు రూల్సు ఉండవు. ఆ సంగతి తన ఇంట్లో జరిగిన ఉదంతం ద్వారా దర్శకుడు మనకు చెబుతాడు. బేబీ పాత్ర పరిచయం అయ్యే మొదటి సన్నివేశంలోనే సుజాత సరదాగా ‘కెవ్వు’మని కేక వేస్తుంది. క్లయిమాక్స్‌లో కూడా భీతావహంగా బేబీ ఆత్మహత్యను చూస్తూ ‘కెవ్వు’ను కేక వేయాల్సి వస్తుంది. బేబీ పాత్ర రాకపోకలు అవే. ఆమెను తీవ్రంగా తల్లకిందులు చేసేవే.

స్త్రీ, పురుష ఆకర్షణల్లో చంచలమైన మనసు మనుషులను నీటన ముంచుతుంది. నిప్పున కాలుస్తుంది. దాని మాయలో పడని వాళ్లు ఉండరు. దాని చెలగాటంతో సతమతమవని వారూ ఉండరు. మనసును అర్థం చేసుకోకపోతే ఎదుటి మనిషి తప్పొప్పులను సరిగా అర్థం చేసుకోలేము. ఆ మాటే ఈ సినిమా చెబుతుంది. గణేశ్‌ పాత్రో మాటలు, ఆత్రేయ పాటలు అందరికీ గుర్తుంటాయి. ‘నేనా పాడనా పాట’.. ‘నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా’ పాటలు ఇప్పటికీ రేడియోలో హిట్‌. ఇక మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ ఆల్‌టైమ్‌ క్లాసిక్‌. ‘లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’ అనే పంక్తిలో వెతుక్కుంటే వేయి అర్థాలు. 1979లో ద్విభాషా చిత్రంగా రూపొందిన గుప్పెడు మనసు తెలుగులో, తమిళంలో భారీ విజయం నమోదు చేసింది. మనసు ఒక మరీచిక. మాయలేడీ. ఆ విషయాన్నే ఎంతో ప్రతిభావంతంగా ఈ సినిమా చెప్పగలిగింది. అందుకే ఇది కాంచనం. మేలిమి బంగారం. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌. నాటి సినిమా.
– కె

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement