క్యాన్సర్ కాపురం | Cancer Kapuram! | Sakshi
Sakshi News home page

క్యాన్సర్ కాపురం

Published Fri, Sep 9 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

క్యాన్సర్ కాపురం

క్యాన్సర్ కాపురం

భరోసా
క్యాన్సర్ ప్రాణాంతకవ్యాధి. రాక్షసుడైన భర్త దొరికితే కాపురం కూడా ప్రాణాంతకమే. హైదరాబాద్ గోల్కొండకు చెందిన అర్షియా నాజిమా ఈ రెండు క్యాన్సర్ల బారిన పడింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వదిలేసిపోయాడు. చుట్టూ గాఢాంధకారం. కావల్సింది ఈ సమాజం ఉంది అన్న భరోసా. అశ్రువును తుడిచే ఔషధం.
 
ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, థర్డ్ బ్లాక్, సెకండ్ ఫ్లోర్‌లో 20వ నంబర్ బెడ్‌పైన అచేతనంగా పడుకొని ఉంది 32 ఏళ్ళ అర్షియా నాజిమా. వెంట్రుకలు ఊడిపోయి పలుచబడిన తలను చున్నీలాంటి దానితో కప్పుకుని ఉంది. చున్నీని చూపిస్తూ పెగలని గొంతుతో అంది- నా భర్త ఇలాంటి చిన్న గుడ్డ కూడా ఎరుగడు. ఆ చున్నీ వెనుక ఉన్న శరీరమే అతనికి కావాల్సింది అని. ఆమెది ఇరవై ఏళ్ల విషాద గాథ. విన్నవారికి మనిషికి ఇలాంటి కష్టాలు ఉంటాయా అనిపించేంత వేదన. ఆ వేదనను ఆమె ఇలా ఏకరువు పెట్టింది.
 
‘‘మాది గోల్కొండ ఏరియా. మా నాన్న గోల్కొండ ఫోర్ట్ దగ్గర చరిత్ర పుస్తకాలు అమ్మేవాడు. మేము ఏడుమంది సంతానం. నలుగురు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. నేను చివరిదాన్ని. నాన్న సంపాదన అంతంత మాత్రం కావడంతో మాది చాలీచాలని బతుకని చెప్పాలి. నా భర్త ఒక హాస్పిటల్‌లో అటెండర్‌గా పని చేసేవాడు. పేరు మహ్మద్ అలీ అహ్మద్. మా ఏరియాలోనే వాళ్లూ ఉండేవాళ్లు. నన్ను చూసి చేసుకుంటానని వెంటపడ్డాడు. మా పెళ్లి జరిగిపోయింది...
 
అత్త రాక్షసి...

మా అత్తకు ఈ పెళ్లి ఇష్టం లేదో లేదంటే కొడుకు నా ప్రేమలో ఆమెను నిర్లక్ష్యం చేస్తాడని భయమో చాలా రాక్షసంగా ప్రవర్తించేది. నా భర్తతో నా తొలిరాత్రి జరిగిన సంఘటనే భయానకమైనది. మా అత్త తొలిరాత్రి నన్ను నా భర్త దగ్గర నుంచి ఈడ్చుకొచ్చి ‘ఇంత లావుగా వున్నావు. వెళ్లి వాకింగ్ చేసిరా’ అని ఇంటి నుంచి బయటకు నెట్టింది. అంత రాత్రిపూట ఏం చేయాలో తోచక బిక్కు బిక్కుమంటూ ఇంటి బయటే గడిపాను. నా భర్త నీడని కూడా తాకకుండా చాలా రోజులు కాపలా కాసింది మా అత్త. ఇంటికి సరైన తలుపు కూడా లేని గదిని మాకిచ్చింది. చుట్టుపక్కల కుర్రాళ్ళు అర్ధరాత్రుళ్ళు తలుపుకొడుతుంటే భయంతో నిద్రలేని రాత్రిళ్ళు గడిపాను. పెళ్ళయిన కొత్తలో నా భర్త లేని సమయంలో ఎవడో ఒక అపరిచితుడిని నా గదిలోకి నెట్టి బయట గడిపెట్టింది నా అత్త. భయంతో కేకలు పెట్టాను.
 
ఆడపిల్ల ఇష్టం లేదు...
నాకు తొలిచూలు ఆడపిల్ల. నా భర్తకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు. అత్తకు కూడా. కాని పుట్టిన బిడ్డను ఎలా వద్దనుకుంటాం. పాప పుట్టిన ఆరు నెలలకు రంజాన్ పండుగ వచ్చింది. అందరూ కొత్త గుడ్డలు కొనుక్కుంటున్నారు. నా చూపు వాళ్ల గుడ్డలపైన లేదు. గిన్నె నిండా వున్న పాలపైన వుంది. బిడ్డ నా దగ్గర పాలు తాగడం లేదు. గిన్నెలో పాలు పడదామని చిన్నగ్లాసుడు పాలు తీసుకున్నాను. అంతే నా ఐదుగురు ఆడబిడ్డలూ, భర్తా, అత్తా కలిసి నన్ను గొడ్డును బాదినట్టు బాదారు. రెండో కాన్పులో మగపిల్లాడు పుట్టాడు.  కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బిడ్డ చాలా అందంగా పుట్టాడని వాడు నా కొడుకు కాదని వెళ్లిపోయాడు.

నా అన్నలే ఆసుపత్రి బిల్లు కట్టి ఇంటికి తెచ్చారు. నా అదృష్టమో దురదృష్టమో మూడో కాన్పులో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. అదే నా నేరం అయ్యింది. నన్ను విడిచి వెళ్లిపోయాడు. తొమ్మిదేళ్లుగా అతడు ఏమయ్యాడో నాకు తెలియదు. ఎప్పుడూ రాలేదు. కనీసం ‘తలాక్’ కూడా చెప్పలేదు. పెళ్లయిన 20 ఏళ్ళలో తండ్రిగా తన బాధ్యతను ఏనాడూ నిర్వర్తించలేదు. పిల్లలకి ఓ బిస్కెట్టు కొనిపెట్టిన  జ్ఞాపకం నాకు లేదు. కనీసం వాళ్ళనాన్న మొహం ఎలా వుంటుందో చూసిన  జ్ఞాపకం నా పిల్లలకి లేదు.
 
బ్లడ్ క్యాన్సర్...
మూడు నెలల క్రితం ఆరోగ్యం సరిగా ఉండకపోతే హాస్పిటల్‌లో చూపించుకున్నాను. నాకు ఎఎంపిఎల్ బ్లడ్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అని చెప్పారు. భోరున విలపించాను. పదహారేళ్ళకే నన్ను జీవచ్ఛవంలా మార్చిన  అత్తగారితో పోరాడాను. చిన్నవయస్సులోనే మోయలేని భారాన్ని నా భర్త మిగిల్చి పోతే విధితో పోరాడాను. కాని ఈ క్యాన్సర్‌తో మాత్రం పోరాడలేకున్నాను.  ఇంత ఖరీదైన జబ్బుని తట్టుకునే స్థాయి కాదు మాది. కటిక పేదరికం అనుభవిస్తున్నాం. అయినప్పటికీ ఎలాగో కష్టాలు పడి జూలై మొదటి తారీఖున ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు మా అన్నలు. 35 రోజులు ఇక్కడే ఉన్నాం. రెండున్నర లక్షలకు పైగా ఖర్చయ్యింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 85 వేలు సాయం చేసింది. నిజాం ట్రస్ట్ కొంత సాయపడింది. మా బంధువులు, మిత్రులు అంతా ఏదో తోచిన సాయం చేసారు. ఇప్పుడు మళ్లీ హాస్పిటల్‌లో చేరాను. ఈ జబ్బుకి ఇంకా చాలా ఖర్చవుతుందంటున్నారు. దాదాపు 20 లక్షలు. అంత డబ్బు ఎలా తేగలం?
 
నువ్వు అమ్మవవుతావా తల్లీ...
నా పెద్ద కూతురు గులఫ్షా ఇంటర్మీడియట్ చదువుతోంది. కొడుకు ఒజియాప్‌కి 11 ఏళ్ళు. సెవెంత్ క్లాస్. చిన్నకూతురు మరియంకి తొమ్మిదేళ్ళు ఫోర్త్ చదువుతోంది.  నాకేదైనా అయితే నా పిల్లలేం అవుతారోనని నా బెంగ.  నా చిన్న కూతురు మరియంకి దిండుపైన పడుకునే అలవాటు లేదు. నా చేతిపైనే ఎప్పుడూ నిద్దరోతుంది. గత మూడు నెలలుగా నేను ఆసుపత్రిలో ఉన్నాను. అప్పటి నుంచి ఇంట్లో నా బిడ్డకి నిద్రలేదు. ఆమే కాదు.

నా ముగ్గురు పిల్లలకీ కంటిపైన కునుకులేదు. బక్కచిక్కి పోయారు. నా బిడ్డలకు తల్లీ తండ్రీ నేనే. ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్‌తో నేను చనిపోతే వాళ్ళేమౌతారోనని నా గుండె తరుక్కుపోతోంది. అల్లా నాకిలా చేసి ఉండాల్సింది కాదు. నా అన్నలిద్దరూ గోల్కొండకోటలో టూరిస్ట్ గైడ్స్. వాళ్ళకొచ్చే నాలుగైదొందల్లో ప్రతి రోజూ నాకు యాభయ్యో వందో ఇచ్చి నన్ను పోషిస్తూ వచ్చారు. గత మూడు నెలలుగా వాళ్లిద్దరూ వంతులు వేసుకొని నా దగ్గర ఉంటున్నారు.  

ఒక్కరోజు డబ్బుల్లేకపోయినా పొయ్యి వెలగని పరిస్థితి మాది. నా బిడ్డలకోసమే నాకు బతకాలని వుంది. అల్లా కరుణిస్తే, ఎవరైనా సాయం చేస్తే నేను బతుకుతానన్న ఆశ వుంది. ‘నేను చనిపోతే నీ చెల్లికీ, తమ్ముడికీ నువ్వు అమ్మవవుతావా అమ్మా’ అని నా పెద్దకూతురిని అడిగాను. బోరున ఏడ్వడం తప్ప తను సమాధానం చెప్పలేకపోయింది. అల్లానే నాకు అన్యాయం చేసాడు. ఇక నా కష్టం ఎవరు తీరుస్తారు’’.
- అత్తలూరి అరుణ
ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి
 
అర్షియా నాజిమాకు సహాయం చేయదలచినవారు 96185 52260కు సంప్రదించవచ్చు.
అకౌంట్ వివరాలు: MD Baseed Khan, A/C No. 3243700561, CBI, Chota Bazar, Golconda Fort, IFS Code CBIN0 282389లో కూడా డబ్బు జమ చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement